ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) తెలుగు — 2019

ఆదికాండం 27

ఈ అధ్యాయాన్ని తెలుగులో చదవవచ్చు. Divine Threads అధ్యయనాలు తరువాత జోడించబడతాయి.

1ఇస్సాకు బాగా ముసలి వాడయ్యాడు. అతని కళ్ళు పూర్తిగా మసకబారాయి. ఆ పరిస్థితిలో అతడు తన పెద్ద కుమారుడు ఏశావుతో “నా కొడుకా” అని పిలిచాడు. అతడు “చిత్తం నాన్నగారూ” అన్నాడు.
2అప్పుడు ఇస్సాకు “చూడు, నేను ముసలివాణ్ణి. ఎప్పుడు చనిపోతానో తెలియదు.
3కాబట్టి నువ్వు నీ ఆయుధాలు అమ్ముల పొదినీ, విల్లునీ తీసుకుని అడవికి వెళ్ళి అక్కడ నాకోసం వేటాడి మాంసం తీసుకురా.
4దాన్ని నాకోసం రుచికరంగా వండి తీసుకురా. నాకిష్టమైన వంటకాలు సిద్ధం చేసి పట్టుకు వస్తే నేను చనిపోక ముందు వాటిని తిని నిన్ను ఆశీర్వదిస్తాను” అన్నాడు.
5ఇస్సాకు తన కొడుకు ఏశావుతో ఇలా చెప్తుంటే రిబ్కా వీరికి తెలియకుండా చాటు నుండి వింటూ ఉంది. ఏశావు వేటాడి మాంసం తీసుకు రావడానికి అడవికి వెళ్ళాడు.
6అప్పుడు రిబ్కా తన కొడుకు యాకోబుతో “జాగ్రత్తగా విను. మీ నాన్న నీ అన్నతో మాట్లాడటం నేను విన్నాను. ఆయన నీ అన్నతో
7‘నేను చనిపోక ముందు భోజనం చేసి యెహోవా సముఖంలో నిన్ను ఆశీర్వదిస్తాను. కాబట్టి నువ్వు వేటాడి మాంసం తెచ్చి నాకోసం రుచిగా వండి తీసుకురా’ అన్నాడు.
8కొడుకా, కాబట్టి ఇప్పుడు నా మాట విను. నేను నీకు చెప్పింది చెయ్యి.
9నువ్వు మంద దగ్గరికి వెళ్ళి రెండు మంచి మేక పిల్లలను పట్టుకుని రా. నేను వాటితో మీ నాన్నఇష్టపడే విధంగా రుచిగా భోజనం తయారు చేస్తాను.
10నీ నాన్న చనిపోకముందు వాటిని తిని నిన్ను ఆశీర్వదించేలా దాన్ని నువ్వు ఆయన దగ్గరికి తీసుకు వెళ్ళు” అంది.
11దానికి యాకోబు తన తల్లితో “నా అన్న ఏశావుకు ఒళ్ళంతా జుట్టు ఉంది. నేను నున్నగా ఉంటాను.
12ఒకవేళ మా నాన్న నన్ను తడిమి చూశాడనుకో. అప్పుడు నేను అతని దృష్టికి ఒక మోసగాడిలా ఉంటాను. అప్పుడిక నా మీదికి ఆశీర్వాదం స్థానంలో శాపం వస్తుంది” అన్నాడు.
13కానీ అతని తల్లి “కొడుకా, ఆ శాపం నాపైకి వస్తుంది గాక! నువ్వు మాత్రం నా మాట విను. వెళ్ళి నేను చెప్పినట్టు వాటిని నా దగ్గరికి తీసుకుని రా” అని చెప్పింది.
14కాబట్టి యాకోబు రెండు మేక పిల్లలను పట్టుకుని వాటిని తన తల్లి దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఆమె వాటితో అతని తండ్రి ఇష్టపడే విధంగా రుచికరంగా వండి భోజనం సిద్ధం చేసింది.
15రిబ్కా ఇంట్లో ఆమె పెద్ద కొడుకు ఏశావుకు చెందిన మంచి బట్టలు ఉన్నాయి.
16ఆమె వాటిని యాకోబుకు తొడిగింది. మేక పిల్లల చర్మాన్ని అతని మెడ పైని నున్నని భాగంలో కప్పింది.
17తాను వండి సిద్ధం చేసిన రుచికరమైన వంటకాలనూ రొట్టెనూ తన కొడుకైన యాకోబు చేతికిచ్చింది.
18అతడు తన తండ్రి దగ్గరికి వచ్చాడు. నాన్నగారూ, అని పిలిచాడు. ఇస్సాకు “కొడుకా ఏమిటి? నువ్వు ఎవరివి?” అని అడిగాడు.
19దానికి యాకోబు “నేను ఏశావుని. నీ పెద్ద కొడుకుని. నువ్వు నాకు చెప్పినట్టే చేశాను. లేచి నేను వేటాడి తెచ్చిన దాన్ని తిని నన్ను ఆశీర్వదించు” అన్నాడు.
20అప్పుడు ఇస్సాకు తన కొడుకుతో “నా కొడుకా అది ఇంత త్వరగా నీకు ఎలా దొరికింది?” అన్నాడు. దానికి యాకోబు “నీ దేవుడైన యెహోవా దాన్ని నా ఎదుటికి రప్పించాడు. అందుకే ఇంత త్వరగా దొరికింది” అన్నాడు.
21అప్పుడు ఇస్సాకు “నా కొడుకా, నువ్వు ఏశావువి అవునో కాదో తడిమి చూస్తా. దగ్గరికి రా” అన్నాడు.
22యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. అతడు యాకోబును తడిమి చూసి ఇలా అన్నాడు. “స్వరం యాకోబుది కానీ చేతులు ఏశావు చేతులే” అన్నాడు.
23యాకోబు చేతులు అతని అన్న అయిన ఏశావు చేతుల్లా జుట్టు కలిగి ఉండటంతో ఇస్సాకు యాకోబును గుర్తు పట్టలేకపోయాడు. కాబట్టి ఇస్సాకు అతణ్ణి ఆశీర్వదించాడు.
24“నువ్వు నిజంగా నా కొడుకు ఏశావువేనా?” అని అడిగాడు. యాకోబు “అవును నేనే” అన్నాడు.
25అప్పుడు ఇస్సాకు “ఆ ఆహారం తీసుకురా. నువ్వు వేటాడి తెచ్చిన దాన్ని నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను” అన్నాడు. యాకోబు ఆహారం తీసుకు వచ్చాడు. దాన్ని అతడు తిన్నాడు. ద్రాక్షారసం తీసుకు వస్తే తాగాడు.
26అప్పుడు అతని తండ్రి అయిన ఇస్సాకు “నా కొడుకా, దగ్గరికి వచ్చి నాకు ముద్దు పెట్టు” అన్నాడు.
27యాకోబు దగ్గరికి వచ్చి అతణ్ణి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఇస్సాకు అతని బట్టలు వాసన చూసి అతణ్ణి ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు. “చూడు, నా కొడుకు సువాసన, యెహోవా ఆశీర్వదించిన చేని సువాసనలాగా ఉంది.
28ఆకాశం నుండి కురిసే మంచులో ఒక భాగాన్నీ, భూమి సమృద్దిలో ఒక భాగాన్నీ, విస్తారమైన ధాన్యాన్నీ, ద్రాక్షారసాన్నీ, దేవుడైన యెహోవా నీకు అనుగ్రహిస్తాడు గాక!
29మనుషులు నీకు సేవలు చేస్తారు గాక! జాతులు నీ ముందు సాగిలపడతారు గాక! నీ బంధువులందరికీ నువ్వు రాజువి అవుతావు. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడతారు గాక! నిన్ను శపించేవారు శాపానికి గురి అవుతారు గాక! నిన్ను ఆశీర్వదించే వారికి ఆశీర్వాదం కలుగు గాక.”
30ఇలా ఇస్సాకు యాకోబును ఆశీర్వదించిన తరువాత యాకోబు తన తండ్రి ఇస్సాకు దగ్గర్నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే అతని అన్న వేట నుండి తిరిగి వచ్చాడు.
31అతడు కూడా రుచికరమైన ఆహారం సిద్ధం చేసి తన తండ్రి దగ్గరికి తెచ్చాడు. “నాన్నా, నీ కొడుకు వేటాడి తెచ్చిన దాన్ని తిని నన్ను ఆశీర్వదించు” అని తండ్రితో అన్నాడు.
32అతని తండ్రి అయిన ఇస్సాకు “నువ్వు ఎవరివి?” అని అడిగాడు. అతడు “నేను నీ కొడుకుని. ఏశావు అనే నీ పెద్ద కొడుకుని” అన్నాడు.
33దాంతో ఇస్సాకు గడగడ వణికిపోయాడు. “అలా అయితే వేటాడిన మాంసం నా దగ్గరికి పట్టుకు వచ్చినదెవరు? నువ్వు రాకముందు నేను వాటన్నిటినీ తిని అతణ్ణి ఆశీర్వదించాను. తప్పనిసరిగా అతడే దీవెన పొందినవాడు.”
34ఏశావు తన తండ్రి మాటలు విని ఎంతో వేదనతో పెద్ద కేక పెట్టాడు. ఏడ్చాడు. తన తండ్రితో “నాన్నా, నన్ను కూడా ఆశీర్వదించు” అన్నాడు.
35ఇస్సాకు “నీ తమ్ముడు మోసంతో వేషం వేసుకుని వచ్చి నీ ఆశీర్వాదాన్ని తీసుకువెళ్ళాడు” అన్నాడు.
36ఏశావు ఇలా అన్నాడు. “యాకోబు అనే పేరు వాడికి చక్కగా సరిపోయింది. వాడు నన్ను రెండు సార్లు మోసం చేశాడు. నా జ్యేష్ఠత్వపు జన్మహక్కు తీసుకున్నాడు. ఇప్పుడు నాకు రావలసిన ఆశీర్వాదం తీసుకు పోయాడు.” ఇలా చెప్పి ఏశావు తన తండ్రిని “నాకోసం ఇక ఏ ఆశీర్వాదమూ మిగల్చలేదా?” అని అడిగాడు.
37అందుకు ఇస్సాకు “చూడు, అతణ్ణి నీకు యజమానిగా నియమించాను. అతని బంధువులందరినీ అతనికి సేవకులుగా ఇచ్చాను. ధాన్యాన్నీ కొత్త ద్రాక్షారసాన్నీ అతనకి ఇచ్చాను? ఇవి కాక నీకు ఇంకా ఏ ఆశీర్వాదాలు మిగిలి ఉన్నాయి?” అన్నాడు.
38ఏశావు తన తండ్రితో “నాన్నా, నీ దగ్గర ఒక్క ఆశీర్వాదమూ లేదా? నాన్నా, నన్ను కూడా ఆశీర్వదించు” అంటూ గట్టిగా ఏడ్చాడు.
39అతని తండ్రి ఇస్సాకు అతనికిలా జవాబిచ్చాడు. “చూడు, నీ నివాసం భూసారానికి దూరంగా ఉంటుంది. పైనుండి ఆకాశపు మంచు దాని మీద కురవదు.
40నువ్వు నీ కత్తి మీద ఆధారపడి జీవిస్తావు. నీ తమ్ముడికి దాసుడివి అవుతావు. కానీ నువ్వు తిరగబడితే అతని కాడిని నీ మెడపైనుండి విరిచి వేస్తావు.”
41యకోబుకు తన తండ్రి ఇచ్చిన ఆశీర్వాదం విషయమై ఏశావు అతణ్ణి ద్వేషించాడు. ఏశావు ఇలా అనుకున్నాడు. “నా తండ్రి చనిపోయే రోజు ఎంతో దూరం లేదు. అది అయ్యాక నా తమ్ముడు యాకోబును చంపుతాను.”
42తన పెద్దకొడుకు ఏశావు పలికిన ఈ మాటలను గూర్చి రిబ్కా వింది. ఆమె తన చిన్నకొడుకు యాకోబును పిలిపించింది. అతనితో “చూడు, నీ అన్న ఏశావు నిన్ను చంపుతాను అనుకుంటూ తనను తాను ఓదార్చుకుంటున్నాడు.
43కాబట్టి కొడుకా, నా మాట విను. హారానులో ఉన్న నా సోదరుడు లాబాను దగ్గరికి పారిపో.
44నీ అన్న కోపం చల్లారే వరకూ కొద్ది రోజులు అక్కడే అతనితోనే ఉండు.
45నీ అన్న కోపం పూర్తిగా చల్లారిపోయి, నువ్వు అతనికి చేసిన దాన్ని అతడు మర్చిపోయే వరకూ అక్కడ ఉండు. అప్పుడు నేను అక్కడనుండి నిన్ను పిలిపిస్తాను. ఒక్క రోజులోనే నేను మీ ఇద్దరినీ పోగొట్టుకోవడం ఎందుకు?” అంది.
46రిబ్కా ఇస్సాకుతో “ఏశావు పెళ్ళాడిన హేతు జాతి స్త్రీల వల్ల నా ప్రాణం విసిగిపోయింది. ఈ దేశపు అమ్మాయిలైన హేతు కుమార్తెల్లో వీళ్ళలాంటి మరో అమ్మాయిని యాకోబు కూడా పెళ్ళి చేసుకుంటే ఇక నేను బతికి ఏం ప్రయోజనం?” అంది.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
The Indian Revised Version Holy Bible in Telugu.
Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.

Bible text licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0).Original Telugu Scripture and full source copyright terms. This verse-only display adapts the original presentation by removing book introductions, editorial headings, source HTML formatting, and inline explanatory footnote popups while preserving Scripture wording and combined original verse ranges. This presentation of the Bible text remains under CC BY-SA 4.0; the copyright holder does not necessarily endorse these changes. Divine Threads study content is independently authored and separate from the licensed Scripture text.