ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) తెలుగు — 2019

యెహోషువా 10

ఈ అధ్యాయాన్ని తెలుగులో చదవవచ్చు. Divine Threads అధ్యయనాలు తరువాత జోడించబడతాయి.

1యెహోషువ యెరికోనూ, దాని రాజునూ నిర్మూలం చేసినట్టు హాయినీ దాని రాజునూ నిర్మూలం చేసిన సంగతీ గిబియోను నివాసులు ఇశ్రాయేలీయులతో సంధి చేసుకుని వారితో కలిసిపోయిన సంగతీ యెరూషలేం రాజైన అదోనీసెదెకు విన్నప్పుడు అతడూ అతని ప్రజలూ చాలా భయపడ్డారు.
2ఎందుకంటే గిబియోనును నాటి రాజధానుల్లో ప్రధాన పట్టణంగా ఎంచేవారు. అది హాయి కంటే పెద్దది, అక్కడి ప్రజలందరూ శూరులు. కాబట్టి యెరూషలేము రాజైన అదోనీసెదెకు “గిబియోనీయులు యెహోషువతో ఇశ్రాయేలీయులతో సంధి చేసుకున్నారు. మీరు నా దగ్గరికి వచ్చి నాకు సహాయం చేస్తే మనం వారి పట్టణాన్ని నాశనం చేద్దాం” అని
3హెబ్రోను రాజు హోహాముకూ యర్మూతు రాజు పిరాముకూ
4లాకీషురాజు యాఫీయకూ ఎగ్లోను రాజు దెబీరుకూ వార్త పంపాడు.
5కాబట్టి అమోరీయుల ఐదుగురు రాజులూ కలిసి, తమ సేనలతో బయలుదేరి, గిబియోను ముందు దిగి, గిబియోనీయులతో యుద్ధం చేశారు.
6అప్పుడు “గిబియోనీయుల కొండ ప్రాంతాల్లో నివసించే అమోరీయుల రాజులందరూ ఏకమై మాపైకి దండెత్తి వచ్చారు, కాబట్టి నీ దాసుల చెయ్యి విడిచిపెట్టక త్వరగా వచ్చి మాకు సహాయం చేసి మమ్మల్ని రక్షించు” అని గిల్గాలులో శిబిరంలో ఉన్న యెహోషువకు వార్త పంపారు.
7వెంటనే యెహోషువ, అతని దగ్గరున్న యోధులూ, పరాక్రమవంతులైన శూరులూ అందరూ గిల్గాలు నుండి బయలుదేరారు.
8అప్పుడు యెహోవా “వారికి భయపడవద్దు, వారిని నీ చేతికి అప్పగించాను, వారిలో ఎవరూ నీ ముందు నిలబడలేరు” అని యెహోషువతో చెప్పగానే,
9యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతా నడచి వారి మీద హఠాత్తుగా దాడి చేశాడు.
10అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ప్రజల ముందు వారిని గందరగోళానికి గురి చెయ్యగానే యెహోషువ గిబియోను ముందే మహా ఘోరంగా వారిని హతం చేశాడు. బేత్‌హోరోనుకు పైకి వెళ్ళే మార్గంలో అజేకా వరకూ, మక్కేదా వరకూ, యోధులు వారిని తరిమి హతం చేస్తూనే ఉన్నారు.
11వారు ఇశ్రాయేలీయుల నుండి బేత్‌హోరోనుకు దిగిపోయే తోవలో పారిపోతుండగా, వారు అజేకాకు వచ్చే వరకూ యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగళ్ళను వారి మీద కురిపించాడు. కాబట్టి వారు దాని వల్ల చనిపోయారు. ఇశ్రాయేలీయులు కత్తితో చంపిన వారికంటే ఆ వడగండ్ల వలన చచ్చినవారు ఎక్కువమంది అయ్యారు.
12యెహోవా ఇశ్రాయేలీయులకు అమోరీయులను అప్పగించిన ఆ రోజున, ఇశ్రాయేలీయులు వింటుండగా యెహోషువ యెహోవాకు ఈ విధంగా ప్రార్థన చేశాడు, “సూర్యుడా, నీవు గిబియోనులో నిలిచిపో. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలిచిపో.”
13“ప్రజలు తమ శత్రువుల మీద పగ తీర్చుకొనే వరకూ సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు” అనే మాట యాషారు గ్రంథంలో రాసి ఉంది కదా. సూర్యుడు ఆకాశం మధ్యలో నిలిచిపోయి ఇంచుమించు ఒక రోజంతా అస్తమించ లేదు.
14యెహోవా ఒక నరుని మనవి విన్న ఆ రోజులాంటి మరొక రోజు, దాని ముందు గానీ దాని తరువాత గానీ లేదు, ఆ రోజు యెహోవా, ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధం చేశాడు.
15అప్పుడు యెహోషువ, అతనితో కూడా ఉన్న ఇశ్రాయేలీయులంతా గిల్గాలులోని శిబిరానికి తిరిగి వచ్చారు. అమోరీయు రాజులు ఐదు గురూ చనిపోవడం
16ఆ రాజులు ఐదు గురూ పారిపోయి మక్కేదాలో ఉన్న గుహలో దాక్కున్నారు.
17మక్కేదా గుహలో దాక్కున్న ఐదుగురు ఆ రాజులు దొరికారని యెహోషువకు తెలిసినప్పుడు,
18యెహోషువ “ఆ గుహ ద్వారానికి అడ్డంగా పెద్ద రాళ్ళు దొర్లించి వారిని కాపలా కాయడానికి మనుషులను ఉంచండి.
19మీరు అక్కడే ఆగిపోకండి. మీ దేవుడు యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించాడు కాబట్టి వారిని తమ పట్టణాల్లోకి తిరిగి వెళ్లనీయకుండా వారిని తరిమి, వెనుక ఉన్న వారిని కూల్చండి” అని చెప్పాడు.
20వారు పూర్తిగా నశించే వరకూ యెహోషువ, ఇశ్రాయేలీయులు గొప్ప జనసంహారం చేసి వారిని వధించిన తరువాత వారిలో తప్పించుకొన్న కొద్దిమంది, ప్రాకారాలు ఉన్న పట్టణాల్లోకి చొరబడిపోయారు.
21ప్రజలందరూ మక్కేదాలో శిబిరంలో ఉన్న యెహోషువ దగ్గరికి సురక్షితంగా తిరిగి వచ్చారు. ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా ఒక్క మాటైనా మాట్లాడటానికి ఎవరికీ గుండెల్లేక పోయాయి.
22యెహోషువ “ఆ గుహకు అడ్దం తీసివేసి గుహలో నుండి ఆ ఐదుగురు రాజులను నాదగ్గరికి తీసుకు రండి” అని చెప్పగానే,
23వారు అలా చేసి, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు-ఈ ఐదుగురినీ ఆ గుహలో నుండి అతని దగ్గరికి తీసుకువచ్చారు.
24వారు ఆ రాజులను యెహోషువ దగ్గరికి తీసుకు వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులందరిని పిలిపించి, తనతో యుద్ధానికి వెళ్లి వచ్చిన యోధుల అధిపతులతో “మీరు దగ్గరికి రండి, ఈ రాజుల మెడలపై మీ పాదాలను ఉంచండి” అని చెప్పగా, వారు దగ్గరికి వచ్చి వారి మెడలపై తమ పాదాలను ఉంచారు.
25అప్పుడు యెహోషువ వారితో “మీరు భయపడవద్దు, జడియవద్దు, ధీరత్వంతో ధైర్యంగా ఉండండి, మీరు ఎవరితో యుద్ధం చేస్తారో ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేస్తాడు” అన్నాడు.
26తరువాత యెహోషువ వారిని కొట్టి చంపి ఐదు చెట్ల మీద వారిని ఉరితీశాడు, వారి శవాలు సాయంకాలం వరకూ ఆ చెట్ల మీద వేలాడుతూనే ఉన్నాయి.
27పొద్దుగుంకే సమయంలో యెహోషువ అనుమతి ఇయ్యగా ప్రజలు చెట్ల మీద నుండి వారిని దించి, వారు దాగిన గుహలోనే ఆ శవాలను పడేసి ఆ గుహ ద్వారం దగ్గర పెద్ద రాళ్లను వేశారు. ఆ రాళ్లు ఈ రోజు వరకూ ఉన్నాయి. దక్షిణ నగరాలు స్వాధీనం
28ఆ రోజు యెహోషువ మక్కేదాను వశం చేసుకుని దాని రాజుతో సహా అందులోని వారందరినీ కత్తితో చంపేశాడు. అతడు దానిలో ఎవరినీ ప్రాణాలతో వదలకుండా నిర్మూలం చేసాడు. యెరికో రాజుకు చేసినట్టు మక్కేదా రాజుకూ చేశాడు.
29యెహోషువ, అతనితో కూడా ఇశ్రాయేలీయులంతా మక్కేదా నుండి లిబ్నాకు వచ్చి లిబ్నావారితో యుద్ధం చేశారు.
30యెహోవా దానినీ, దాని రాజునూ, ఇశ్రాయేలీయులకు అప్పగించగా వారు ఎవ్వరూ మిగలకుండా దాన్నీ, దానిలో ప్రాణాలతో ఉన్నవారందరినీ కత్తితో చంపేశారు. అతడు యెరికో రాజుకు చేసినట్టు దాని రాజుకూ చేశారు.
31తరువాత యెహోషువ, ఇశ్రాయేలీయులందరితో లిబ్నా నుండి లాకీషుకు వచ్చి అక్కడ దిగి లాకీషు వారితో యుద్దం చేయగా
32యెహోవా లాకీషుని ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించాడు. వారు రెండవ రోజు దాన్ని ఆక్రమించుకుని తాము లిబ్నాకు చేసినట్టే దాన్నీ, దానిలో ఉన్న వారందరినీ కత్తితో చంపేశారు.
33లాకీషుకు సహాయం చేయడానికి గెజెరు రాజైన హోరాము రాగా యెహోషువ అతన్నీ అతని ప్రజలనూ హతం చేశాడు.
34తరువాత యెహోషువ, అతనితో కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ లాకీషు నుండి ఎగ్లోనుకు వచ్చి దాని ముందు దిగి దాని నివాసులతో యుద్ధం చేసి
35ఆ రోజు దాన్ని ఆక్రమించుకుని, కత్తితో వారిని హతం చేశారు. అతడు లాకీషుకు చేసినట్టే వారు దానిలో ఉన్నవారందరినీ ఆ రోజు నిర్మూలం చేశారు.
36అప్పుడు యెహోషువ, అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ ఎగ్లోను నుండి హెబ్రోను మీదికి పోయి దాని ప్రజలతో యుద్ధం చేసి
37దాన్ని స్వాధీనం చేసుకుని దాన్నీ దాని రాజునూ దాని పట్టణాలన్నిటినీ దానిలో ఉన్న వారందరినీ కత్తితో హతం చేశారు. అతడు ఎగ్లోనుకు చేసినట్టే దాన్నీ దానిలో ఉన్న వారందరినీ నిర్మూలం చేశారు.
38అక్కడి నుండి యెహోషువ, అతనితో కూడ ఇశ్రాయేలీయులందరు దెబీరు వైపు తిరిగి దానితో యుద్ధం చేసి
39దానినీ దాని రాజునూ దాని సమస్త పట్టణాలనూ పట్టుకుని కత్తి చేత హతం చేసి దానిలో ఉన్న వారినందరినీ నిర్మూలం చేశారు. అతడు హెబ్రోనుకూ లిబ్నాకూ దాని రాజుకూ చేసినట్లు, దెబీరుకూ దాని రాజుకూ చేశాడు.
40తరువాత యెహోషువ పర్వత ప్రాంతాలనూ, దక్షిణ ప్రదేశాన్నీ షెఫేలా ప్రదేశాన్నీ చరియల ప్రదేశాన్నీ వాటి రాజులందరినీ జయించాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన విధంగా అతడు ఏదీ మిగలకుండా ఊపిరిగల సమస్తాన్నీ నిర్మూలం చేశాడు.
41కాదేషు బర్నేయ మొదలు గాజా వరకూ గిబియోను వరకూ గోషేను దేశమంతటినీ యెహోషువ జయించాడు.
42ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ఆ సమస్త రాజులనూ వారి దేశాలనూ యెహోషువ ఒక దెబ్బతోనే పట్టుకున్నాడు.
43తరువాత యెహోషువ, అతనితో కూడా ఇశ్రాయేలీయులంతా గిల్గాలులోని శిబిరానికి తిరిగి వచ్చారు.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
The Indian Revised Version Holy Bible in Telugu.
Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.

Bible text licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0).Original Telugu Scripture and full source copyright terms. This verse-only display adapts the original presentation by removing book introductions, editorial headings, source HTML formatting, and inline explanatory footnote popups while preserving Scripture wording and combined original verse ranges. This presentation of the Bible text remains under CC BY-SA 4.0; the copyright holder does not necessarily endorse these changes. Divine Threads study content is independently authored and separate from the licensed Scripture text.