ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) తెలుగు — 2019

హెబ్రీయులకు రాసిన పత్రిక 3

ఈ అధ్యాయాన్ని తెలుగులో చదవవచ్చు. Divine Threads అధ్యయనాలు తరువాత జోడించబడతాయి.

1కాబట్టి, పరలోక సంబంధమైన పిలుపులో భాగస్థులూ, పరిశుద్ధులూ అయిన సోదరులారా, మన ఒప్పుకోలుకు అపొస్తలుడూ, ప్రధాన యాజకుడూ అయిన యేసును గూర్చి ఆలోచించండి.
2దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నట్టే ఈయన కూడా తనను నియమించిన దేవునికి నమ్మకంగా ఉన్నాడు.
3మోషే కంటే ఎక్కువ కీర్తి యశస్సులకు ఈయన యోగ్యుడిగా లెక్కలోకి వచ్చాడు. ఎందుకంటే నిర్మాణం అయిన ఇంటి కంటే దాన్ని నిర్మించిన వాడికే ఎక్కువ గౌరవం.
4ప్రతి ఇంటినీ ఎవరో ఒకరు నిర్మిస్తారు. కానీ సమస్తాన్నీ నిర్మించిన వాడు దేవుడే.
5దేవుడు భవిష్యత్తులో చెప్పే వాటికి సాక్షమివ్వడానికి మోషే ఒక సేవకుడిగా దేవుని ఇంట్లో నమ్మకమైనవాడుగా ఉన్నాడు.
6కానీ క్రీస్తు కుమారుడి యూదాలో దేవుని ఇంటి నిర్వాహకుడిగా ఉన్నాడు. మనకు కలిగిన ఆత్మనిబ్బరాన్నీ, ఆ నిబ్బరం వల్ల కలిగే అతిశయాన్నీ గట్టిగా పట్టుకుని ఉంటే మనమే ఆయన ఇల్లు. హెచ్చరిక. ఈజిప్టు విడిచి వచ్చిన తరం అపనమ్మకం వల్లనే కనాను విశ్రాంతిలోకి ప్రవేశించలేక పోయారు
7కాబట్టి పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా, “ఈ రోజు మీరు ఆయన మాట విన్నట్టయితే
8అరణ్యంలో శోధన ఎదురైనప్పుడు తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీయుల్లాగా మీ హృదయాలను కఠినం చేసుకోవద్దు.
9నలభై సంవత్సరాలు నేను చేసిన గొప్ప కార్యాలన్నీ చూసినా మీ పూర్వీకులు తిరుగుబాటు చేసి నన్ను పరీక్షించారు.
10కాబట్టి ఆ తరం వారి వల్ల నేను అసంతృప్తి చెందాను. కాబట్టి నేను కోపంతో ‘వీళ్ళు ఎప్పుడూ తమ హృదయాలోచనల్లో తప్పిపోతున్నారు. నా మార్గాలు తెలుసుకోలేదు.
11వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు’ అని కోపంగా శపథం చేశాను.”
12సోదరులారా, సజీవుడైన దేవుని నుండి తొలగిపోయే హృదయం, అవిశ్వాసంతో నిండిన చెడ్డ హృదయం మీలో ఉండకుండాా జాగ్రత్త పడండి.
13పాపపు వంచన వల్ల మీలో ఎవరూ కఠినులు కాకుండా ప్రతిరోజూ, ఈ రోజు అనే సమయం ఉండగానే ఒకరినొకరు ప్రోత్సహించుకోండి.
14ఎందుకంటే ప్రారంభం నుండి చివరి వరకూ ఆయనపై మనకున్న స్థిర విశ్వాసంపై ఆధారపడి ఉండటం వల్ల మనం క్రీస్తులో భాగస్వాములం అయ్యాం.
15దీని గూర్చి మొదటే ఇలా చెప్పారు. “ఈ రోజే మీరు ఆయన స్వరం వింటే, ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసినట్టు మీ హృదయాలను కఠినం చేసుకోవద్దు.”
16దేవుని మాట విని కూడా తిరుగుబాటు చేసిందెవరు? మోషే ఐగుప్తులో నుండి బయటకు నడిపించిన వారే కదా!
17దేవుడు నలభై ఏళ్ళు ఎవరి మీద కోపపడ్డాడు? పాపం చేసిన వారి మీదే కదా! వారి మృతదేహాలు అరణ్యంలో రాలి పోయాయి.
18తనకు అవిధేయులైన వారిని గూర్చి కాకుంటే తన విశ్రాంతిలో ప్రవేశించరని దేవుడు ఎవరిని ఉద్దేశించి ప్రమాణం చేశాడు?
19దీన్నిబట్టి, అవిశ్వాసం మూలానే వారు ఆయన విశ్రాంతిలో ప్రవేశించలేక పోయారని మనం చూశాము.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
The Indian Revised Version Holy Bible in Telugu.
Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.

Bible text licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0).Original Telugu Scripture and full source copyright terms. This verse-only display adapts the original presentation by removing book introductions, editorial headings, source HTML formatting, and inline explanatory footnote popups while preserving Scripture wording and combined original verse ranges. This presentation of the Bible text remains under CC BY-SA 4.0; the copyright holder does not necessarily endorse these changes. Divine Threads study content is independently authored and separate from the licensed Scripture text.