ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) తెలుగు — 2019

లేవీకాండం 19

ఈ అధ్యాయాన్ని తెలుగులో చదవవచ్చు. Divine Threads అధ్యయనాలు తరువాత జోడించబడతాయి.

1యెహోవా మోషేకు ఇంకా ఇలా ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీయుల సమాజమంతటితో ఇలా చెప్పు.
2“మీరు పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా అనే నేను పరిశుద్ధుడిని.
3మీలో ప్రతివాడూ తన తల్లిని తన తండ్రిని గౌరవించాలి. నేను నియమించిన విశ్రాంతి దినాలను ఆచరించాలి. నేను మీ దేవుడైన యెహోవాను.
4మీరు పనికిమాలిన దేవుళ్ళ వైపు తిరగకూడదు. మీరు పోత విగ్రహాలను చేసుకోకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను.
5మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించేటప్పుడు అది అంగీకారయోగ్యమయ్యేలా అర్పించాలి.
6మీరు బలిమాంసాన్ని బలి అర్పించిన రోజైనా, మరునాడైనా దాన్ని తినాలి. మూడో రోజు దాకా మిగిలి ఉన్న దాన్ని పూర్తిగా కాల్చివేయాలి.
7మూడో రోజున దానిలో కొంచెం తిన్నా సరే, అది అసహ్యం. అది ఆమోదం కాదు.
8మూడో రోజున దాన్ని తినేవాడు తన దోషశిక్షను భరిస్తాడు. వాడు యెహోవాకు పరిశుద్ధమైన దాన్ని అపవిత్ర పరిచాడు కదా. వాడిని ప్రజల్లో లేకుండా చెయ్యాలి.
9మీరు మీ పొలం పంట కోసేటప్పుడు నీ పొలం మూలల్లొ పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగె ఏరుకోకూడదు. నీ పండ్ల చెట్ల పరిగెను సమకూర్చుకోకూడదు.
10నీ ద్రాక్ష తోటలో పండ్లన్నిటినీ సేకరించుకో కూడదు. ద్రాక్ష తోటలో రాలిన పండ్లను ఏరుకోకూడదు. పేదలకు, పరదేశులకు వాటిని విడిచిపెట్టాలి.
11నేను మీ దేవుడైన యెహోవాను. మీరు దొంగతనం చేయకూడదు. అబద్ధం ఆడకూడదు. ఒకడినొకడు దగా చెయ్యకూడదు.
12నా నామం పేరిట అబద్ధంగా ఒట్టు పెట్టుకోకూడదు. నీ దేవుని పేరును అపవిత్ర పరచకూడదు. నేను యెహోవాను.
13నీ పొరుగు వాణ్ణి పీడించకూడదు. అతణ్ణి దోచుకోకూడదు. కూలివాడి కూలీ డబ్బు మరునాటి వరకూ నీ దగ్గర ఉంచుకోకూడదు.
14చెవిటివాణ్ణి తిట్ట కూడదు. గుడ్డివాడి దారిలో అడ్డంకులు వేయకూడదు. నీ దేవునికి భయపడాలి. నేను యెహోవాను.
15అన్యాయ తీర్పు తీర్చకూడదు. బీదవాడని పక్షపాతం చూపకూడదు. గొప్పవాడని అభిమానం చూపకూడదు. నీ పొరుగువాడి పట్ల న్యాయంగా ప్రవర్తించాలి.
16నీ ప్రజల మధ్య కొండేలు చెబుతూ ఇంటింటికి తిరగకూడదు. ఎవరికైనా ప్రాణ హాని కలిగించేది ఏదీ చెయ్యవద్దు. నేను యెహోవాను.
17నీ హృదయంలో నీ సోదరుణ్ణి అసహ్యించుకోకూడదు. నీ పొరుగువాడి పాపం నీ మీదికి రాకుండేలా నీవు తప్పకుండా అతణ్ణి గద్దించాలి.
18పగ సాధించ వద్దు. ఎవరిమీదా కక్ష పెట్టుకోవద్దు. నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ సాటి మనిషిని ప్రేమించాలి. నేను యెహోవాను.
19మీరు నా శాసనాలను పాటించాలి. నీ జంతువులకు ఇతర జాతి జంతువులతో సంపర్కం చేయకూడదు. నీ పొలంలో వేరు వేరు జాతుల విత్తనాలు చల్లకూడదు. రెండు రకాల దారాలతో నేసిన బట్టలు ధరించకూడదు.
20ఒక బానిస పిల్లలు ఒకడితో నిశ్చితార్థం జరిగాక ఆమెను వెల ఇచ్చి విడిపించకుండా, లేదా ఆమెకు విముక్తి కలగక ముందు ఎవరైనా ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకుంటే అలాటి వాణ్ణి శిక్షించాలి. ఆమెకు విడుదల కలగలేదు గనక వారికి మరణశిక్ష విధించ కూడదు.
21అతడు అపరాధ పరిహార బలిని, అంటే అపరాధ పరిహార బలిగా ఒక పొట్టేలును ప్రత్యక్ష గుడార ద్వారానికి యెహోవా సన్నిధికి తీసుకు రావాలి.
22అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపాన్నిబట్టి పాప పరిహార బలిగా ఆ పొట్టేలు మూలంగా యెహోవా సన్నిధిలో అతని కోసం ప్రాయశ్చిత్తం చేయాలి. ఈ విధంగా అతడు చేసిన పాపం విషయమై అతనికి క్షమాపణ కలుగుతుంది.
23మీరు ఆ దేశానికి వచ్చి తినడానికి రకరకాల చెట్లు నాటినప్పుడు వాటి పండ్లను నిషేధంగా ఎంచాలి. మూడు సంవత్సరాల పాటు అవి మీకు అపవిత్రంగా ఉండాలి. వాటిని తినకూడదు.
24నాలుగో సంవత్సరంలో వాటి పండ్లన్నీ యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతి అర్పణలుగా ఉంటాయి. ఐదో సంవత్సరంలో వాటి పండ్లను తినొచ్చు.
25నేను మీ దేవుడైన యెహోవాను.
26రక్తం కలిసి ఉన్న మాంసం తినకూడదు. శకునాలు చూడకూడదు. మంత్ర ప్రయోగం ద్వారా ఇతరులను వశపరచుకోడానికి చూడకూడదు.
27విగ్రహ పూజలు చేసే ఇతర జనాల్లాగా మీ తల పక్క భాగాలు గానీ నీ గడ్డం అంచులు గానీ గుండ్రంగా గొరిగించుకోకూడదు.
28చచ్చిన వారి కోసం మీ దేహాన్ని గాయపరచుకోకూడదు. ఒంటిపై పచ్చబొట్లు పొడిపించుకోకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను.
29నీ కూతురిని వేశ్యగా చేసి ఆమెను హీనపరచకూడదు. అలా చేస్తే మీ దేశం వ్యభిచారంలో పడిపోతుంది. మీ ప్రాంతం కాముకత్వంతో నిండిపోతుంది.
30నేను నియమించిన విశ్రాంతి దినాలను మీరు ఆచరించాలి. నా పరిశుద్ధ మందిరాన్ని గౌరవించాలి. నేను యెహోవాను.
31చచ్చిన ఆత్మలతో మాట్లాడుతామని చెప్పే వారి దగ్గరికి సోదె చెప్పేవారి దగ్గరికి పోకూడదు. అలా చేస్తే వారివలన మీరు అపవిత్రులౌతారు. నేను మీ దేవుడైన యెహోవాను.
32తల నెరసిన ముసలివాడి ఎదుట లేచి నిలబడి అతని ముఖాన్ని గౌరవించాలి. నీ దేవునికి భయపడాలి. నేను యెహోవాను.
33మీ దేశంలో పరదేశి ఎవరైనా మీ మధ్య నివసించేటప్పుడు అతణ్ణి బాధ పెట్టకూడదు,
34మీ మధ్య నివసించే పరదేశిని మీలో పుట్టినవాడి లాగానే ఎంచాలి. నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే అతణ్ణి ప్రేమించాలి. ఐగుప్తులో మీరు పరదేశులుగా ఉన్నారు గదా. నేను మీ దేవుడైన యెహోవాను.
35కొలతలోగాని తూనికలోగాని పరిమాణంలో గాని మీరు అన్యాయం చేయకూడదు.
36న్యాయమైన త్రాసులు న్యాయమైన బరువులు, న్యాయమైన కొల పాత్రలు న్యాయమైన పడి మీకుండాలి. నేను ఐగుప్తులోనుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను.
37మీరు నా శాసనాలన్నిటిని నా విధులన్నిటిని పాటించాలి. నేను యెహోవాను.”
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
The Indian Revised Version Holy Bible in Telugu.
Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.

Bible text licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0).Original Telugu Scripture and full source copyright terms. This verse-only display adapts the original presentation by removing book introductions, editorial headings, source HTML formatting, and inline explanatory footnote popups while preserving Scripture wording and combined original verse ranges. This presentation of the Bible text remains under CC BY-SA 4.0; the copyright holder does not necessarily endorse these changes. Divine Threads study content is independently authored and separate from the licensed Scripture text.