ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) తెలుగు — 2019

యెషయా 27

ఈ అధ్యాయాన్ని తెలుగులో చదవవచ్చు. Divine Threads అధ్యయనాలు తరువాత జోడించబడతాయి.

1ఆ రోజున యెహోవా చేతితో తన కత్తి పట్టుకుంటాడు. ఆ కత్తి గొప్పది, తీక్షణమైనది, గట్టిది. భీకరమైన సర్పాన్ని, మొసలి రూపాన్ని పోలిన “లేవియాతాన్” ను ఆయన శిక్షిస్తాడు. వంకరలు తిరుగుతూ, జారిపోతున్న సర్పాన్ని శిక్షిస్తాడు. ఆ సముద్ర జీవిని ఆయన సంహరిస్తాడు.
2ఆ రోజున ఫలభరితమైన ద్రాక్ష తోటను గూర్చి పాడండి.
3యెహోవా అనే నేనే దాన్ని సంరక్షిస్తున్నాను. ప్రతీ నిత్యం దానికి నీళ్ళు పోస్తున్నాను. దానికి ఎవడూ హాని తలపెట్టకుండా పగలూ రాత్రీ కాపలా కాస్తున్నాను.
4నాకిప్పుడు కోపం ఏమీ లేదు. ఒకవేళ గచ్చ పొదలూ ముళ్ళ చెట్లూ మొలిస్తే యుద్ధంలో చేసినట్టుగా వాటికి విరోధంగా ముందుకు సాగుతాను. వాటన్నిటినీ కలిపి తగలబెట్టేస్తాను.
5ఇలా జరగకుండా ఉండాలంటే వాళ్ళు నా సంరక్షణలోకి రావాలి. నాతో సంధి చేసుకోవాలి. వాళ్ళు నాతో సంధి చేసుకోవాలి.
6రాబోయే ఆ రోజున యాకోబు వేరు వ్యాపిస్తుంది. ఇశ్రాయేలు జాతి మొగ్గ వేసి పుష్పిస్తుంది. వాళ్ళు భూమినంతా ఫలభరితం చేస్తారు.
7యాకోబు, ఇశ్రాయేలును వాళ్ళు కొట్టారు. వాళ్ళను యెహోవా కొట్టాడు. వాళ్ళను కొట్టినట్టు యెహోవా యాకోబు, ఇశ్రాయేలును కొట్టాడా? యాకోబు, ఇశ్రాయేలును చంపిన వాళ్ళని ఆయన చంపినట్టు ఆయన యాకోబు, ఇశ్రాయేలులను చంపాడా?
8నువ్వు అలా చేయలేదు. స్వల్పమైన శిక్షనే విధించావు. ఇతర దేశాల్లోకి ఇశ్రాయేలును బహిష్కరించావు. తూర్పు నుండి తీవ్రమైన గాలి రప్పించి వాళ్ళని తరిమావు.
9యాకోబు చేసిన పాపానికి ఈ విధంగా పరిహారం జరుగుతుంది. అది అతడు చేసిన పాప పరిహారానికి కలిగే ఫలం. సున్నపురాతిని చూర్ణం చేసినట్టు అతడు బలిపీఠపు రాళ్ళను చిన్నాభిన్నం చేస్తాడు. అషేరా దేవతా స్తంభాలూ, ధూపం వేసే వేదికలూ ఇక నిలిచి ఉండవు.
10అలాగే ప్రాకారాలున్న పట్టణం నిర్మానుష్యంగా మారుతుంది. నివాస స్థలాలు మనుషులు లేని అరణ్యాల్లా మారతాయి. అక్కడ దూడలు మేస్తాయి. అవి అక్కడే పడుకుని చెట్ల కొమ్మలను తింటాయి.
11ఆ కొమ్మలు ఎండిపోయినప్పుడు విరిగిపడతాయి. స్త్రీలు వచ్చి వాటితో మంట పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ ప్రజలు జ్ఞానం ఉన్న వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళ సృష్టికర్త వాళ్ళపై కనికరపడడు. వాళ్ళని చేసిన వాడు వాళ్ళపై దయ చూపించడు.
12ఆ రోజున యెహోవా ప్రవహిస్తున్న యూఫ్రటీసు నది నుండి ఐగుప్తు వాగు వరకూ వాళ్ళను ధాన్యాన్ని నూర్చినట్టు నూరుస్తాడు. ఇశ్రాయేలు ప్రజలైన మిమ్మల్ని ఒక్కొక్కరిగా సమకూరుస్తాడు.
13ఆ రోజున పెద్ద బాకా ధ్వని వినిపిస్తుంది. అష్షూరు దేశంలో అంతరిస్తున్న వాళ్ళూ, ఐగుప్తులో బహిష్కరణకి గురైన వాళ్ళూ తిరిగి వస్తారు. యెరూషలేములో ఉన్న పవిత్ర పర్వతంపై ఉన్న యెహోవాను ఆరాధిస్తారు.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
The Indian Revised Version Holy Bible in Telugu.
Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.

Bible text licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0).Original Telugu Scripture and full source copyright terms. This verse-only display adapts the original presentation by removing book introductions, editorial headings, source HTML formatting, and inline explanatory footnote popups while preserving Scripture wording and combined original verse ranges. This presentation of the Bible text remains under CC BY-SA 4.0; the copyright holder does not necessarily endorse these changes. Divine Threads study content is independently authored and separate from the licensed Scripture text.