ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) తెలుగు — 2019

యిర్మీయా 7

ఈ అధ్యాయాన్ని తెలుగులో చదవవచ్చు. Divine Threads అధ్యయనాలు తరువాత జోడించబడతాయి.

1యెహోవా దగ్గర నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు
2“నువ్వు యెహోవా మందిర ద్వారంలో నిలబడి ఈ మాట ప్రకటించు. యెహోవాను పూజించడానికి ఈ ద్వారాల గుండా వచ్చే యూదా ప్రజలారా, యెహోవా మాట వినండి.
3సైన్యాల ప్రభువు, ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా చెప్పేదేమంటే, మీరు ఈ స్థలంలో నివసించడానికి నేను అనుమతించాలంటే మీ మార్గాలు, క్రియలు సరి చేసుకోండి.
4ఇది యెహోవా ఆలయం! యెహోవా ఆలయం! యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనే మోసకరమైన మాటల వలలో పడకండి.”
5మీ మార్గాలు, క్రియలు మీరు యథార్థంగా సరిచేసుకుని ప్రతివాడూ తన పొరుగువాడి పట్ల న్యాయం జరిగించాలి.
6పరదేశుల్నీ తండ్రి లేని వారినీ వితంతువులనూ బాధించకూడదు. ఈ స్థలంలో నిర్దోషి రక్తం చిందించకూడదు. మీకు హాని చేసే అన్య దేవతలను పూజించకూడదు.
7అలా అయితే మీరు శాశ్వతంగా నివసించడానికి పూర్వమే నేను మీ పూర్వికులకు ఇచ్చిన ఈ దేశంలో మిమ్మల్ని ఉండనిస్తాను.
8అయితే మీరు ప్రయోజనం లేని మోసపు మాటలు నమ్ముతున్నారు.
9మీరు వ్యభిచారం, దొంగతనం, నరహత్యలు,
10అబద్ధ ప్రమాణాలు చేస్తూ, బయలు దేవుడికి ధూపం వేస్తూ మీకు తెలియని దేవుళ్ళను అనుసరిస్తున్నారు. అదే సమయంలో నా పేరు పెట్టిన ఈ మందిరంలోకి వచ్చి నా సన్నిధిలో నిలబడి “మేం తప్పించుకున్నాం” అంటున్నారు. మీరు విడుదల పొందింది ఈ అసహ్యమైన పనులు చేయడానికేనా?
11నా పేరు పెట్టిన ఈ మందిరం మీ కంటికి దొంగల గుహలాగా ఉందా? దీన్నంతా నేను చూస్తూనే ఉన్నానని తెలుసుకోండి. ఇదే యెహోవా వాక్కు.
12గతంలో నేను నా సన్నిధిని ఉంచిన షిలోహుకు వెళ్లి పరిశీలించండి. నా ప్రజలైన ఇశ్రాయేలీయుల ద్రోహాన్ని బట్టి నేను దానికి ఏం చేశానో చూడండి.
13నేను మీతో పదే పదే మాట్లాడినా మీరు వినలేదు. మిమ్మల్ని పిలిచినా మీరు జవాబు చెప్పకుండా మీరు ఈ పనులన్నీ చేశారు.
14కాబట్టి నేను షిలోహుకు చేసినట్టే నా పేరు పెట్టిన ఈ మందిరానికీ, మీకూ మీ పూర్వికులకూ నేనిచ్చిన ఈ స్థలానికీ చేస్తాను.
15మీ సోదరులైన ఎఫ్రాయిము సంతానాన్ని నేను వెళ్లగొట్టినట్టు మిమ్మల్ని కూడా నా సన్నిధి నుండి వెళ్లగొడతాను.
16కాబట్టి యిర్మీయా, నువ్వు ఈ ప్రజల కోసం ప్రార్థన చేయవద్దు. వారి పక్షంగా మొర్రపెట్టడం, విజ్ఞాపన చేయడం చేయవద్దు. నన్ను బతిమాలవద్దు. ఎందుకంటే నేను నీ మాట వినను.
17యూదా పట్టణాల్లో, యెరూషలేము వీధుల్లో వారు చేస్తున్న పనులు నువ్వు చూస్తున్నావు కదా.
18నాకు కోపం పుట్టించడానికి ఆకాశరాణి దేవతకు పిండివంటలు చేయాలనీ, అన్య దేవుళ్ళకు పానార్పణలు పోయాలనీ పిల్లలు కట్టెలు ఏరుతున్నారు, తండ్రులు అగ్ని రగులబెడుతున్నారు, స్త్రీలు పిండి పిసుకుతున్నారు.
19నన్ను రెచ్చగొట్టడానికే అలా చేస్తున్నారా? అది వారు తమకు తాము అవమానం తెచ్చుకున్నట్టు కాదా?
20కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, ఈ స్థలం మీదా, ఈ మనుషుల మీదా, జంతువుల మీదా, పొలాలమీదా, చెట్ల మీదా, పంటల మీదా నా కోపాన్ని, నా ఉగ్రతను కుమ్మరిస్తాను. అది ఎన్నటికీ ఆరదు, మండుతూనే ఉంటుంది.
21సేనల ప్రభువు, ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా చెప్పేదేమంటే, మీ దహన బలులూ ఇతర బలులూ కలిపి వాటి మాంసం అంతా మీరే తినండి.
22నేను ఐగుప్తు దేశం నుండి మీ పూర్వికులను రప్పించిన రోజున వారి నుండి ఏమీ కోరలేదు. దహన బలుల గురించీ ఇంకా ఇతర బలుల గురించీ నేను వారికి ఆజ్ఞాపించలేదు.
23ఒక్క ఆజ్ఞ మాత్రం ఇచ్చాను. అదేమంటే, “మీరు నా మాటలు అంగీకరిస్తే నేను మీకు దేవుడుగా ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు. నేను మీకాజ్ఞాపించిన మార్గాల్లో నడుచుకోండి. అప్పుడు మీకు క్షేమం కలుగుతుంది.”
24అయితే వారు వినలేదు, అస్సలు వినలేదు. తమ దుష్టహృదయంలో నుండి వచ్చిన ఆలోచనల ప్రకారం జీవించారు. కాబట్టి వారు ముందుకు సాగలేక వెనకబడిపోయారు.
25మీ పూర్వికులు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకూ నేను ఎడతెగక నా సేవకులైన ప్రవక్తలను మీ దగ్గరికి పంపుతూ వచ్చాను.
26అయినా వారు నా మాట వినలేదు, పెడచెవిని పెట్టారు. తలబిరుసు తనంతో తమ మనస్సు కఠినం చేసుకున్నారు. వారు తమ పూర్వీకుల కంటే మరీ దుర్మార్గులయ్యారు.
27నువ్వు ఈ మాటలన్నీ వారితో చెప్పినా వారు నీ మాట వినరు. నువ్వు పిలిచినా వారు బదులు చెప్పరు.
28కాబట్టి నువ్వు వారితో ఇలా చెప్పు. “ఈ దేశం తమ దేవుడైన యెహోవా మాట వినలేదు. క్రమశిక్షణకు లోబడలేదు. కాబట్టి సత్యం వారిలో నుండి తొలగిపోయింది. అది వారి నోటినుండి కొట్టి వేయబడింది.
29తనకు కోపం తెప్పించిన తరం ప్రజలను యెహోవా విసర్జించి వెళ్లగొట్టాడు. నీ తలవెండ్రుకలు కత్తిరించుకో. వాటిని పారవెయ్యి. చెట్లు లేని ఉన్నత స్థలాల్లో రోదన చెయ్యి. వధ లోయ
30యెహోవా చెప్పేదేమంటే, యూదా ప్రజలు నా దృష్టికి దుష్టత్వం జరిగిస్తున్నారు, నా పేరు పెట్టిన మందిరం అపవిత్రమయ్యేలా వారు దానిలో అసహ్యమైన వస్తువులు ఉంచారు.
31నేనాజ్ఞాపించని దాన్ని, నా ఆలోచనలో లేని దాన్ని వారు చేశారు. అగ్నిలో తమ కొడుకులనూ, కూతుళ్ళనూ కాల్చడానికి బెన్‌ హిన్నోము లోయలోని తోఫెతులో బలిపీఠాలు కట్టారు.
32యెహోవా చెప్పేదేమంటే, ఒక రోజు రాబోతున్నది. అప్పుడు దాన్ని తోఫెతు అని గానీ, బెన్‌ హిన్నోము లోయ అని గానీ పిలవరు, దాన్ని ‘వధ లోయ’ అని పిలుస్తారు. ఎందుకంటే, పాతిపెట్టడానికి స్థలం లేకపోయేటంత వరకూ తోఫెతులో శవాలు పాతిపెడతారు.
33అప్పుడు ఈ ప్రజల శవాలు ఆకాశ పక్షులకూ భూజంతువులకూ ఆహారంగా మారతాయి. వాటిని తోలివేయడానికి ఎవరూ ఉండరు.
34ఈ దేశం తప్పకుండా పాడైపోతుంది. యూదా పట్టణాల్లో, యెరూషలేము వీధుల్లో ఆనంద ధ్వనులు, కేరింతలు, పెళ్ళికొడుకు, పెళ్ళికూతుళ్ళ స్వరాలు వినబడకుండా చేస్తాను.”
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
The Indian Revised Version Holy Bible in Telugu.
Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.

Bible text licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0).Original Telugu Scripture and full source copyright terms. This verse-only display adapts the original presentation by removing book introductions, editorial headings, source HTML formatting, and inline explanatory footnote popups while preserving Scripture wording and combined original verse ranges. This presentation of the Bible text remains under CC BY-SA 4.0; the copyright holder does not necessarily endorse these changes. Divine Threads study content is independently authored and separate from the licensed Scripture text.