ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) తెలుగు — 2019

యిర్మీయా 19

ఈ అధ్యాయాన్ని తెలుగులో చదవవచ్చు. Divine Threads అధ్యయనాలు తరువాత జోడించబడతాయి.

1యెహోవా ఇలా చెప్పాడు,
2నువ్వు వెళ్లి కుమ్మరి చేసిన మట్టికుండ కొను. ప్రజల పెద్దల్లో కొంతమందినీ యాజకుల్లో పెద్దవారినీ వెంటబెట్టుకుని హర్సీతు ద్వారానికి ఎదురుగా ఉన్న బెన్‌ హిన్నోము లోయలోకి వెళ్ళి, నేను నీతో చెప్పే ఈ మాటలు అక్కడ ప్రకటించు.
3“యూదా రాజులారా! యెరూషలేము నివాసులారా! యెహోవా మాట వినండి. సేనల అధిపతి యెహోవా, ఇశ్రాయేలు దేవుడు చెప్పేది వినండి. నేను ఈ స్థలం మీదికి విపత్తు రప్పిస్తున్నాను. దాని గురించి వినేవారందరి చెవులు గింగురుమనేటంత భయంకరంగా ఉంటుంది.
4ఎందుకంటే వాళ్ళు నన్ను విడిచిపెట్టి ఈ స్థలాన్ని పాడు చేశారు. వాళ్ళకు తెలియని ఇతర దేవుళ్ళ ఎదుట ధూపం వేశారు. వాళ్ళూ వాళ్ళ పూర్వీకులూ యూదా రాజులు కూడా నిరపరాధుల రక్తంతో ఈ స్థలాన్ని నింపారు.
5వాళ్ళు తమ కొడుకులను దహనబలులుగా కాల్చడానికి బయలుకు బలిపీఠాలు కట్టించారు. అలా చేయమని నేను వాళ్లకు చెప్పలేదు, అది నా మనస్సుకు ఎన్నడూ తోచలేదు.”
6కాబట్టి యెహోవా చెప్పేదేమిటంటే “రాబోయే రోజుల్లో ఈ స్థలాన్ని ‘వధ లోయ’ అంటారు. తోఫెతు అని గానీ బెన్‌ హిన్నోము లోయ అని గానీ అనరు.
7ఈ స్థలం లోనే యూదావారి ఆలోచనను యెరూషలేమువారి ఆలోచనను నేను వ్యర్ధం చేస్తాను. తమ శత్రువుల ఎదుట కత్తిపాలయ్యేలా చేస్తాను. తమ ప్రాణాలను తీయాలని చూసే వాళ్ళ చేతికి అప్పగిస్తాను. వాళ్ళ శవాలను రాబందులకూ అడవి జంతువులకూ ఆహారంగా ఇస్తాను.
8ఈ పట్టణాన్ని పాడు చేసి ఎగతాళికి గురి చేస్తాను. ఆ దారిలో వెళ్ళే ప్రతివాడూ దాని కడగండ్లన్నీ చూసి నిర్ఘాంతపోయి హేళన చేస్తారు.
9వాళ్ళు తమ కొడుకుల, కూతుళ్ళ శరీరాలను తినేలా చేస్తాను. తమ ప్రాణం తీయాలని చూసే శత్రువులు ముట్టడి వేసి బాధించే కాలంలో వాళ్ళు ఒకరి శరీరాన్ని ఒకరు తింటారు.
10ఈ మాటలు చెప్పిన తరువాత నీతో వచ్చిన మనుష్యులు చూస్తుండగా నువ్వు ఆ కుండ పగలగొట్టి వాళ్ళతో ఇలా చెప్పాలి.”
11“సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు, మళ్ళీ బాగుచేయడానికి వీలు లేకుండా కుమ్మరివాని కుండను ఒకడు పగలగొట్టినట్టు నేను ఈ ప్రజలనూ ఈ పట్టణాన్నీ పగలగొట్టబోతున్నాను. తోఫెతులో పాతిపెట్టే చోటు దొరకనంతగా వాళ్ళను అక్కడే పాతిపెడతారు.”
12యెహోవా వాక్కు ఇదే. “ఈ పట్టణాన్ని తోఫెతులాంటి స్థలంగా నేను చేస్తాను. ఈ స్థలానికీ అక్కడి నివాసులకూ నేనలా చేస్తాను.
13యెరూషలేము ఇళ్ళు, యూదా రాజుల రాజ భవనాలూ ఆ తోఫెతు స్థలం లాగే అపవిత్రమవుతాయి. ఏ ఇళ్ళ మీద ప్రజలు ఆకాశ నక్షత్ర సమూహానికి మొక్కి ఇతర దేవుళ్ళకు పానార్పణలు చేశారో ఆ ఇళ్ళన్నిటికీ ఆలాగే జరుగుతుంది.”
14యిర్మీయా ఆ ప్రవచనం చెప్పడానికి యెహోవా తనను పంపిన తోఫెతులో నుంచి వచ్చి యెహోవా మందిరపు ఆవరణంలో నిలబడి ప్రజలందరితో ఇలా చెప్పాడు,
15“సేనల ప్రభువు యెహోవా, ఇశ్రాయేలు దేవుడు ఈ మాట చెబుతున్నాడు. ఈ ప్రజలు నా మాటలు వినకుండా మొండికెత్తారు. కాబట్టి ఈ పట్టణం గురించి నేను చెప్పిన విపత్తునంతా దాని మీదికీ దానికి సంబంధించిన పట్టణాలన్నిటి మీదికీ రప్పిస్తున్నాను.”
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
The Indian Revised Version Holy Bible in Telugu.
Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.

Bible text licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0).Original Telugu Scripture and full source copyright terms. This verse-only display adapts the original presentation by removing book introductions, editorial headings, source HTML formatting, and inline explanatory footnote popups while preserving Scripture wording and combined original verse ranges. This presentation of the Bible text remains under CC BY-SA 4.0; the copyright holder does not necessarily endorse these changes. Divine Threads study content is independently authored and separate from the licensed Scripture text.