ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) తెలుగు — 2019

విలాప వాక్యములు 2

ఈ అధ్యాయాన్ని తెలుగులో చదవవచ్చు. Divine Threads అధ్యయనాలు తరువాత జోడించబడతాయి.

1ప్రభువు తన కోపంతో సీయోను కుమారిని నల్లటి మేఘంతో పూర్తిగా కప్పేశాడు. ఆయన ఇశ్రాయేలు అందాన్ని ఆకాశం నుంచి భూమి మీదికి పడేశాడు. తాను కోపగించిన దినాన ఆయన తన పాదపీఠాన్ని గుర్తు చేసుకోలేదు.
2యాకోబు పట్టణాల్లో ఒక్క దాని మీద కూడా కనికరం లేకుండా ప్రభువు అన్నిటినీ మింగివేశాడు. తన ఆగ్రహంతో ఆయన యూదా కుమార్తె కోటలను కూలగొట్టాడు. ఆయన వాటిని నేల కూల్చి సిగ్గు పరిచాడు. దాని రాజ్యాన్నీ, దాని అధిపతులను ఆయన అవమానపరిచాడు.
3తీవ్రమైన కోపంతో ఆయన ఇశ్రాయేలు ప్రజల బలాన్ని అణచివేశాడు. శత్రువుల ముందు ఆయన తన కుడి చెయ్యి వెనక్కు తీసుకున్నాడు. చుట్టూ ఉన్న వాటన్నిటినీ కాల్చే రగులుతున్న అగ్నిజ్వాలలు కాల్చినట్టు ఆయన యాకోబును కాల్చేశాడు.
4ఒక శత్రువులా ఆయన తన విల్లు ఎక్కుపెట్టాడు. యుద్ధానికి సిద్ధంగా ఉన్న ప్రత్యర్ధి బాణం విసరడానికి తన చెయ్యి చాపినట్టు. ఆయన నిలబడి ఉన్నాడు. చూపుకు శ్రేష్ఠమైన ప్రజలందరినీ ఆయన హతం చేశాడు. సీయోను కుమార్తె గుడారంలో తన ఆగ్రహాన్ని అగ్ని వర్షంలా కుమ్మరించాడు.
5ప్రభువు శత్రువులా అయ్యాడు. ఆయన ఇశ్రాయేలును మింగివేశాడు. దాని రాజమందిరాలన్నీ మింగివేశాడు. దానికి పట్టున్న ప్రాంతాలన్నీ నాశనం చేశాడు. యూదా కుమారిలో దుఃఖం, సంతాపం అధికం చేశాడు.
6ఒక తోట మీద దాడి చేసినట్టు ఆయన తన గుడారం మీద దాడి చేశాడు. సమాజ పవిత్ర ప్రాంగణాన్ని నాశనం చేశాడు. ఆరాధన సమావేశం, విశ్రాంతి దినం సీయోనులో మరుపుకు వచ్చేలా యెహోవా చేశాడు. కోపావేశంలో ఆయన రాజూ యాజకుడూ ఇద్దరినీ తోసిపుచ్చాడు.
7ప్రభువు తన బలిపీఠం తోసిపుచ్చాడు. తన పవిత్ర ప్రాంగణం నిరాకరించాడు. దాని కోట గోడలను శత్రువుల చేతికి అప్పగించాడు. ఏర్పరచిన రోజు సమాజ ప్రాంగణంలో వినిపించే ధ్వనిలా వాళ్ళు యెహోవా మందిరంలో ఉత్సాహ ధ్వని చేశారు.
8సీయోను కుమారి ప్రాకారాలు పాడు చెయ్యాలని యెహోవా ఉద్దేశపూర్వకంగా నిర్ణయించాడు. చెయ్యి చాపి కొలత గీత గీశాడు. గోడ నాశనం చెయ్యడానికి తన చెయ్యి వెనక్కు తీయలేదు. ఆయన ప్రహరీలు విలపించేలా చేశాడు. ప్రాకారాలు బలహీనం అయ్యేలా చేశాడు.
9యెరూషలేము పట్టణపు గుమ్మాలు భూమిలోకి కుంగిపోయాయి. దాని అడ్డ గడియలు ఆయన విరిచేశాడు. దాని రాజూ, అధిపతులూ అన్యప్రజల మధ్య ఉన్నారు. అక్కడ మోషే ధర్మశాస్త్రం లేదు. దాని ప్రవక్తలకు యెహోవా దర్శనం దొరకలేదు.
10సీయోను కుమారి పెద్దలు మౌనంగా నేల మీద కూర్చుని ఏడుస్తున్నారు. వాళ్ళ తలల మీద దుమ్ము పోసుకున్నారు. వాళ్ళు గోనెపట్ట కట్టుకున్నారు. యెరూషలేము కన్యలు తల నేలకు దించుకుని ఉన్నారు.
11నా కన్నీళ్లు ఎండిపోయాయి. నా కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నా అంతరంగం కలవరంతో ఉంది. నా ప్రజల కుమారి అణిచివేత కారణంగా నా పేగులు నేల మీద ఒలికి పోయాయి. పిల్లలు, పాలు తాగే చంటిబిడ్డలు నిస్సహాయంగా గ్రామ వీధుల్లో నీరసంగా పడి ఉన్నారు.
12పట్టణ వీధుల్లో గాయాలతో పడి ఉన్న వారిలాగా మూర్చపోతూ. “ధాన్యం, ద్రాక్షరసం ఏవి?” అంటూ తమ తల్లుల ఒడిలో ప్రాణాలు విడుస్తున్నారు.
13యెరూషలేము కుమారీ, నీ గురించి నేనేమనాలి? నిన్ను దేనితో పోల్చి ఆదరించాలి? సీయోను కుమారీ, కన్యకా, నీ పతనం సముద్రమంత విస్తారమైనది. నిన్ను స్వస్థపరచగల వాడెవడు?
14నీ కోసం నీ ప్రవక్తలు మోసపూరితమైన బుద్ధిహీనపు దర్శనాలు చూశారు. నువ్వు చెర లోకి వెళ్ళకుండా తప్పించడానికి వాళ్ళు నీ పాపాన్ని నీకు వెల్లడి చెయ్యలేదు. వాళ్ళు నీ కోసం మోసపూరితంగా దర్శనాలు గ్రహించారు.
15దారిలో వెళ్ళేవాళ్ళందరూ నిన్ను చూసి చప్పట్లు కొడుతున్నారు. వాళ్ళు యెరూషలేము కుమారిని చూసి ఎగతాళి చేస్తూ ఈల వేస్తూ, తల ఊపుతూ. “పరిపూర్ణ సౌందర్యం గల పట్టణం అనీ, సమస్త భూనివాసులకు ఆనందకరమైన నగరం అనీ ప్రజలు ఈ పట్టణం గురించేనా చెప్పారు?” అంటున్నారు.
16నీ శత్రువులందరూ నిన్ను చూసి పెద్దగా నోరు తెరిచారు. వాళ్ళు ఎగతాళి చేసి పళ్ళు కొరుకుతూ “దాన్ని మింగివేశాం! కచ్చితంగా ఈ రోజు కోసమేగా మనం కనిపెట్టింది! అది జరిగింది. దాన్ని మనం చూశాం” అంటున్నారు.
17తాను అనుకున్న పని యెహోవా ముగించాడు. తాను పూర్వం ప్రకటించిన మాట ఆయన నెరవేర్చాడు. నీ పట్ల కనికరం లేకుండా ఆయన నాశనం చేశాడు. నిన్ను బట్టి నీ శత్రువులు సంతోషించేలా చేశాడు. నీ విరోధుల బలం హెచ్చించాడు.
18ప్రజల హృదయం యెహోవాకు కేకలు పెడుతూ. “సీయోను కుమారి ప్రాకారమా, నదీప్రవాహంలా పగలూ రాత్రి నీ కన్నీరు కారనివ్వు. జాప్యం జరగనివ్వకు. నీ కంటి నుంచి వెలువడే కన్నీటిధార ఆగనివ్వకు.
19రాత్రి పూట నువ్వు లేచి మొర్ర పెట్టు. నీళ్లు కుమ్మరించినట్టు ప్రభువు సన్నిధిలో నీ హృదయం కుమ్మరించు. ప్రతి వీధి మొదట్లో ఆకలితో సతమతమౌతున్న నీ పసిపిల్లల ప్రాణం కోసం నీ చేతులు ఆయన వైపు ఎత్తు.”
20యెహోవా, చూడు. నువ్వు ఎవరి పట్ల ఈ విధంగా చేశావో గమనించు. తమ గర్భఫలాన్ని, తాము ఎత్తుకుని ఆడించిన పసి పిల్లలను స్త్రీలు తినడం తగునా? యాజకుడూ ప్రవక్తా ప్రభువు పవిత్ర ప్రాంగణంలో హతం కాదగునా?
21యువకులూ, వృద్ధులూ వీధుల్లో నేల మీద పడి ఉన్నారు. నా కన్యకలూ, నా యోధులూ కత్తి చేత కూలి పోయారు. నీ ఉగ్రత దినాన నువ్వు వాళ్ళను హతం చేశావు. జాలి లేకుండా వాళ్ళందరినీ నువ్వు చంపావు.
22ఆరాధన దినాన ప్రజలు వచ్చినట్టు నాలుగు వైపుల నుంచి నువ్వు నా మీదికి భయం రప్పించావు. యెహోవా ఉగ్రత దినాన ఎవరూ తప్పించుకోలేదు. ఎవరూ బతకలేదు. నేను పెంచి పోషించిన వాళ్ళను నా శత్రువులు అంతం చేశారు.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
The Indian Revised Version Holy Bible in Telugu.
Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.

Bible text licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0).Original Telugu Scripture and full source copyright terms. This verse-only display adapts the original presentation by removing book introductions, editorial headings, source HTML formatting, and inline explanatory footnote popups while preserving Scripture wording and combined original verse ranges. This presentation of the Bible text remains under CC BY-SA 4.0; the copyright holder does not necessarily endorse these changes. Divine Threads study content is independently authored and separate from the licensed Scripture text.