ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) తెలుగు — 2019

ఆదికాండం 41

ఈ అధ్యాయాన్ని తెలుగులో చదవవచ్చు. Divine Threads అధ్యయనాలు తరువాత జోడించబడతాయి.

1రెండు సంవత్సరాల తరువాత ఫరోకు ఒక కల వచ్చింది. అందులో అతడు నైలు నది దగ్గర నిలబడ్డాడు.
2పుష్టిగా ఉన్న అందమైన ఏడు ఆవులు నైలు నదిలో నుండి పైకి వచ్చి జమ్ముగడ్డిలో మేస్తున్నాయి.
3వాటి తరువాత వికారంగా, బక్కచిక్కిన ఏడు ఆవులు నైలు నదిలో నుండి పైకి వచ్చి ఆ ఆవుల దగ్గర నది ఒడ్డున నిలబడ్డాయి.
4అప్పుడు అందవిహీనమైనవీ చిక్కిపోయినవీ అయిన ఆవులు అందమైన బలిసిన ఆవులను తినేశాయి. దాంతో ఫరో నిద్రలేచాడు.
5అతడు నిద్రపోయి రెండవసారి కల కన్నాడు. అందులో మంచి పుష్టిగల ఏడు కంకులతో ఉన్న కాడ పైకి వచ్చింది.
6తూర్పుగాలి వల్ల పాడైపోయిన ఏడు తాలు కంకులు వాటి తరువాత మొలిచాయి.
7అప్పుడు నిండైన పుష్టిగల ఆ ఏడు కంకులను ఆ తాలుకంకులు మింగివేశాయి. అంతలో ఫరో మేలుకుని అది కల అని గ్రహించాడు.
8ఉదయాన్నే అతని మనస్సు కలవరపడింది కాబట్టి అతడు ఐగుప్తు శకునగాళ్ళందరినీ అక్కడి పండితులందరిని పిలిపించి తన కలలను వివరించి వారితో చెప్పాడు గాని ఫరోకు వాటి అర్థం చెప్పే వాడెవడూ లేడు.
9అప్పుడు గిన్నె అందించేవారి నాయకుడు “ఈ రోజు నా తప్పు గుర్తుకు వచ్చింది.
10ఫరో తన సేవకుల మీద కోపపడి నన్నూ రొట్టెలు చేసేవారి నాయకుడినీ రాజు అంగరక్షకుల అధిపతి ఇంట్లో కావలిలో ఉంచాడు.
11ఒకే రాత్రి నేనూ అతడు కలలు కన్నాము. ఒక్కొక్కడు వేర్వేరు అర్థాలతో కలలు కన్నాము.
12అక్కడ రాజ అంగ రక్షకుల అధిపతికి సేవకుడిగా ఉన్న ఒక హెబ్రీ యువకుడు మాతో కూడ ఉన్నాడు. అతనితో మా కలలను మేము వివరించి చెబితే అతడు వాటి అర్థాన్ని మాకు తెలియచేశాడు.
13అతడు మాకు ఏమి చెప్పాడో దాని ప్రకారమే జరిగింది. నా ఉద్యోగం నాకు మళ్ళీ ఇప్పించి వేరేవాడిని ఉరి తీయించారు” అని ఫరోతో చెప్పాడు.
14ఫరో యోసేపును పిలిపించాడు. చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించారు. అతడు క్షవరం చేసుకుని బట్టలు మార్చుకుని ఫరో దగ్గరికి వచ్చాడు.
15ఫరో యోసేపుతో “నేనొక కల కన్నాను. దాని అర్థం చెప్పేవారు ఎవరూ లేరు. నువ్వు కలను వింటే దాని అర్థాన్ని తెలియచేయగలవని నిన్నుగూర్చి విన్నాను” అన్నాడు.
16యోసేపు “అది నావలన కాదు, దేవుడే ఫరోకు అనుకూలమైన సమాధానం ఇస్తాడు” అని ఫరోతో చెప్పాడు.
17అందుకు ఫరో “నా కలలో నేను ఏటి ఒడ్డున నిలబడ్డాను.
18బలిసిన, అందమైన ఏడు ఆవులు ఏటిలోనుండి పైకివచ్చి జమ్ముగడ్డిలో మేస్తున్నాయి.
19నీరసంగా చాలా వికారంగా చిక్కిపోయిన మరి ఏడు ఆవులు వాటి తరువాత పైకి వచ్చాయి. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశంలో ఎక్కడా నాకు కనబడలేదు.
20చిక్కిపోయి వికారంగా ఉన్న ఆవులు బలిసిన మొదటి ఏడు ఆవులను తినేశాయి.
21అవి వాటి కడుపులో పడ్డాయి గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు, మొదట ఉన్నట్లే అవి చూడ్డానికి వికారంగా ఉన్నాయి. అంతలో నేను మేలుకున్నాను.
22నా కలలో నేను చూస్తే, పుష్టిగల ఏడు మంచి వెన్నులు ఒక్క కంకికి పుట్టాయి.
23తూర్పు గాలిచేత చెడిపోయి, ఎండిన ఏడు పీలవెన్నులు వాటి తరువాత మొలిచాయి.
24ఈ పీలవెన్నులు ఆ మంచి వెన్నులను మింగివేశాయి. ఈ కలను పండితులకు తెలియచేశాను గాని దాని అర్థాన్ని తెలియచేసే వారెవరూ లేరు” అని అతనితో చెప్పాడు.
25అందుకు యోసేపు “ఫరో కనిన కల ఒక్కటే. దేవుడు తాను చేయబోయేది ఫరోకు తెలియచేశాడు. ఆ ఏడు మంచి ఆవులు, ఏడేళ్ళు.
26ఆ ఏడు మంచికంకులు ఏడేళ్ళు.
27కల ఒక్కటే. వాటి తరువాత చిక్కిపోయి వికారంగా పైకి వచ్చిన ఏడు ఆవులూ ఏడేళ్ళు. తూర్పు గాలి చేత చెడిపోయిన ఏడు తాలువెన్నులు, ఏడేళ్ళ కరువు.
28నేను ఫరోతో చెప్పే మాట ఇదే. దేవుడు తాను చేయబోయేది ఫరోకు చూపించాడు.
29ఇదిగో ఐగుప్తు దేశమంతటా చాలా సమృద్ధిగా పంట పండే ఏడేళ్ళు రాబోతున్నాయి.
30వాటి తరువాత ఏడేళ్ళ కరువు వస్తుంది. అప్పుడు ఆ పంట సమృద్ధినంతా ఐగుప్తు దేశం మరచిపోతుంది. ఆ కరువు దేశాన్ని నాశనం చేస్తుంది.
31దాని తరువాత వచ్చే కరువుచేత దేశంలో ఆ పంట సమృద్ధి జ్ఞాపకంలో లేకుండా పోతుంది. ఆ కరువు చాలా భారంగా ఉంటుంది.
32ఈ పని దేవుడే నిర్ణయించాడు. దీన్ని దేవుడు చాలా త్వరగా జరిగిస్తాడు. అందుకే ఆ కల ఫరోకు రెండుసార్లు వచ్చింది.
33కాబట్టి ఫరో వివేకమూ జ్ఞానమూ ఉన్నమనిషిని వెతికి ఐగుప్తు దేశం మీద అతన్ని నియమించాలి.
34ఫరో అలా చేసి ఈ దేశం మీద పర్యవేక్షకులను నియమించి, సమృద్ధిగా పంట పండే ఏడేళ్ళలో ఐగుప్తు దేశమంతటా అయిదో భాగం తీసుకోవాలి.
35వారు రాబోయే ఈ మంచి సంవత్సరాల్లో దొరికే ఆహారమంతా సమకూర్చాలి. ఆ ధాన్యాన్ని ఫరో ఆధీనంలో ఉంచి, పట్టణాల్లో భద్రం చేయాలి.
36కరువు వలన ఈ దేశం నశించి పోకుండా ఆ ధాన్యం ఐగుప్తు దేశంలో రాబోయే ఏడేళ్ళ కరువు కాలంలో సిద్ధంగా ఉంటుంది” అని ఫరోతో చెప్పాడు.
37ఈ సలహా ఫరోకూ అతని పరివారమందరి దృష్టికీ నచ్చింది.
38ఫరో తన పరివారంతో “ఇతనిలాగా దేవుని ఆత్మ ఉన్నవాడు మనకు దొరుకుతాడా?” అన్నాడు.
39ఫరో, యోసేపుతో “దేవుడు ఇదంతా నీకు తెలియచేశాడు కాబట్టి నీలాగా వివేకమూ జ్ఞానమూ ఉన్న వారెవరూ లేరు.
40నువ్వు నా భవనంలో అధికారిగా ఉండాలి. నా ప్రజలంతా నీకు లోబడతారు. సింహాసనం విషయంలోనే నేను నీకంటే పైవాడిగా ఉంటాను” అన్నాడు.
41ఫరో “చూడు, ఐగుప్తు దేశమంతటి మీద నేను నిన్ను నియమించాను” అని యోసేపుతో చెప్పాడు.
42ఫరో తన చేతికి ఉన్న తన రాజముద్ర ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టాడు. శ్రేష్ఠమైన బట్టలు అతనికి తొడిగించి, అతని మెడలో బంగారు గొలుసు వేశాడు.
43తన రెండవ రథంలో అతన్ని ఎక్కించాడు. కొందరు అతని ముందు నడుస్తూ “నమస్కారం చేయండి” అని కేకలు వేశారు. ఐగుప్తు దేశమంతటి మీదా ఫరో అతన్ని నియమించాడు.
44ఫరో యోసేపుతో “నేను ఫరోని. నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశమంతటా ఎవరూ తన చేతిని కానీ కాలిని కానీ ఎత్తకూడదు” అన్నాడు.
45ఫరో, యోసేపుకు “జఫనత్ పనేహు” అని పేరు పెట్టాడు. అతనికి ఓను అనే పట్టణ యాజకుడైన పోతీఫెర కూతురు ఆసెనతుతో పెళ్ళిచేశాడు.
46యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుటికి వచ్చినప్పుడు ముప్ఫై ఏళ్లవాడు. యోసేపు ఫరో దగ్గరనుండి బయలుదేరి ఐగుప్తు దేశమంతటా తిరిగాడు.
47సమృద్ధిగల ఏడేళ్ళలో భూమి చాలా విరివిగా పండింది.
48ఐగుప్తు దేశంలోని ఏడేళ్ళ ధాన్యమంతా అతడు సమకూర్చి, పట్టణాల్లో దాన్ని నిల్వ చేశాడు. ఏ పట్టణం చుట్టూ ఉన్న పొలాల ధాన్యం ఆ పట్టణంలోనే నిల్వచేశాడు.
49యోసేపు సముద్రపు ఇసుకంత విస్తారంగా ధాన్యాన్ని నిలవ చేశాడు. అది కొలతకు మించిపోయింది కాబట్టి దాన్నిక కొలవడం మానుకున్నారు.
50కరువు కాలం ముందే యోసేపుకు ఇద్దరు కొడుకులు పుట్టారు. ఓను పట్టణ యాజకుడైన పోతీఫెర కూతురు ఆసెనతు వారికి తల్లి.
51అప్పుడు యోసేపు “దేవుడు నా కష్టాన్నంతా మా నాన్న ఇంట్లో వారందరినీ నేను మరచిపోయేలా చేశాడు” అని తన పెద్దకొడుక్కి “మనష్షే” అనే పేరు పెట్టాడు.
52“నేను బాధ అనుభవించిన దేశంలో దేవుడు నన్ను ఫలవంతం చేశాడు” అని రెండో కొడుక్కి “ఎఫ్రాయిము” అనే పేరు పెట్టాడు.
53ఐగుప్తు దేశంలో సమృద్ధిగా పంట పండిన ఏడేళ్ళు గడిచిపోయాయి.
54యోసేపు చెప్పిన ప్రకారం ఏడేళ్ళ కరువు మొదలయింది గాని ఐగుప్తు దేశమంతటా ఆహారముంది.
55ఐగుప్తు దేశమంతటా కరువు వచ్చినప్పుడు ఆ దేశప్రజలు ఆహారం కోసం ఫరోకు మొరపెట్టుకున్నారు. అప్పుడు ఫరో “మీరు యోసేపు దగ్గరికి వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయండి” అని ఐగుప్తీయులందరితో చెప్పాడు.
56ఆ ప్రదేశమంతా కరువు వ్యాపించింది. యోసేపు గిడ్డంగులన్నీ విప్పించి ఐగుప్తీయులకు ధాన్యం అమ్మాడు. ఐగుప్తు దేశంలో ఆ కరువు తీవ్రంగా ఉంది.
57ఆ కరువు లోకమంతా తీవ్రంగా ఉండడం వల్ల లోకమంతా యోసేపు దగ్గర ధాన్యం కొనడానికి ఐగుప్తుకు వచ్చింది.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
The Indian Revised Version Holy Bible in Telugu.
Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.

Bible text licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0).Original Telugu Scripture and full source copyright terms. This verse-only display adapts the original presentation by removing book introductions, editorial headings, source HTML formatting, and inline explanatory footnote popups while preserving Scripture wording and combined original verse ranges. This presentation of the Bible text remains under CC BY-SA 4.0; the copyright holder does not necessarily endorse these changes. Divine Threads study content is independently authored and separate from the licensed Scripture text.