ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) తెలుగు — 2019

యోబు 31

ఈ అధ్యాయాన్ని తెలుగులో చదవవచ్చు. Divine Threads అధ్యయనాలు తరువాత జోడించబడతాయి.

1నేను నా కన్నులతో ఒప్పందం చేసుకున్నాను గనక కన్యను కోరికతో ఎలా చూస్తాను?
2అలా చేస్తే పైనున్న దేవుని ఆజ్ఞ ఏమౌతుంది? ఉన్నత స్థలంలో ఉన్న సర్వశక్తుని వారసత్వం ఏమౌతుంది?
3ఆపద అనేది దుర్మార్గులకేననీ, విపత్తు దుష్టత్వం జరిగించే వారికేననీ నేను భావించే వాణ్ణి.
4ఆయనకు నా ప్రవర్తన తెలుసు గదా. ఆయన నా అడుగు జాడలన్నిటినీ లెక్కబెడతాడు గదా.
5అబద్ధికుడినై నేను తిరుగులాడి ఉన్నట్టయితే, మోసం చేయడానికి నా కాలు వేగిరపడినట్టయితే,
6నా యథార్థతను తెలుసుకునేందుకు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచు గాక.
7నేను న్యాయ మార్గం విడిచి నడచినట్టయితే, నా మనస్సు నా కళ్ళను అనుసరించి నడిచినట్టయితే మాలిన్యం ఏదైనా నా చేతులకు తగిలినట్టయితే,
8నేను విత్తనం చల్లి పండించిన దాన్ని వేరొకడు భుజించనియ్యండి. నా పంటను పెరికి వేయనియ్యండి.
9నేను హృదయంలో పరస్త్రీని మోహించినట్టయితే, నా పొరుగువాడి వాకిట్లో అతని భార్య కోసం నేను పొంచి ఉన్నట్టయితే,
10నా భార్య వేరొకడి తిరుగలి విసరు గాక. ఇతరులు ఆమెను అనుభవిస్తారు గాక.
11అది భయంకరమైన నేరం. అది న్యాయాధిపతుల చేత శిక్షనొందదగిన నేరం.
12అది నాశనకూపం వరకూ దహించే అగ్నిహోత్రం. అది నా పంట కోత అంతటినీ నిర్మూలం చేస్తుంది.
13నా సేవకుడైనా దాసి అయినా నాతో వ్యాజ్యెమాడి న్యాయం కోసం చేసిన విన్నపం నేను నిర్లక్ష్యం చేస్తే,
14దేవుడు లేచి నాపై తప్పు మోపినప్పుడు నేనేమి చేస్తాను? ఆయన విచారణకై వచ్చినప్పుడు నేను ఆయనకు ఏమి ప్రత్యుత్తరం ఇస్తాను?
15గర్భంలో నన్ను పుట్టించినవాడు వారిని కూడా పుట్టించ లేదా? గర్భంలో నన్నూ వారినీ కూడా రూపొందించినవాడు ఒక్కడే గదా.
16పేదలు కోరిన దాన్ని నేను బిగబట్టినట్టయితే, ఏడుపు మూలంగా వితంతువుల కళ్ళు క్షీణింపజేసినట్టయితే,
17తల్లిదండ్రులు లేని వారిని నా అన్నంలో కొంచెమైనా తిననియ్యక నేనొక్కడినే భోజనం చేస్తే,
18(నేను అలా చేయలేదు, నా యవ్వనప్రాయం మొదలు తండ్రి లేనివాడు నన్నొక తండ్రిగా భావించి నా దగ్గర పెరిగాడు. నా తల్లి కడుపున పుట్టింది మొదలు నేను అతని తల్లికి, ఆ వితంతువుకు దారి చూపించాను).
19ఎవరైనా బట్టల్లేక చావడం నేను చూస్తే, పేదలకు వస్త్రం లేకపోవడం నేను చూస్తే,
20వారి హృదయాలు నన్ను దీవించక పోతే, వారు నా గొర్రెల బొచ్చు చేత వెచ్చదనం పొందక పోయినట్టయితే,
21ఊరి రచ్చబండ దగ్గర అంతా నన్ను సమర్థిస్తారులే అని తండ్రిలేని వారి పై నేను చెయ్యి ఎత్తితే,
22నా భుజం ఎముక దాని గూటి నుండి జారిపోతుంది గాక. నా చేతి ఎముక దాని కీలు దగ్గర విరిగిపోతుంది గాక.
23దేవుడి నుండి ఆపద వస్తుందని నాకొక భయం ఉంది. ఆయన మహాత్మ్యం కారణంగా ఇలాంటివేమీ నేను చెయ్యలేదు.
24బంగారం నాకు ఆధారమనుకున్నట్టయితే, నా ఆశ్రయం నీవే అని మేలిమి బంగారంతో నేను చెప్పినట్టయితే,
25నాకు చాలా ఆస్తి ఉందని గానీ నా చేతికి విస్తారమైన సంపద దొరికిందని గానీ నేను సంతోషించినట్టయితే,
26సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను దాన్ని గానీ, చంద్రుడు మెరిసిపోతూ ఉన్నప్పుడు దాన్ని గానీ చూసి,
27నా హృదయం నాలో మురిసిపోయి వాటివైపు చూసి పూజ్య భావంతో నా నోరు ముద్దు పెట్టినట్టయితే,
28అది కూడా న్యాయాధిపతుల చేత శిక్ష పొందదగిన నేరమౌతుంది. ఎందుకంటే నేను పైనున్న దేవుణ్ణి కాదన్న వాడినౌతాను.
29నన్ను ద్వేషించిన వాడికి కలిగిన నాశనాన్ని బట్టి నేను సంతోషించినట్టయితే, అతనికి కీడు కలగడం చూసి నన్ను నేను అభినందించుకున్నట్టయితే,
30(పాపం చేయడానికి నేను నా నోటికి చోటియ్యలేదు. అతని ప్రాణం తీసే శాపం ఏదీ పలకలేదు).
31“యోబు పెట్టిన భోజనం తిని, తృప్తి పొందని వాణ్ణి ఎవరు చూపించగలరు?” అని నా ఇంట్లో నివసించేవారు అనకపోతే,
32(పరదేశి ఎప్పుడూ ఆరుబయట ఉండే పరిస్థితి రాలేదు. బాటసారుల కోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉన్నాయి).
33మానవ జాతి చేసినట్టు నా పాపాలను దాచి పెట్టుకోలేదు. నా అంగీలో దోషాన్ని కప్పి ఉంచుకోలేదు.
34జన సమూహానికి భయపడి, కుటుంబాల తిరస్కారానికి జడిసి నేను మౌనంగా ఉండి ద్వారం దాటి బయటికి వెళ్లకుండా దాక్కోలేదు.
35నా మాట వినడానికి నాకొకడు ఉంటే ఎంత బాగుంటుంది! ఇదిగో నా సంతకం. సర్వశక్తుడు నాకు జవాబిస్తాడు గాక. ఇదిగో నా ప్రతివాది రాసిన అభియోగం ఎవరైనా నాకు చూపిస్తే ఎంత బాగుంటుంది!
36నిశ్చయంగా నేను నా భుజం మీద దాన్ని ధరిస్తాను. దాన్ని కిరీటంగా పెట్టుకుంటాను.
37నేను వేసిన అడుగుల లెక్క ఆయనకు తెలియజేస్తాను. రాజు లాగా నిబ్బరంగా నేనాయన దగ్గరికి వెళ్తాను.
38నా భూమి నా గురించి మొర పెడితే, దాని చాళ్లు ఏకమై ఏడిస్తే,
39వెల చెల్లించకుండా నేను దాని పంటను అనుభవించినట్టయితే, దాని యజమానులకు ప్రాణహాని కలగజేసినట్టయితే,
40గోదుమల బదులు ముళ్లు, బార్లీకి బదులు కలుపు మొలచు గాక. యోబు మాటలు ఇంతటితో సమాప్తం.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
The Indian Revised Version Holy Bible in Telugu.
Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.

Bible text licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0).Original Telugu Scripture and full source copyright terms. This verse-only display adapts the original presentation by removing book introductions, editorial headings, source HTML formatting, and inline explanatory footnote popups while preserving Scripture wording and combined original verse ranges. This presentation of the Bible text remains under CC BY-SA 4.0; the copyright holder does not necessarily endorse these changes. Divine Threads study content is independently authored and separate from the licensed Scripture text.