ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) తెలుగు — 2019

నెహెమ్యా 8

ఈ అధ్యాయాన్ని తెలుగులో చదవవచ్చు. Divine Threads అధ్యయనాలు తరువాత జోడించబడతాయి.

1అప్పుడు ప్రజలంతా ఒకే ఉద్దేశంతో నీటి ద్వారం ఎదురుగా ఉన్న మైదానంలో సమకూడారు. యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకు రమ్మని ఎజ్రాశాస్త్రితో చెప్పారు.
2ఎజ్రా ఏడవ నెల మొదటి రోజున గ్రంథాన్ని చదువుతుండగా అర్థం చేసుకోగలిగే స్త్రీ పురుషులు కలసి ఉన్న సమూహం ఎదుటికి ఆ ధర్మశాస్త్ర గ్రంథం తెచ్చాడు.
3అతడు నీటి ద్వారం ఎదురుగా ఉన్న మైదానంలో ఉదయం నుండి మధ్యాహ్నం దాకా నిలబడి ఉన్న ఆ స్త్రీ పురుషులకు, అంటే జ్ఞానంతో దాన్ని అర్థం చేసుకోగల వారందరికీ వినిపించాడు. ప్రజలంతా ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని శ్రద్ధగా విన్నారు.
4ఆ పని కోసం చెక్కతో చేసిన ఎత్తయిన వేదిక మీద ఎజ్రా నిలబడ్డాడు. అతని కుడివైపు మత్తిత్యా, షెమ, అనాయా, ఊరియా, హిల్కీయా, మయశేయా అనేవాళ్ళు. ఎడమవైపు పెదాయా, మిషాయేలు, మల్కీయా, హాషుము, హష్బద్దానా, జెకర్యా, మెషుల్లాము అనేవాళ్ళు నిలబడ్డారు.
5అప్పుడు అందరికంటే ఎత్తయిన వేదికపై ఎజ్రా నిలబడి ప్రజలంతా చూస్తుండగా గ్రంథం తెరిచాడు. ప్రజలంతా లేచి నిలబడ్డారు.
6ఎజ్రా గొప్ప దేవుడైన యెహోవాను స్తుతించినప్పుడు ప్రజలంతా తమ చేతులు పైకెత్తి ఆమేన్‌, ఆమేన్‌ అని కేకలు వేస్తూ, క్రిందికి నేల వైపుకు తమ తలలు వంచుకుని యెహోవాకు నమస్కరించారు.
7ప్రజలు ఇలా నిలబడి ఉన్న సమయంలో యేషూవ, బానీ, షేరేబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతై, హోదీయా, మయశేయా, కెలీటా, అజర్యా, యోజాబాదు, హానాను, పెలాయా, లేవీయులు ధర్మశాస్త్రం అర్థాన్ని, భావాలను వారికి తెలియజేశారు.
8ఆ విధంగా ప్రజలు మరింత స్పష్టంగా అర్థం చేసుకుని గ్రహించగలిగేలా గ్రంథాన్ని చదివి వినిపించి వాటి సారాంశం తెలియజేసారు.
9ధర్మశాస్త్ర గ్రంథంలోని విషయాలు గ్రహించిన ప్రజలు బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టారు. అధికారి నెహెమ్యా, యాజకుడు, శాస్త్రి అయిన ఎజ్రా, ప్రజలకు వివరించే లేవీయులు వారితో “మీరు ఏడవ్వద్దు. ఈ రోజు మీ దేవుడైన యెహోవాకు కేటాయించిన రోజు” అని చెప్పారు.
10అప్పుడు నెహెమ్యా “బయలు దేరండి. కొవ్విన మాంసం తినండి. ఏదైనా తియ్యటిది తాగండి. ఇప్పటి దాకా తమ కోసం ఏమీ సిద్ధం చేసుకోని వాళ్లకు వాటాలు పంపించండి. ఎందుకంటే ఈ రోజు పరిశుద్ధమైనది. మీరు దుఃఖపడొద్దు. యెహోవాలో ఆనందమే మీ బలం” అని చెప్పాడు.
11ఈ విధంగా లేవీయులు ప్రజలందరినీ ఓదార్చారు. “మీరు దుఃఖించడం ఆపండి. చింతించకండి. ఇది పవిత్రమైన రోజు” అన్నారు.
12ఆ తరువాత ప్రజలు తాము విన్న మాటలన్నీ గ్రహించి, తినడానికీ, తాగడానికీ, లేని వారికి వాటాలు పంపించడానికీ, సంతోషంగా గడపడానికీ ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్లారు.
13రెండవ రోజు ప్రజల పెద్దల్లో ప్రముఖులు, యాజకులు, లేవీయులు ధర్మశాస్త్ర గ్రంథంలోని విషయాలు తెలుసుకోవాలని ఆచార్యుడు ఎజ్రా దగ్గర సమకూడారు.
14యెహోవా మోషేకు అనుగ్రహించిన గ్రంథం పరిశీలించినప్పుడు ఏడవ నెలలో జరిగే పండగ సమయంలో పర్ణశాలల్లో గడపాలని రాసి ఉన్నట్టు వారు కనుగొన్నారు.
15వాళ్ళు యెరూషలేంలో, తమ పట్టణాల్లో ఈ విధంగా చాటింపు వేయించారు. “గ్రంథంలో రాసి ఉన్నట్టు, మీరు కొండలకు వెళ్లి ఒలీవచెట్ల కొమ్మలు, అడవి ఒలీవచెట్ల కొమ్మలు, గొంజి చెట్ల కొమ్మలు, ఈతచెట్ల కొమ్మలు, గుబురుగా ఉండే రకరకాల చెట్ల కొమ్మలు తీసుకువచ్చి పర్ణశాలలు కట్టాలి.”
16కాబట్టి ప్రజలు వెళ్లి కొమ్మలు తెచ్చి అందరూ తమ తమ ఇళ్ళ మీద, వాకిళ్ళలో, మందిరం పరిసరాల్లో, నీటి ద్వారం వీధిలో, ఎఫ్రాయీం ద్వారం వీధిలో పర్ణశాలలు కట్టారు.
17చెర నుండి తిరిగి వచ్చినవాళ్ళంతా పర్ణశాలలు కట్టుకుని వాటిలో ఉన్నారు. అందరూ ఆనందించారు. నూను కొడుకు యెహోషువ జీవిత కాలం తరువాత నుండి ఇప్పటి వరకూ ఇశ్రాయేలీయులు ఈ విధంగా చేయలేదు.
18అంతే కాకుండా, మొదటి రోజు నుండి ఏడవ రోజు వరకూ ప్రతిరోజూ ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథం చదివి, వినిపిస్తూ వచ్చాడు. వాళ్ళు ఇలా వారం పాటు ఈ పండగ రోజులు ఆచరించారు. తరువాత ఎనిమిదవ రోజున నిర్ణయించిన క్రమం ప్రకారం పవిత్ర సమావేశంలో సమకూడారు.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
The Indian Revised Version Holy Bible in Telugu.
Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.

Bible text licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0).Original Telugu Scripture and full source copyright terms. This verse-only display adapts the original presentation by removing book introductions, editorial headings, source HTML formatting, and inline explanatory footnote popups while preserving Scripture wording and combined original verse ranges. This presentation of the Bible text remains under CC BY-SA 4.0; the copyright holder does not necessarily endorse these changes. Divine Threads study content is independently authored and separate from the licensed Scripture text.