ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) తెలుగు — 2019

మత్తయి రాసిన సువార్త 5

ఈ అధ్యాయాన్ని తెలుగులో చదవవచ్చు. Divine Threads అధ్యయనాలు తరువాత జోడించబడతాయి.

1యేసు ఆ ప్రజా సమూహాన్ని చూసి కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు.
2ఆయన తన నోరు తెరచి ఇలా ఉపదేశించ సాగాడు.
3“ఆత్మలో దీనత్వం గలవారు ధన్యులు, పరలోకరాజ్యం వారిదే.
4దుఃఖించే వారు ధన్యులు, వారికి ఓదార్పు కలుగుతుంది.
5సాధుగుణం గలవారు ధన్యులు, ఈ భూమికి వారు వారసులవుతారు.
6నీతిన్యాయాల కోసం ఆకలిదప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పొందుతారు.
7కనికరం చూపే వారు ధన్యులు, వారు కనికరం పొందుతారు.
8పవిత్ర హృదయం గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు.
9శాంతి కుదిర్చేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనిపించుకుంటారు.
10నీతి కోసం నిలబడి హింసల పాలయ్యేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది.
11“నన్ను బట్టి మనుషులు మిమ్మల్ని అవమానించి, హింసించి మీమీద అన్ని రకాల అపనిందలు అన్యాయంగా వేసినప్పుడు మీరు ధన్యులు.
12అప్పుడు సంతోషించండి! ఉప్పొంగిపొండి. పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది. మీకు ముందు వచ్చిన ప్రవక్తలను కూడా మనుషులు ఇలాగే హింసించారు. విశ్వాసి పోలికలు మార్కు 4:21-23; లూకా 8:16-18
13“లోకానికి మీరు ఉప్పు. ఉప్పు తన రుచి కోల్పోతే దానికి ఆ రుచి మళ్ళీ ఎలా వస్తుంది? అలాంటి ఉప్పు బయట పారేసి కాళ్ళ కింద తొక్కడానికి తప్ప ఇక దేనికీ పనికిరాదు.
14ప్రపంచానికి మీరు వెలుగుగా ఉన్నారు. కొండ మీద ఉండే ఊరు కనబడకుండా ఉండదు.
15ఎవరూ దీపం వెలిగించి బుట్ట కింద పెట్టరు. దీపస్తంభం మీదే పెడతారు. అప్పుడు ఆ దీపం ఇంట్లో అందరికీ వెలుగు ఇస్తుంది.
16మీ వెలుగు మనుషుల ముందు ప్రకాశించనీయండి. అప్పుడు వారు మీ మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని కీర్తిస్తారు. క్రీస్తుకు ధర్మశాస్త్రంతో సంబంధం
17“నేను ధర్మశాస్త్రాన్ని గానీ ప్రవక్తల మాటలను గానీ రద్దు చేయడానికి వచ్చాననుకోవద్దు. వాటిని నెరవేర్చడానికే వచ్చాను గానీ రద్దు చేయడానికి కాదు.
18నేను కచ్చితంగా చెబుతున్నాను. ఆకాశం, భూమి నశించే వరకూ ధర్మశాస్త్రమంతా నెరవేరే వరకూ ధర్మశాస్త్రం నుంచి ఒక్క పొల్లు అయినా, ఒక సున్నా అయినా తప్పిపోదు.
19కాబట్టి ఈ ఆజ్ఞల్లో ఎంత చిన్న దానినైనా సరే అతిక్రమించి, ఇతరులకు కూడా అలా చేయమని బోధించేవాణ్ణి పరలోకరాజ్యంలో అతి తక్కువ వాడుగా ఎంచుతారు. కానీ ఈ ఆజ్ఞల ప్రకారం చేస్తూ, వాటిని బోధించేవాణ్ణి పరలోక రాజ్యంలో గొప్పవాడుగా లెక్కిస్తారు.
20ధర్మశాస్త్ర పండితుల, పరిసయ్యుల నీతికన్నా మీ నీతి మిన్నగా ఉండకపోతే మీరు పరలోకరాజ్యంలో ఎంత మాత్రమూ ప్రవేశించలేరని మీతో చెబుతున్నాను.
21“ ‘హత్య చేయవద్దు. హత్య చేసేవాడు శిక్షకు లోనవుతాడు’ అని పూర్వికులకు చెప్పింది మీరు విన్నారు.
22అయితే నేను మీతో చెప్పేదేమిటంటే తన సోదరుని మీద కోపం పెట్టుకొనే ప్రతివాడూ శిక్షకు లోనవుతాడు. తన సోదరుణ్ణి ‘పనికి మాలినవాడా’ అని పిలిచే ప్రతివాడూ మహాసభ ముందు నిలబడాలి. ‘మూర్ఖుడా’ అనే ప్రతివాడికీ నరకాగ్ని తప్పదు.
23“కాబట్టి నీవు నీ కానుకను బలిపీఠం వద్ద అర్పించే ముందు, నీ సోదరునికి నీ మీద ఏదైనా విరోధ భావం ఉందని నీకు గుర్తుకు వచ్చిందనుకో.
24నీ కానుకను అక్కడే, బలిపీఠం ఎదుటే వదిలి వెళ్ళు. ముందు నీ సోదరునితో రాజీ పడు. ఆ తరువాత వచ్చి నీ కానుకను అర్పించు.
25నీపై నేరం ఆరోపించేవాడితో న్యాయస్థానానికి వెళ్ళే దారిలోనే త్వరగా రాజీపడు. లేకపోతే అతడు నిన్ను న్యాయాధిపతికి అప్పగిస్తాడేమో. ఆ న్యాయాధిపతి నిన్ను అధికారికి అప్పగించి చెరసాల్లో వేయిస్తాడేమో.
26చెల్లించాల్సి ఉన్నదంతా చెల్లించే వరకూ నీవు అక్కడ నుండి బయట పడలేవని కచ్చితంగా చెబుతున్నాను.
27“ ‘వ్యభిచారం చేయకూడదు’ అని చెప్పడం మీరు విన్నారు గదా.
28కానీ నేను మీతో చెప్పేదేమిటంటే ఎవరైనా ఒక స్త్రీని కామంతో చూస్తే అప్పటికే ఆమెతో అతడు తన హృదయంలో వ్యభిచరించాడు.
29నీవు పాపం చేయడానికి నీ కుడి కన్ను కారణమైతే దాన్ని పీకి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా.
30నీ కుడి చెయ్యి నీవు పాపం చేయడానికి కారణమైతే దాన్ని నరికి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే నీ శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా. విడాకుల గురించి యేసు ఉపదేశం మత్తయి 13:3-11; మార్కు 10:2-12; 1కొరింతీ 7:10-15
31“ ‘తన భార్యను వదిలేసేవాడు ఆమెకు విడాకుల పత్రం రాసివ్వాలి’ అని చెప్పడం కూడా మీరు విన్నారు.
32నేను మీతో చెప్పేదేమిటంటే వ్యభిచార కారణం కాకుండా తన భార్యను వదిలేసే ప్రతివాడూ ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు. వదిలేసిన ఆమెను పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. కచ్చితమైన మాట
33“ ‘నీవు అబద్ధ ప్రమాణం చేయకూడదు. ప్రభువుకు చేసిన ప్రమాణాలను నిలబెట్టుకోవాలి’ అని పూర్వికులకు చెప్పింది మీరు విన్నారు గదా.
34అయితే నేను మీతో చెప్పేదేమిటంటే ఎంతమాత్రం ఒట్టు పెట్టుకోవద్దు. పరలోకం మీద ఒట్టు పెట్టుకోవద్దు, అది దేవుని సింహాసనం.
35భూమి తోడు అనవద్దు. అది ఆయన పాదపీఠం. యెరూషలేము తోడు అనవద్దు. అది మహారాజు నగరం.
36నీ తల తోడని ప్రమాణం చేయవద్దు. నీవు ఒక వెంట్రుకైనా తెల్లగా గాని నల్లగా గాని చేయలేవు.
37మీ మాట ‘అవునంటే అవును, కాదంటే కాదు’ అన్నట్టే ఉండాలి. అలా కాని ప్రతిదీ అపవాది సంబంధమైనదే.
38“ ‘కంటికి బదులు కన్ను, పన్నుకు బదులు పన్ను’ అని చెప్పింది మీరు విన్నారు గదా.
39కానీ నేను మీతో చెప్పేదేమిటంటే దుష్టుణ్ణి ఎదిరించవద్దు. ఎవరైనా నిన్ను కుడి చెంప మీద కొడితే అతన్ని మరొక చెంప మీద కూడా కొట్టనియ్యి.
40ఎవరైనా నీ అంగీ విషయం వివాదం పెట్టుకుని దాన్ని లాక్కుంటే అతనికి నీ పైచొక్కా కూడా ఇచ్చివెయ్యి.
41ఎవరైనా ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే అతనితో రెండు మైళ్ళు వెళ్ళు.
42నిన్ను అడిగిన వాడికి ఇవ్వు. నిన్ను అప్పు అడగాలనుకొనే వాడికి నీ ముఖం చాటు చేయవద్దు. ధర్మశాస్త్రానికి మించిన నీతి
43“ ‘నీ పొరుగువాణ్ణి ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు’ అని చెప్పింది మీరు విన్నారు గదా.
44నేను మీతో చెప్పేదేమంటే, మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి.
45ఆ విధంగా మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి కుమారులవుతారు. ఎందుకంటే ఆయన చెడ్డవారిపైనా మంచివారిపైనా తన సూర్యుణ్ణి ఉదయింపజేసి, నీతిమంతులపైనా దుర్మార్గులపైనా వాన కురిపిస్తున్నాడు.
46మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తే మీకు ఏం లాభం? పన్నులు వసూలు చేసేవారు కూడా అలాగే చేస్తారు గదా.
47మీరు మీ సోదరులనే గౌరవిస్తుంటే ఇతరులకంటే ఎక్కువేం చేస్తున్నారు? యూదేతరులూ అలాగే చేస్తున్నారు గదా.
48మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. అందుచేత మీరూ పరిపూర్ణులై ఉండండి.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
The Indian Revised Version Holy Bible in Telugu.
Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.

Bible text licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0).Original Telugu Scripture and full source copyright terms. This verse-only display adapts the original presentation by removing book introductions, editorial headings, source HTML formatting, and inline explanatory footnote popups while preserving Scripture wording and combined original verse ranges. This presentation of the Bible text remains under CC BY-SA 4.0; the copyright holder does not necessarily endorse these changes. Divine Threads study content is independently authored and separate from the licensed Scripture text.