ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) తెలుగు — 2019

న్యాయాధిపతులు 8

ఈ అధ్యాయాన్ని తెలుగులో చదవవచ్చు. Divine Threads అధ్యయనాలు తరువాత జోడించబడతాయి.

1అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో “నువ్వు మా పట్ల ఇలా ఎందుకు చేశావు? మిద్యానీయులతో యుద్ధం చెయ్యడానికి నువ్వు వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు?” అని అతనితో తీవ్రంగా వాదించారు.
2అందుకు అతడు “మీరు చేసినదేమిటీ, నేను చేసినదేమిటి? అబీయెజెరు ద్రాక్షపండ్ల కోతకంటే ఎఫ్రాయిమీయుల పరిగె మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులు ఓరేబు, జెయేబు మీద మీకు జయం ఇచ్చాడు. మీరు చేసినట్టు నేను చెయ్యగలనా?” అన్నాడు
3అతడు అలా చెప్పినప్పుడు అతని మీద వాళ్లకు కోపం తగ్గింది.
4గిద్యోను, అతనితో ఉన్న మూడువందల మందీ అలసట చెందినప్పటికీ మిద్యానీయుల శత్రువులను తరుముతూ, యొర్దాను దగ్గరికి వచ్చి, దాన్ని దాటారు.
5అతడు సుక్కోతు వాళ్ళతో “నా వెంట ఉన్న ప్రజలు అలసి ఉన్నారు, మేము మిద్యాను రాజులైన జెబహును, సల్మున్నాను తరుముతున్నాము. దయచేసి నాతో వస్తున్నవారికి రొట్టెలు ఇవ్వండి” అని అడిగాడు.
6సుక్కోతు అధిపతులు “జెబహు, సల్మున్నా అనే వాళ్ళను నువ్వు ఇంకా జయించలేదు కదా? నీ సైన్యానికి మేము రొట్టెలు ఎందుకివ్వాలి?” అన్నారు.
7అందుకు గిద్యోను “జెబహు సల్మున్నా మీద యెహోవా నాకు జయం ఇచ్చిన తరువాత, ముళ్ళపొదలతోను, ఎడారి కంపలతోను మీ శరీరాలను చీరేస్తాను” అని చెప్పాడు.
8అక్కడనుంచి అతడు పెనూయేలుకు వెళ్ళి అలాగే వాళ్ళనూ అడిగినప్పుడు, సుక్కోతు వాళ్ళు జవాబిచ్చినట్టు పెనూయేలువాళ్ళు కూడా అతనికి జవాబిచ్చారు గనుక అతడు,
9“నేను క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురాన్ని పడగొడతాను” అని పెనూయేలు వాళ్ళతో చెప్పాడు.
10అప్పుడు జెబహు, సల్మున్నా వాళ్ళతో కూడా వాళ్ళ సైన్యాలు, అంటే తూర్పు ప్రజల సైన్యమంతటిలో మిగిలినవాళ్ళు ఇంచుమించు పదిహేను వేలమంది మాత్రమే, కర్కోరులో ఉన్నారు. లక్షా ఇరవైవేలమంది అప్పటికే చనిపోయారు.
11అప్పుడు గిద్యోను నోబహుకు, యొగేబ్బెహకు తూర్పున, దేశ సంచారుల మార్గాన శత్రు శిబిరానికి వెళ్ళి, శత్రుసైన్యం నిర్భయంగా ఉన్న కారణంగా ఆ సైన్యాన్ని ఓడించాడు.
12జెబహు, సల్మున్నా పారిపోయినప్పుడు అతడు వాళ్ళను తరిమి ఇద్దరు మిద్యాను రాజులు జెబహును, సల్మున్నాను పట్టుకుని ఆ సేనంతటిని చెదరగొట్టాడు.
13యుద్ధం ముగిసిన తరువాత యోవాషు కొడుకు గిద్యోను
14హెరెసు ఎగువనుంచి తిరిగి వచ్చి, సుక్కోతు వాళ్ళలో ఒక యువకుణ్ణి పట్టుకుని విచారణ చేయగా అతడు సుక్కోతు అధిపతులు, పెద్దల్లో డెబ్భై ఏడుగురి పేర్లు వివరంగా చెప్పాడు.
15అప్పుడతడు సుక్కోతు వాళ్ళ దగ్గరికి వచ్చి “ ‘జెబహు, సల్మున్నా అనేవాళ్ళను నువ్వు ఇంకా జయించలేదు కదా? నీ సైన్యానికి మేము రొట్టెలు ఎందుకివ్వాలి?’ అని మీరు ఎవరి విషయంలో నన్ను దూషించారో, ఆ జెబహును, సల్మున్నాలను, చూడండి” అని చెప్పి
16ఆ ఊరిపెద్దలను పట్టుకుని, ముళ్ళకంపను, బొమ్మజెముడును తీసుకు వాటితో సుక్కోతు వాళ్ళకు బుద్ధి చెప్పాడు.
17అతడు పెనూయేలు గోపురాన్ని పడగొట్టి ఆ ఊరివాళ్ళను చంపాడు.
18గిద్యోను, మీరు తాబోరులో చంపిన మనుష్యులు ఎలాంటి వారని జెబహును సల్మున్నాను అడిగినప్పుడు వాళ్ళు “నీలాంటివాళ్ళే. వాళ్ళందరూ రాకుమారుల్లా ఉన్నారు” అన్నారు.
19గిద్యోను “వాళ్ళు నా తల్లి కుమారులు. నా సహోదరులు. మీరు వాళ్ళను బ్రతకనిచ్చి ఉంటే
20యెహోవా జీవం తోడు, మిమ్మల్ని చంపేవాణ్ణి కాదు” అని చెప్పి, తన పెద్ద కొడుకు యెతెరును చూసి “నువ్వు లేచి వాళ్ళని చంపు” అన్నాడు. అతడు పసి వాడు గనుక భయపడి కత్తిని దూయలేదు.
21అప్పుడు జెబహు సల్మున్నాలు “వయస్సునుబట్టి మనిషికి శక్తి ఉంటుంది గనుక, నువ్వే లేచి, మమ్మల్ని చంపు” అన్నారు. గిద్యోను లేచి జెబహును, సల్మున్నాను చంపి, వాళ్ళ ఒంటెల మెడల మీద ఉన్న చంద్రహారాలను తీసుకున్నాడు. గిద్యోను ఏఫోదు
22అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో “నువ్వు మిద్యానీయుల చేతిలోనుంచి మమ్మల్ని రక్షించావు గనుక నువ్వు, నీ కొడుకు, నీ మనవడు, మమ్మల్ని పరిపాలించండి” అని చెప్పారు.
23అందుకు గిద్యోను “నేను మిమ్మల్ని పాలించను, నా కుమారుడు కూడా మిమ్మల్ని పాలించకూడదు. యెహోవా మిమ్మల్ని పరిపాలిస్తాదు” అని చెప్పాడు.
24గిద్యోను “మీలో ప్రతివాడూ తన దోపుడు సొమ్ములో ఉన్న చెవి పోగులను నాకు ఇవ్వండి అని మనవి చేస్తున్నాను” అన్నాడు. (మిద్యానీయులు ఇష్మాయేలీయులు గనుక వాళ్ళ చెవులకు పోగులు ఉన్నాయి.)
25అందుకు ఇశ్రాయేలీయులు “సంతోషంగా మేము వాటిని నీకు ఇస్తాము” అని చెప్పి ఒక బట్ట పరచి, ప్రతివాడూ తన దోపుడు సొమ్ములో ఉన్న పోగులను దాని మీద వేశాడు.
26మిద్యాను రాజుల ఒంటి మీద ఉన్న చంద్రహారాలు, కర్ణభూషణాలు, ధూమ్రవర్ణపు దుస్తులు, ఒంటెల మెడల మీద ఉన్న గొలుసుల తూకం కాకుండా అతడు కోరిన బంగారు పోగుల బరువు పదిహేడు వందల తులాల బంగారం అయ్యింది. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించి తన సొంత ఊరు ఒఫ్రాలో దాన్ని ఉంచాడు.
27కాబట్టి ఇశ్రాయేలీయులంతా ద్రోహులై అక్కడికి వెళ్ళి దానికి మొక్కి వ్యభిచారులయ్యారు. అది గిద్యోనుకు, అతని ఇంటివాళ్ళకు ఒక ఉచ్చుగా అయ్యింది. గిద్యోనుమరణం
28ఇశ్రాయేలీయులు మిద్యానీయులను అణచి వేసిన తరువాత, ఇంక వాళ్ళు తలెత్త లేకపోయారు. గిద్యోను కాలంలో దేశం నలభై సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది.
29తరువాత యోవాషు కొడుకు యెరుబ్బయలు, తన సొంత ఇంట్లో నివాసం ఉండడానికి వెళ్ళిపోయాడు.
30గిద్యోనుకు చాలామంది భార్యలు ఉన్న కారణంగా అతని కడుపున పుట్టినవాళ్ళు డెబ్భై మంది కొడుకులు ఉన్నారు.
31షెకెములో ఉన్న అతని ఉపపత్ని కూడా అతనికి ఒక కొడుకును కన్నప్పుడు గిద్యోను అతనికి అబీమెలెకు అని పేరు పెట్టాడు.
32యోవాషు కొడుకు గిద్యోను ముసలివాడై చనిపోయాడు. అబీయెజ్రీయుల ఒఫ్రాలో ఉన్న అతని తండ్రి యోవాషు సమాధిలో అతణ్ణి పాతిపెట్టారు.
33గిద్యోను చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు తమ శత్రువుల చేతిలోనుంచి తమను విడిపించిన యెహోవా దేవుణ్ణి ఘనపరచక, ఆయన్ని జ్ఞాపకం చేసుకోక,
34మళ్ళీ బయలుదేవుళ్ళను అనుసరించి, వ్యభిచారులై, బయల్బెరీతును తమకు దేవుడుగా చేసుకున్నారు.
35వాళ్ళు యెరుబ్బయలు (అంటే గిద్యోను) ఇశ్రాయేలీయులకు చేసిన ఉపకారమంతా మరచిపోయి, అతని యింటివాళ్ళకు ఇచ్చిన మాట ప్రకారం, ఉపకారం చెయ్యలేదు.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
The Indian Revised Version Holy Bible in Telugu.
Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.

Bible text licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0).Original Telugu Scripture and full source copyright terms. This verse-only display adapts the original presentation by removing book introductions, editorial headings, source HTML formatting, and inline explanatory footnote popups while preserving Scripture wording and combined original verse ranges. This presentation of the Bible text remains under CC BY-SA 4.0; the copyright holder does not necessarily endorse these changes. Divine Threads study content is independently authored and separate from the licensed Scripture text.