ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) తెలుగు — 2019

లేవీకాండం 8

ఈ అధ్యాయాన్ని తెలుగులో చదవవచ్చు. Divine Threads అధ్యయనాలు తరువాత జోడించబడతాయి.

1యెహోవా మోషేకు ఇలా చెప్పాడు.
2“నువ్వు అహరోనును, అతని కొడుకులను తీసుకు రా. వాళ్ళతో పాటు వాళ్ళ బట్టలూ, అభిషేకం చేయడానికి నూనే, పాపం కోసం బలి అర్పించడానికి ఒక ఎద్దూ, రెండు పొట్టేళ్ళూ, పొంగజేసే పదార్ధం లేకుండా చేసిన ఒక బుట్టెడు రొట్టెలూ తీసుకు రా.
3సమాజంలో ప్రజలందర్నీ ప్రత్యక్ష గుడారం ప్రవేశ ద్వారం దగ్గరికి సమకూర్చు.”
4మోషే యెహోవా తనకు ఆదేశించినట్టుగా చేశాడు. సమాజంలో ప్రజలందరూ ప్రత్యక్ష గుడారం ప్రవేశ ద్వారం దగ్గరికి చేరుకున్నారు.
5అప్పుడు మోషే వాళ్ళందరితో “ఇలా చేయమని యెహోవా ఆజ్ఞాపించాడు” అన్నాడు.
6తరువాత మోషే అహరోనునూ, అతని కొడుకులనూ తీసుకు వచ్చి వాళ్లకి స్నానం చేయించాడు.
7తరువాత అహరోనుకు చొక్కా తొడిగి, అతనికి నడికట్టు కట్టాడు. అంగీ ధరింపజేసి ఏఫోదుని వేశాడు. అందంగా అల్లిన నడికట్టుని ఏఫోదు పైగా వేసి బిగించి కట్టాడు.
8అతనికి వక్షపతకం కట్టి దానిలో ఊరీమును, తుమ్మీమును ఉంచాడు.
9అతనికి తలపాగా పెట్టాడు. ఆ పాగా ముందు భాగంలో పరిశుద్ధ కిరీటంలా బంగారు రేకుని ఉంచాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లుగా మోషే ఇదంతా చేశాడు.
10తరువాత మోషే అభిషేకం చేయడానికి నూనె తీసుకున్నాడు. దానితో మందిరాన్నీ, మందిరంలో ఉన్న సమస్తాన్నీ అభిషేకించి వాటినన్నిటినీ శుద్ధీకరణం చేశాడు.
11తరువాత ఆ నూనెలో కొంత బలిపీఠంపై ఏడుసార్లు చిలకరించాడు. బలిపీఠం దానికి సంబంధించిన పాత్రలను, గంగాళాన్నీ, దాని పీటనూ శుద్ధీకరణం చేసి వాటిని అభిషేకించాడు.
12తరువాత అతడు ఆ అభిషేకం చేసే నూనెలో కొంత తీసి అహరోనుని ప్రతిష్టించడానికి అతని తల పైన పోసి అభిషేకించాడు.
13తరువాత మోషే యెహోవా తనకు ఆదేశించిన విధంగా అహరోను కొడుకులను తీసుకు వచ్చి వారికి పొడవాటి చొక్కాలు వేశాడు. వారికి నడికట్లు కట్టి, వారి తలల చుట్టూ నార బట్టలు కట్టాడు.
14ఆ తరువాత మోషే పాపం కోసం బలి అర్పణ చేయడానికి ఒక కోడెదూడని తీసుకు వచ్చాడు. అహరోనూ అతని కొడుకులూ పాపం కోసం బలి అర్పణ కాబోతున్న ఆ కోడె దూడ తలపై తమ చేతులుంచారు.
15మోషే దాన్ని వధించాడు. దాని రక్తాన్ని తీసి తన వేలితో బలిపీఠం కొమ్ములకి పూసి బలిపీఠాన్ని శుద్ధీకరించాడు. మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగు భాగంలో కుమ్మరించాడు. మోషే దాని కోసం పరిహారం చేసి దాన్ని ప్రతిష్టించాడు.
16అప్పుడు మోషే దాని లోపలి భాగాలపై ఉన్న కొవ్వునంతా తీసి వేరు చేశాడు. కాలేయం పైనున్న కొవ్వును తీశాడు. మూత్రపిండాలనూ వాటిపైని కొవ్వునూ తీసి అంతా బలిపీఠంపై దహించాడు.
17అయితే యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టుగా మోషే ఆ కోడె దూడనూ, దాని చర్మాన్నీ, మాంసాన్నీ, పేడనూ శిబిరం బయట పూర్తిగా కాల్చివేశాడు.
18ఆ తరువాత మోషే దహనబలిగా ఒక పొట్టేలును తీసుకు వచ్చాడు. అహరోనూ, అతని కొడుకులూ ఆ పొట్టేలు తలపైన తమ చేతులుంచారు.
19అప్పుడు మోషే దాన్ని వధించిన తరువాత దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ చల్లాడు.
20అతడు ఆ పొట్టేలును ముక్కలుగా చేసాడు. దాని తలనూ, ఆ ముక్కలనూ, కొవ్వునూ దహించాడు.
21అతడు దాని లోపలి భాగాలనూ, కాళ్ళనూ నీళ్ళతో కడిగి ఆ మొత్తం పొట్టేలును బలిపీఠంపై దహించాడు. అది దహనబలి. కమ్మటి సువాసనను అది కలగజేసింది. అది యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్టు అగ్నితో యెహోవాకు చేసిన బలి.
22ఆ తరువాత మోషే రెండో పొట్టేలుని తీసుకు వచ్చాడు. ఇది అహరోనుని సేవకై ప్రతిష్టించడం కోసం. ప్రతిష్ట కోసమైన ఈ పొట్టేలు తల పైన అహరోనూ, అతని కొడుకులూ తమ చేతులుంచారు.
23మోషే దాన్ని వధించి దాని రక్తంలో కొంత తీసి, అహరోను కుడి చెవి తమ్మె పైనా, కుడిచేతి బొటన వేలి పైనా, కుడికాలి బొటన వేలి పైనా పూశాడు.
24మోషే అహరోను కొడుకులను కూడా తీసుకు వచ్చి కొంత రక్తాన్ని వారి కుడి చెవి తమ్మెల పైనా, కుడి చేతుల బొటనవేళ్ళ పైనా, కుడి కాళ్ళ బొటన వేళ్ళ పైనా పూసాడు. తరువాత మిగిలిన రక్తాన్ని బలిపీఠంకి అన్ని వైపులా చిమ్మాడు.
25తరువాత మోషే దాని కొవ్వునూ, కొవ్వు పట్టిన దాని తోకనూ, దాని అంతర్భాగాల పైని కొవ్వునూ, కాలేయం పైని కొవ్వునూ, రెండు మూత్ర పిండాలనూ, వాటి పైని కొవ్వునూ, కుడి తొడ భాగాన్నీ వేరు చేశాడు.
26యెహోవా సమక్షంలో పొంగజేసే పదార్ధం లేకుండా చేసిన రొట్టెలతో ఉన్న బుట్టలో నుండి ఒక రొట్టెనూ, నూనె రాసి చేసిన ఒక రొట్టెనూ, ఒక అప్పడాన్నీ తీసి వాటిని కొవ్వు పైనా, కుడి తొడ భాగం పైనా పెట్టాడు.
27వాటిని అహరోను చేతుల్లోనూ, అతని కొడుకుల చేతుల్లోనూ ఉంచి వాటిని యెహోవా సన్నిధిలో అర్పణగా పైకి ఎత్తి అటూఇటూ కదిలించి చూపాడు.
28తరువాత మోషే వాటిని వాళ్ళ చేతుల నుంచి తీసుకుని దహనబలిగా బలిపీఠం పైన దహించాడు. అవి ప్రతిష్టార్పణలు. అవి కమ్మటి సువాసన కలుగజేసాయి. అది యెహోవాకు అర్పించిన దహనబలి.
29తరువాత మోషే దాని రొమ్ము భాగాన్ని తీసుకుని దాన్ని కదలిక అర్పణగా యెహోవా సమక్షంలో పైకెత్తి కదిలించాడు. యాజకుణ్ణి ప్రతిష్టించే పనిలో యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు పొట్టేలులో అది మోషే వంతు.
30తరువాత మోషే అభిషేకానికి ఉపయోగించే నూనెలో కొంత, బలిపీఠం పైని రక్తంలో కొంత తీసుకుని వాటిని అహరోను పైనా అతని బట్టల పైనా, అతని కొడుకుల పైనా, వాళ్ళ బట్టల పైనా చిలకరించాడు. ఆ విధంగా మోషే అహరోనునూ, అతని బట్టలనూ, అతని కొడుకులనూ, వాళ్ళ బట్టలనూ అభిషేకించాడు.
31ఆ తరువాత మోషే అహరోనుతోనూ, అతని కొడుకులతోనూ ఇలా చెప్పాడు. “ప్రత్యక్ష గుడారం ప్రవేశ ద్వారం దగ్గర ఆ మాంసాన్ని వండండి. దాన్నీ, బుట్టలో సేవా ప్రతిష్ట కోసం ఉంచిన రొట్టెనూ మీరు తినాలి. అహరోనూ, అతని కొడుకులూ దాన్ని తినాలి అని నేను ఆజ్ఞాపించినట్టు మీరు వాటిని తినాలి.
32మీరు తినగా మిగిలిన మాంసాన్నీ, రొట్టెనూ కాల్చివేయాలి.
33మీ ప్రతిష్ఠ రోజులు ముగిసే వరకూ అంటే ఏడు రోజులు మీరు ప్రత్యక్ష గుడారం ప్రవేశ ద్వారం నుండి బయటకు వెళ్ళకూడదు. ఆ ఏడు రోజులూ యెహోవా మిమ్మల్ని ప్రతిష్ట చేస్తాడు.
34ఈ రోజు ఎలా జరిగిందో మీ కోసం పరిహారం చేయడానికి అలాగే జరగాలని యెహోవా ఆజ్ఞాపించాడు.
35మీరు ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర ఏడు రోజులు రాత్రింబగళ్ళు నిలిచి యెహోవా ఆజ్ఞలను పాటిస్తూ ఉండాలి. ఎందుకంటే యెహోవా నాకు అలా ఆజ్ఞ ఇచ్చాడు.”
36కాబట్టి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ అహరోనూ, అతని కొడుకులూ చేశారు.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
The Indian Revised Version Holy Bible in Telugu.
Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.

Bible text licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0).Original Telugu Scripture and full source copyright terms. This verse-only display adapts the original presentation by removing book introductions, editorial headings, source HTML formatting, and inline explanatory footnote popups while preserving Scripture wording and combined original verse ranges. This presentation of the Bible text remains under CC BY-SA 4.0; the copyright holder does not necessarily endorse these changes. Divine Threads study content is independently authored and separate from the licensed Scripture text.