ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) తెలుగు — 2019

లేవీకాండం 11

ఈ అధ్యాయాన్ని తెలుగులో చదవవచ్చు. Divine Threads అధ్యయనాలు తరువాత జోడించబడతాయి.

1ఆ తరువాత యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పాడు.
2“మీరు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పండి. భూమి పై ఉన్న జంతువులన్నిటిలో మీరు తినదగ్గవి ఇవి.
3చీలిన డెక్కలు ఉండి ఏ జంతువు అయితే నెమరు వేస్తుందో ఆ జంతువుని మీరు ఆహారంగా తీసుకోవచ్చు.
4అయితే జంతువుల్లో కొన్ని నెమరు వేస్తాయి. కొన్నిటికి చీలిన డెక్కలుంటాయి. ఇలాంటి వాటిని మీరు ఆహారంగా తీసుకోకూడదు. ఒంటె లాంటి జంతువులు నెమరు వేస్తాయి. కానీ దానికి చీలిన డెక్కలుండవు. కాబట్టి ఒంటెను మీరు అపవిత్రంగా ఎంచాలి.
5పొట్టి కుందేలు నెమరు వేస్తుంది, కానీ దానికి చీలిన డెక్కలు లేవు. కాబట్టి దాన్ని కూడా మీరు అపవిత్రంగా ఎంచాలి.
6అలాగే కుందేలు నెమరు వేస్తుంది. కానీ దానికి చీలిన డెక్కలు లేవు. కాబట్టి దాన్ని కూడా మీరు అపవిత్రంగా ఎంచాలి.
7ఇక పందికి చీలిన డెక్కలు ఉన్నాయి. కానీ అది నెమరు వేయదు కాబట్టి దాన్ని మీరు అపవిత్రంగా ఎంచాలి.
8వీటి మాంసాన్ని మీరు తినకూడదు. వాటి కళేబరాలను అంటుకోకూడదు. అవి మీకు అపవిత్రం.
9జలచరాల్లో వీటిని తినవచ్చు. సముద్రంలోనైనా, నదిలో నైనా నీటిలో నివసించే అన్ని రకాల జీవుల్లో రెక్కలూ, పొలుసులూ ఉన్న వాటిని మీరు తినవచ్చు.
10సముద్రంలోనైనా, నదిలో నైనా నీటిలో కదిలే అన్ని రకాల జీవుల్లోనూ, జల జంతువుల్లోనూ రెక్కలూ, పొలుసులూ లేని వాటిని మీరు అసహ్యించుకోవాలి.
11అవి మీకు అసహ్యం కాబట్టి వాటి మాంసం మీరు తినకూడదు. వాటి కళేబరాలను అసహ్యించుకోవాలి.
12నీళ్లలో దేనికి రెక్కలూ, పొలుసులూ ఉండవో అది మీకు అసహ్యం.
13పక్షుల్లో మీరు అసహ్యించుకోవాల్సినవీ, తినకూడనివీ ఏవంటే, గద్ద, రాబందు,
14గరుడ పక్షి, డేగ జాతిలో ప్రతి పక్షీ,
15కాకి జాతిలోని ప్రతి పక్షీ,
16కొమ్ముల గుడ్లగూబ, తీతువు పిట్ట, సముద్రపు కొంగ, గద్ద జాతిలో అన్ని పక్షులూ.
17ఇంకా పైగిడి కంటె, గుడ్లగూబ, సముద్రపు డేగ,
18తెల్ల గుడ్లగూబ, క్షేత గుడ్లగూబ, సముద్రపు రాబందు,
19కొక్కిరాయి, అన్ని రకాల కొంగలు, కుకుడు గువ్వ, గబ్బిలం.
20రెక్కలు ఉండి నాలుగుకాళ్లతో నడిచే జీవులన్నీ మీకు అసహ్యంగా ఉండాలి.
21అయితే రెక్కలు ఉండి నలుగు కాళ్ళతో నడిచే, ఎగరగలిగే జీవులు, నేలపై గంతులు వేయడానికి తొడలు గల పురుగులన్నిటినీ మీరు తినవచ్చు.
22అన్ని రకాల మిడతలను మీరు తినవచ్చు. ఆకు మిడత, కీచురాయి, గడ్డి మిడత ఇలా అన్ని రకాల మిడతలను మీరు తినవచ్చు.
23అయితే నాలుగు కాళ్లు గల ఎగిరే తక్కిన జీవులన్నీ మీకు అసహ్యంగా ఉండాలి.
24వీటిలో దేని కళేబరాన్ని అయినా మీరు తాకితే మీరు సాయంత్రం వరకూ అపవిత్రంగా ఉంటారు.
25ఎవరైనా వాటి కళేబరాల్లో దేన్ని అయినా మోస్తే అలాంటి వాడు తన బట్టలు ఉతుక్కోవాలి. వాడు సాయంకాలం వరకూ అపవిత్రంగా ఉంటాడు.
26రెండు డెక్కలు గల అన్ని జంతువుల్లో డెక్కలు పూర్తిగా చీలకుండా ఉండి నెమరు వేయకుండా ఉన్నవి మీకు అపవిత్రం. వాటి కళేబరాలు మీరు ముట్టుకోకూడదు. అలాటి వాటిని తాకిన వాడు అపవిత్రుడు అవుతాడు.
27నాలుగు కాళ్లపై నడిచే జంతువుల్లో ఏవి తమ పంజాపై నడుస్తాయో అవి మీకు అపవిత్రం. వాటి కళేబరాలు ముట్టుకున్న వాడు సాయంకాలం వరకూ అపవిత్రంగా ఉంటాడు.
28ఎవరైనా వాటి కళేబరాల్లో దేన్ని అయినా మోస్తే అలాంటి వాడు తన బట్టలు ఉతుక్కోవాలి. వాడు సాయంకాలం వరకూ అపవిత్రంగా ఉంటాడు. ఈ జంతువులు మీకు అపవిత్రమైనవి.
29నేలపైన పాకే జంతువుల్లో మీకు అపవిత్రమైనవి ఇవి. ముంగిస, ఎలుక, బల్లి జాతికి చెందిన ప్రతి జీవీ,
30తొండ, ఉడుము, బల్లి, తొండ, చిట్టి ఉడుము, ఊసరవెల్లి.
31పాకే జీవులన్నిటిలో ఇవి మీకు అపవిత్రం. ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టుకునేవాడు సాయంకాలం వరకూ అపవిత్రుడుగా ఉంటాడు.
32ఒకవేళ అవి చనిపోయిన తరువాత వాటి కళేబరాలు దేని పైన పడతాయో అవి చెక్క వస్తువులైనా, వస్త్రంతో చేసినవైనా, చర్మంతో చేసినవైనా, గోనె గుడ్డతో చేసినవైనా అవి అపవిత్రం అవుతాయి. ఆ వస్తువు ఏదైనా, దేనికోసం వాడుతున్నా అపవిత్రం అయినప్పుడు దాన్ని నీళ్ళలో ఉంచాలి. సాయంకాలం వరకూ అది అపవిత్రంగా ఉంటుంది. తరువాత అది పవిత్రం అవుతుంది.
33వీటిలో ఏ జంతువైనా ఏదైనా మట్టిపాత్ర పైన గానీ, మట్టిపాత్రలో గానీ పడితే, ఆ పాత్రలో ఉన్నది ఏదైనా అపవిత్రం అవుతుంది. అప్పుడు మీరు ఆ మట్టిపాత్రను పగలగొట్టాలి.
34పవిత్రమూ తినదగినదీ అయిన ఏ ఆహారంలోనైనా ఆ అపవిత్రం అయిన ఆ మట్టిపాత్రలోని నీళ్ళు పడితే ఆ ఆహారం అపవిత్రం అవుతుంది. అలాంటి పాత్ర లోంచి ఏ పానీయం తాగినా అది అపవిత్రం అవుతుంది.
35వాటి కళేబరాల్లో ఏ కొంచెమన్నా దేనిపైనన్నా పడితే అది అపవిత్రం అవుతుంది. అది పొయ్యి అయినా, వంటపాత్ర అయినా దాన్ని ముక్కలుగా పగలగొట్టాలి. అది అపవిత్రం, అది మీకు అపవిత్రంగానే ఉండాలి.
36నీళ్ళు చేదుకునే పెద్ద తొట్టిలో గానీ, ఊటలో గానీ అలాంటి కళేబరం పడినా ఆ నీళ్ళు అపవిత్రం కావు. అయితే ఆ నీటిలో పడిన కళేబరాన్ని ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళు అపవిత్రం అవుతారు.
37ఆ కళేబరాల్లో ఏదో ఒక భాగం నాటేందుకు సిద్ధంగా ఉన్న విత్తనాలపై పడినా ఆ విత్తనాలు అపవిత్రం కావు.
38కానీ నానబెట్టిన విత్తనాలపైన అపవిత్రమైన కళేబరం పడితే అవి మీకు అపవిత్రం అవుతాయి.
39మీరు తిన దగ్గ జంతువుల్లో ఏదన్నా చస్తే దాని కళేబరాన్ని ముట్టుకునే వాడు ఆ సాయంత్రం వరకూ అపవిత్రుడిగా ఉంటాడు.
40ఆ కళేబరములోనుండి దేనినైనా తినేవాడు తన బట్టలు ఉతుక్కోవాలి. అతడు సాయంత్రం వరకూ అపవిత్రుడిగా ఉంటాడు. దాని కళేబరాన్ని మోసేవాడు తన బట్టలు ఉతుక్కోవాలి.
41నేలమీద పాకే జీవులన్నీ అసహ్యం. వాటిని మీరు తినకూడదు.
42నేలపై పాకే అన్ని జంతువులు, అంటే తమ పొట్టతో పాకే జీవులైనా, నాలుగు కాళ్ళపై నడిచేవైనా, అనేకమైన కాళ్ళు ఉన్నవైనా ఇవన్నీ మీరు తినకూడదు. ఇవి మీకు అసహ్యంగా ఉండాలి.
43ఇలా పాకే జీవులను తిని మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోకూడదు. వాటి ద్వారా మీరు అపవిత్రం కాకూడదు. అశుద్ధం కాకూడదు.
44ఎందుకంటే నేను యెహోవాని. మీ దేవుణ్ణి. నేను పరిశుద్ధుణ్ణి. కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండేలా శుద్ధీకరణ చేసుకోండి. నేలపైన పాకే జీవుల మూలంగా మిమ్మల్ని మీరు మలినం చేసుకోవద్దు.
45మీకు దేవుడిగా ఉండటానికి మిమ్మల్ని ఐగుప్తుదేశంలో నుండి బయటకు తీసుకు వచ్చిన యెహోవాను నేను. కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే నేను పరిశుద్ధుణ్ణి.”
46ఇది జంతువులూ, పక్షులూ, నీళ్ళలో నివసించే ప్రాణులూ, నేలపైన పాకే జీవులను గూర్చిన శాసనం.
47ఏది తినాలో, ఏది తినకూడదో, ఏది పవిత్రమో, ఏది అపవిత్రమో తెలియజేయడం దీని ఉద్దేశం.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
The Indian Revised Version Holy Bible in Telugu.
Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.

Bible text licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0).Original Telugu Scripture and full source copyright terms. This verse-only display adapts the original presentation by removing book introductions, editorial headings, source HTML formatting, and inline explanatory footnote popups while preserving Scripture wording and combined original verse ranges. This presentation of the Bible text remains under CC BY-SA 4.0; the copyright holder does not necessarily endorse these changes. Divine Threads study content is independently authored and separate from the licensed Scripture text.