ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) తెలుగు — 2019

ఆదికాండం 21

ఈ అధ్యాయాన్ని తెలుగులో చదవవచ్చు. Divine Threads అధ్యయనాలు తరువాత జోడించబడతాయి.

1యెహోవా తాను చెప్పినట్టే శారా పై కనికరం చూపించాడు. తాను చేసిన వాగ్దానాన్ని శారా పట్ల దేవుడైన యెహోవా నెరవేర్చాడు.
2అబ్రాహాము వృద్ధాప్యంలో శారా గర్భం ధరించి అతనికి ఒక కొడుకును కన్నది. అబ్రాహాముతో దేవుడైన యెహోవా చెప్పిన సమయంలోనే ఇది జరిగింది.
3అబ్రాహాము తన భార్య శారా ద్వారా తనకు పుట్టిన తన కొడుక్కి ఇస్సాకు అనే పేరు పెట్టాడు.
4దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం తన కొడుకు ఇస్సాకుకు ఎనిమిదవ రోజున సున్నతి చేశాడు.
5ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రాహాము వయస్సు నూరేళ్ళు.
6అప్పుడు శారా “దేవుడు నాకు నవ్వు పుట్టించాడు. నా సంగతి తెలిసినవారంతా నాతో కలసి సంతోషిస్తారు” అన్నది.
7ఆమె ఇంకా “శారా తన పిల్లలకు పాలు ఇస్తుందని అబ్రాహాముతో ఎవరు చెప్పగలిగే వారు? అయినా ముసలివాడయ్యాక నేను అతనికి ఒక కొడుకుని కని ఇచ్చాను గదా” అన్నది.
8ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచిపెట్టాడు. ఇస్సాకు పాలు మానిన రోజున అబ్రాహాము గొప్ప విందు చేశాడు.
9అప్పుడు అబ్రాహాముకు ఐగుప్తు జాతిదైన హాగరు ద్వారా పుట్టిన కొడుకు ఇస్సాకును ఎగతాళి చేయడం శారా చూసింది.
10ఆమె అబ్రాహాముతో ఇలా అంది. “ఈ దాసీనీ ఈమె కొడుకునీ వెళ్ళగొట్టు. ఎందుకంటే ఈ దాసీ కొడుకు నా కొడుకు ఇస్సాకుతో కలసి వారసుడిగా ఉండటానికి వీలులేదు.”
11ఈ మాట విన్న అబ్రాహాము తన కొడుకు ఇష్మాయేలుని బట్టి చాలా వేదన చెందాడు.
12అయితే దేవుడు “ఈ అబ్బాయి కోసం, నీ దాసీ కోసం నువ్వు బాధ పడవద్దు. ఈ విషయంలో శారా నీకు చెప్పినట్టు చెయ్యి. ఎందుకంటే ఇస్సాకు వలన కలిగే సంతానమే నీకు వారసులౌతారు.
13అయినప్పటికీ ఈ దాసీ కొడుకు కూడా నీ సంతానం గనక నేను అతణ్ణి కూడా ఒక జాతిగా చేస్తాను” అని అబ్రాహాముతో చెప్పాడు. హాగరును పంపి వేయడం
14కనుక అబ్రాహాము తెల్లవారకముందే లేచి రొట్టె, నీళ్ళు పోసిన తోలు తిత్తి సిద్ధం చేసి వాటిని హాగరు భుజంపై పెట్టాడు. ఆ బాలుణ్ణి ఆమెకు అప్పగించి పంపివేశాడు. ఆమె వెళ్ళి బెయేర్షెబా అడవికి చేరి అక్కడ తిరుగుతూ ఉంది.
15ఆ తోలు తిత్తిలోని నీళ్ళు అయిపోయాక ఆమె బాలుణ్ణి ఒక పొద కింద విడిచిపెట్టింది.
16“ఈ పిల్లవాడి చావు చూడటం నా వల్ల కాదు” అనుకుని కొంత దూరం వెళ్లి వాడికి ఎదురుగా కూర్చుంది. అక్కడ ఎలుగెత్తి బిగ్గరగా ఏడ్చింది.
17దేవుడు ఆ బాలుడి మొర విన్నాడు. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచాడు. “హాగరూ, నీకు వచ్చిన కష్టం ఏమిటి? భయపడవద్దు. ఆ బాలుడు ఉన్నచోటనే దేవుడు అతని మొర విన్నాడు.
18నువ్వు లేచి ఆ బాలుణ్ణి పైకి లేపు. అతనికి ధైర్యం చెప్పు. ఎందుకంటే నేను అతణ్ణి ఒక గొప్ప జాతిగా వృద్ది చేయబోతున్నాను” అని ఆమెకు చెప్పాడు.
19అప్పుడు దేవుడు ఆమె కళ్ళు తెరుచుకోనేలా చేశాడు. ఆమె ఎదురుగా ఉన్న ఒక నీళ్ళ ఊటను చూసింది. ఆమె వెళ్ళి తోలు తిత్తిని నీళ్ళతో నింపి ఆ బాలుడికి తాగించింది.
20దేవుడు ఆ అబ్బాయికి తోడుగా ఉన్నాడు. అతడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఆ అడవిలోనే నివసించి విలువిద్యలో ప్రవీణుడయ్యాడు.
21అతడు పారాను అటవీ ప్రాంతంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక అమ్మాయిని తెచ్చి అతనికి పెళ్ళి చేసింది.
22ఆ రోజుల్లో అబీమెలెకూ, అతని సైన్యాధిపతి ఫీకోలూ కలసి వచ్చి అబ్రాహాముతో మాట్లాడారు. “నువ్వు చేసే పనులన్నిటిలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు.
23నువ్వు నన్ను, నా కొడుకుని, నా మనుమళ్ళను మోసం చేయనని దేవుని పేరిట నాకు వాగ్దానం చెయ్యి. నేను నీకు చూపిన అదే నిబంధన విశ్వసనీయతను నా పట్లా, నువ్వు పరదేశిగా ఉన్న ఈ దేశం పట్లా చూపించు” అన్నాడు.
24అందుకు అబ్రాహాము “నేను వాగ్దానం చేస్తాను” అన్నాడు.
25అబీమెలెకు దాసులు దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్న అబ్రాహాముకు చెందిన నీటి బావిని గూర్చి అబ్రాహాము తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. దానికి అబీమెలెకు “ఈ పని ఎవరు చేశారో నాకు తెలియదు.
26నువ్వు కూడా దీని విషయం నాకేమీ చెప్పలేదు. నాకీ సంగతి ఈ రోజే తెలిసింది” అన్నాడు.
27అబ్రాహాము గొర్రెలనూ ఎడ్లనూ తెప్పించి అబీమెలెకుకు ఇచ్చాడు. వాళ్ళిద్దరూ ఈ విధంగా ఒక నిబంధన చేసుకున్నారు.
28తరువాత అబ్రాహాము తన గొర్రెల మందలో నుంచి ఏడు ఆడ గొర్రెలను తీసి వేరుగా ఉంచాడు.
29అది చూసి అబీమెలెకు అబ్రాహాముతో “నువ్వు ఏడు ఆడ గొర్రెలను వేరుగా తీసి ఉంచావు. దాని అంతరార్ధం ఏమిటి?” అని అడిగాడు.
30దానికి అబ్రాహాము “ఈ బావిని నేనే తవ్వించాననడానికి సాక్ష్యంగా ఈ ఏడు ఆడ గొర్రెలను నువ్వు తీసుకోవాలి” అన్నాడు.
31అలా వాళ్ళిద్దరూ అక్కడ ఒక నిబంధన చేసుకున్నారు కాబట్టి ఆ స్థలానికి “బెయేర్షెబా” అనే పేరు వచ్చింది.
32బెయేర్షెబాలో వాళ్ళు అలా ఒక నిబంధన చేసుకున్న తరువాత అబీమెలెకు లేచి తన సైన్యాధిపతి ఫీకోలుతో కలసి ఫిలిష్తీయుల దేశానికి తిరిగి వెళ్ళాడు.
33అబ్రాహాము బెయేర్షెబాలో ఒక తమరిస్క చెట్టు నాటాడు. అక్కడ శాశ్వత దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాడు.
34అబ్రాహాము ఫిలిష్తీయుల దేశంలో చాలా రోజులు పరదేశిగా ఉన్నాడు.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
The Indian Revised Version Holy Bible in Telugu.
Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.

Bible text licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0).Original Telugu Scripture and full source copyright terms. This verse-only display adapts the original presentation by removing book introductions, editorial headings, source HTML formatting, and inline explanatory footnote popups while preserving Scripture wording and combined original verse ranges. This presentation of the Bible text remains under CC BY-SA 4.0; the copyright holder does not necessarily endorse these changes. Divine Threads study content is independently authored and separate from the licensed Scripture text.