ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) తెలుగు — 2019

సంఖ్యా కాండము 6

ఈ అధ్యాయాన్ని తెలుగులో చదవవచ్చు. Divine Threads అధ్యయనాలు తరువాత జోడించబడతాయి.

1తరువాత యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు.
2“ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి ఇలా చెప్పు. ఎవరన్నా స్త్రీ గానీ పురుషుడు గానీ తనను యెహోవా కోసం ప్రత్యేకపరచుకుని నాజీరు కావడానికి మొక్కుకుంటే ఆ వ్యక్తి ద్రాక్షారసాన్ని గానీ మత్తు కలిగించే పానీయాలు గానీ తీసుకోకూడదు. పులిసిన ద్రాక్షారసం గానీ మద్యాన్ని గానీ తీసుకోకూడదు.
3ఎలాంటి ద్రాక్షారసాన్నీ తాగకూడదు. ద్రాక్షాపళ్ళు పండినవైనా, ఎండినవైనా తినకూడదు.
4నా కోసం అతడు ప్రత్యేకంగా ఉన్న రోజుల్లో ద్రాక్ష తీగల నుండి తీసిన దేనినీ తినకూడదు. అవి పచ్చి కాయలైనా, పైన ఉండే తోలు అయినా తినకూడదు.
5అతడు ప్రత్యేకంగా ఉండాలని మొక్కుకున్న రోజుల్లో మంగలి కత్తి అతడి తలని తాకకూడదు. యెహోవాకు ప్రత్యేకంగా ఉండాలని మొక్కుకున్న రోజులు పూర్తయే వరకూ జుట్టు పెరగనియ్యాలి. దేవుని కోసం అతడు ప్రత్యేకంగా ఉండాలి. తలపై జుట్టు పొడుగ్గా పెరగనియ్యాలి.
6అతడు తనను యెహోవాకు ప్రత్యేకించుకున్న రోజుల్లో మృతదేహాన్ని సమీపించకూడదు.
7తన తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి, వీరిలో ఎవరు మరణించినా అతడు వారిని తాకి తనను అపవిత్రం చేసుకోకూడదు.
8అతడు ప్రత్యేకంగా ఉన్న రోజుల్లో పవిత్రంగా ఉంటాడు. యెహోవా కోసం ప్రత్యేకంగా ఉంటాడు.
9ఎవరైనా అతని పక్కనే అకస్మాత్తుగా పడి చనిపోతే, దానివల్ల ప్రత్యేకంగా ఉండే వ్యక్తి అపవిత్రుడైతే అతడు తాను పవిత్రం అయ్యాక అంటే ఏడు రోజుల తరువాత తన తల జుట్టుని కత్తిరించుకోవాలి. అంటే ఏడో రోజున కత్తిరించుకోవాలన్నమాట.
10ఎనిమిదో రోజున అతడు రెండు గువ్వలను గానీ లేదా రెండు పావురం పిల్లలను గానీ పట్టుకుని వాటిని సన్నిధి గుడారం ద్వారం దగ్గర ఉన్న యాజకుడి దగ్గరికి తీసుకురావాలి.
11అప్పుడు యాజకుడు ఒకదాన్ని పాపం కోసం చేసే బలిగా. రెండో దాన్ని దహనబలిగా అర్పించాలి. ఆ వ్యక్తి మృతదేహాన్ని తాకి పాపం చేసాడు కాబట్టి ఇవి అతని కోసం పరిహారం అవుతాయి. ఆ రోజునే అతడు తనను తను పవిత్రం చేసుకోవాలి.
12తరువాత అతడు తిరిగి నాజీరుగా ఉండే కాలాన్ని ప్రతిష్టించాలి. అతడు అపరాధ బలిగా ఒక ఏడాది వయసున్న మగ గొర్రె పిల్లని తీసుకురావాలి. అతడు అపవిత్రుడు కాకముందు మొక్కుకున్న రోజులు లెక్కలోకి రాకూడదు. ఎందుకంటే అతడు యెహోవా కోసం ప్రత్యేకంగా ఉండి అపవిత్రం అయ్యాడు.
13నాజీరుగా ఉండటానికి మొక్కుకుని ఆ నాజీరుగా ఉండే సమయం ముగిసిన తరువాత అతడు చేయాల్సిన దాని గురించిన చట్టం ఇది. అతణ్ణి సన్నిధి గుడారం ద్వారం దగ్గరకి తీసుకురావాలి.
14అతడు తన అర్పణ యెహోవాకు అర్పించాలి. ఒక ఏడాది వయసున్న లోపరహితమైన ఒక మగ గొర్రెపిల్లని దహనబలిగా అర్పించాలి. అలాగే ఒక ఏడాది వయసున్న లోపరహితమైన ఆడ గొర్రెపిల్లను పాపం కోసం చేసే అర్పణగా తీసుకురావాలి. అతడింకా లోపరహితమైన ఒక పొట్టేలును శాంతి బలిగా తీసుకురావాలి.
15అలాగే అతడు తన నైవేద్య అర్పణ, పానార్పణలతో పాటు పొంగజేసే పదార్ధం లేకుండా చేసిన గంపెడు రొట్టెలూ, సన్నని గోదుమ పిండితో నూనె రాసి చేసిన వంటకాలూ, పొంగజేసే పదార్ధం లేకుండా నూనె రాసి చేసిన అప్పడాలూ యెహోవా దగ్గరకి తీసుకురావాలి.
16అప్పుడు యాజకుడు యెహోవా సమక్షంలోకి వాటిని తెచ్చి అతడి కోసం దహనబలినీ, పాపం కోసం చేసే బలినీ అర్పించాలి.
17పొంగజేసే పదార్ధం లేకుండా చేసిన రొట్టెల గంపతో పాటు ఆ పొట్టేలును యెహోవాకు శాంతి బలిగా అర్పించాలి. అతని నైవేద్యాన్ని పానార్పణతో కలిపి అర్పించాలి.
18అప్పుడా నాజీరు సన్నిధి గుడారం ద్వారం దగ్గర తన ప్రత్యేకతను సూచించే తల జుట్టు కత్తిరించుకోవాలి. ఆ జుట్టును శాంతిబలి అర్పణ సామగ్రి కింద ఉన్న మంటలో పడవేయాలి.
19అప్పుడు యాజకుడు ఉడికిన పొట్టేలు జబ్బనీ గంపలోనుండి పొంగని పదార్ధంతో చేసిన ఒక రొట్టెనూ పొంగని పదార్ధంతో చేసిన ఒక అప్పడాన్నీ తీసుకోవాలి. యాజకుడు వాటిని ప్రత్యేకతను సూచించే తన తల వెండ్రుకలు కత్తిరించుకున్న నాజీరు చేతుల్లో ఉంచాలి.
20తరువాత యాజకుడు యెహోవా సమక్షంలో పైకెత్తి కదిల్చే అర్పణ గా వాటిని కదిలించాలి. వాటిని యెహోవాకు అర్పించాలి. అది పవిత్ర ఆహారం. పైకెత్తి కదిలించిన రొమ్ము భాగం, తొడ భాగంతో కలిపి ఇది యాజకునికి చెందుతుంది. దాని తరువాత ఆ నాజీరు ద్రాక్షారసం తాగవచ్చు.
21మొక్కుకున్న నాజీరును గురించిన ఉపదేశం ఇది. తనను యెహోవా కోసం ప్రత్యేకించుకోడానికి అతడు అర్పించాల్సిన వాటిని గురించిన ఉపదేశం ఇది. తాను నాజీరు కావడానికి మొక్కుకున్న దంతా అతడు నెరవేర్చాలి.” యాజకుడు ప్రజలను దీవించే విధానం
22యెహోవా మళ్ళీ మోషేతో మాట్లాడాడు.
23“అహరోనుకూ అతని కొడుకులకూ ఇలా చెప్పు. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఈ విధంగా దీవించాలి. మీరు వారితో ఇలా చెప్పాలి.
24యెహోవా మిమ్మల్ని దీవించి సంరక్షిస్తాడు గాక!
25యెహోవా మీపై తన వెలుగు ప్రకాశింప చేస్తాడు గాక! మిమ్మల్ని కరుణిస్తాడు గాక!
26యెహోవా మిమ్మల్ని కన్నులారా చూసి మీకు శాంతి ప్రసాదించు గాక!
27ఈ విధంగా వారు ఇశ్రాయేలు ప్రజలకి నా నామాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. నేను అప్పుడు వారిని దీవిస్తాను.”
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
The Indian Revised Version Holy Bible in Telugu.
Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.

Bible text licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0).Original Telugu Scripture and full source copyright terms. This verse-only display adapts the original presentation by removing book introductions, editorial headings, source HTML formatting, and inline explanatory footnote popups while preserving Scripture wording and combined original verse ranges. This presentation of the Bible text remains under CC BY-SA 4.0; the copyright holder does not necessarily endorse these changes. Divine Threads study content is independently authored and separate from the licensed Scripture text.