ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) తెలుగు — 2019

సంఖ్యా కాండము 19

ఈ అధ్యాయాన్ని తెలుగులో చదవవచ్చు. Divine Threads అధ్యయనాలు తరువాత జోడించబడతాయి.

1యెహోవా మోషే అహరోనులతో,
2“యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదంటే, ఇశ్రాయేలీయులు కళంకం లేనిదీ, మచ్చ లేనిదీ, ఎప్పుడూ కాడి మోయ్యని ఎర్ర ఆవును నీ దగ్గరికి తీసుకురావాలని వారితో చెప్పు.
3మీరు యాజకుడైన ఎలియాజరుకు దాన్ని అప్పగించాలి. ఒకడు పాళెం బయటికి దాన్ని తోలుకెళ్ళి అతని ఎదుట దాన్ని వధించాలి.
4యాజకుడైన ఎలియాజరు దాని రక్తం కొంచెం వేలితో తీసి, సన్నిధి గుడారం ఎదుట ఆ రక్తాన్ని ఏడుసార్లు చిమ్మాలి.
5అతని కళ్ళ ఎదుట ఒకడు ఆ ఆవును కాల్చాలి. దాని చర్మం, మాంసం, రక్తం, పేడతో సహా కాల్చెయ్యాలి.
6ఇంకా ఆ యాజకుడు దేవదారు కర్ర, హిస్సోపు, ఎర్రరంగు నూలు తీసుకుని, ఆ ఆవును కాలుస్తున్న మంటల్లో వాటిని వెయ్యాలి.
7అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉతుకుకుని, నీళ్లతో తలస్నానం చేసిన తరువాత పాలెంలో ప్రవేశించి సాయంకాలం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.
8దాన్ని కాల్చినవాడు నీళ్లతో తన బట్టలు ఉతుకుకుని నీళ్లతో తలస్నానం చేసి సాయంకాలం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.
9ఇంకా శుద్ధుడైనవాడు ఒకడు ఆ ఆవు బూడిదను పోగు చేసి పాలెం బయట ఒక శుద్ధమైన స్థలంలో పెట్టాలి. ఆ బూడిదను ఇశ్రాయేలీయుల సమాజం కోసం భద్రం చెయ్యాలి. ఆ బూడిద పాపపరిహారార్ధ అర్పణ నుంచి వచ్చింది గనక, పాపం నుంచి శుద్ధీకరణ కోసం వారు ఆ బూడిదను నీళ్ళతో కలుపుతారు.
10ఆ ఆవు బూడిదను పోగు చేసిన వాడు తన బట్టలు ఉతుక్కుని, సాయంకాలం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. ఇది ఇశ్రాయేలీయులకూ, వారిల్లో నివాసం ఉంటున్న పరదేశులకూ శాశ్వతమైన శాసనం.
11మానవ శవాన్ని ముట్టుకున్నవాడు ఏడు రోజులు అశుద్ధుడుగా ఉంటాడు.
12అతడు మూడో రోజు ఆ నీళ్ళతో పాపశుద్ధి చేసుకుని, ఏడో రోజు శుద్ధుడౌతాడు. అయితే అతడు మూడో రోజు పాపశుద్ధి చేసుకోకపోతే ఏడో రోజు శుద్ధుడు కాడు.
13మనిషి శవాన్ని ముట్టుకున్నవాడు ఆ విధంగా పాపశుద్ధి చేసుకోకపోతే అతడు యెహోవా మందిరాన్ని అపవిత్రం చేసినవాడౌతాడు. పాపపరిహార జలం అతని మీద చల్ల లేదు గనక ఆ వ్యక్తిని ఇశ్రాయేలీయుల్లో లేకుండా చెయ్యాలి. అతడు అశుద్ధుడుగానే ఉండిపోతాడు. అతని అశుద్ధత అతని మీద ఉంటుంది.
14ఎవరైనా ఒక గుడారంలో చనిపోతే, దాని గురించిన చట్టం ఇది. ఆ గుడారంలో ప్రవేశించే ప్రతివాడూ, ఆ గుడారంలో ఉన్నవారూ ఏడు రోజులు అశుద్ధంగా ఉంటారు.
15మూత వేయకుండా తెరచి ఉన్న పాత్రలన్నీ అశుద్ధం ఔతాయి.
16గుడారం బయట కత్తితో నరికిన వాడినైనా, శవాన్నైనా, మనిషి ఎముకనైనా, సమాధినైనా ముట్టుకున్నవాడు ఏడు రోజులు అశుద్ధుడుగా ఉంటాడు.
17అశుద్ధుడైన వ్యక్తి కోసం, పాప పరిహారార్థమైన కాలిన బూడిద కొంచెం తీసుకుని ఒక కూజాలో ఉన్న మంచినీళ్ళతో కలపాలి.
18తరువాత ఒక శుద్ధుడు హిస్సోపు తీసుకుని ఆ నీళ్ళల్లో ముంచి, ఆ గుడారం మీద, దానిలోని ఉపకరణాలు అన్నిటి మీదా, అక్కడున్న మనుషుల మీదా చల్లాలి. ఎముకనుగాని, కత్తితో నరికిన వాణ్ణి గాని, శవాన్నిగాని, సమాధినిగాని ముట్టుకున్న వాడి మీద కూడా దాన్ని చల్లాలి.
19మూడో రోజు, ఏడో రోజూ, శుద్ధుడు అశుద్ధుని మీద దాన్ని చల్లాలి. ఏడో రోజు అతడు పాపశుద్ధి చేసుకుని, తన బట్టలు ఉతుక్కుని నీళ్లతో స్నానం చేసి, సాయంకాలానికి శుద్ధుడౌతాడు.
20ఎవరైనా అశుద్ధుడుగానే ఉండి పాపశుద్ధి చేసుకోడానికి నిరాకరిస్తే, అతడు యెహోవా పరిశుద్ధ స్థలాన్ని అశుద్ధం చేశాడు గనక అలాంటి వాణ్ణి సమాజంలో లేకుండా చేయాలి. పాపపరిహార జలం అతని మీద చల్ల లేదు గనక అతడు అశుద్ధుడుగానే ఉంటాడు.
21ఈ పరిస్థితులకు సంబంధించిన శాశ్వతమైన శాసనం ఏదంటే-పాపపరిహార జలం చల్లేవాడు తన బట్టలు ఉతుక్కోవాలి. పాపపరిహార జలం ముట్టుకున్నవాడు సాయంకాలం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. అశుద్ధుడు ముట్టుకున్నదంతా అశుద్ధం
22దాన్ని ముట్టుకున్న వారిందరూ సాయంకాలం వరకూ అశుద్ధులుగా ఉంటారు.”
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
The Indian Revised Version Holy Bible in Telugu.
Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.

Bible text licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0).Original Telugu Scripture and full source copyright terms. This verse-only display adapts the original presentation by removing book introductions, editorial headings, source HTML formatting, and inline explanatory footnote popups while preserving Scripture wording and combined original verse ranges. This presentation of the Bible text remains under CC BY-SA 4.0; the copyright holder does not necessarily endorse these changes. Divine Threads study content is independently authored and separate from the licensed Scripture text.