ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) తెలుగు — 2019

గలతీయులకు రాసిన పత్రిక 2

ఈ అధ్యాయాన్ని తెలుగులో చదవవచ్చు. Divine Threads అధ్యయనాలు తరువాత జోడించబడతాయి.

1పద్నాలుగు సంవత్సరాలైన తరువాత నేను తీతును వెంటబెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేము తిరిగి వెళ్ళాను.
2మేము వెళ్ళాలని దేవుడు దర్శనంలో నాకు చెబితేనే వెళ్ళాను. నా ప్రయాస వ్యర్థమైపోతుందేమో, లేక వ్యర్థమైపోయిందేమో అని నేను యూదేతరులకు ప్రకటిస్తున్న సువార్త గురించి విశ్వాసుల్లో ముఖ్యమైన నాయకులకు ఏకాంతంగా వివరించాను.
3అయినా నాతో ఉన్న తీతు గ్రీసు దేశస్థుడైనప్పటికీ సున్నతి పొందాలని ఎవరూ అతణ్ణి బలవంతం చేయలేదు.
4క్రీస్తు యేసులో మనకు కలిగిన స్వాతంత్రాన్ని కనిపెట్టడానికీ, మనలను ధర్మశాస్త్రానికి బానిసలుగా చేసుకోడానికీ క్రీస్తు యేసు వల్ల మనకు కలిగిన స్వేచ్ఛను గూఢచారుల్లాగా కనిపెట్టడానికి రహస్యంగా కపట సోదరులు ప్రవేశించారు.
5సువార్త సత్యం మార్పులేనిదిగా, మీకు ప్రయోజనంగా నిలిచి ఉండేలా కాసేపైనా వారితో మేము ఏకీభవించలేదు.
6ఇతరులు నాయకులుగా ఎంచిన వారు నేను చెప్పిన సందేశానికి ఏ మార్పులు చేర్పులు చేయలేదు. ఆ నాయకులు గొప్పవారే కానీ వారు నాకంత ప్రధానం కాదు. దేవుడు మనిషి పైరూపం చూడడు.
7అయితే సున్నతి పొందిన వారికి బోధించడానికి దేవుడు సువార్తను పేతురుకు ఎలా అప్పగించాడో అలాగే సున్నతి పొందని వారికి బోధించడానికి నాకు అప్పగించాడని వారు గ్రహించారు.
8అంటే సున్నతి పొందిన వారికి అపొస్తలుడుగా ఉండడానికి పేతురుకు సామర్థ్యం కలగజేసిన వాడే యూదేతరులకు అపొస్తలుడుగా ఉండడానికి నాకు కూడా సామర్థ్యం కలగజేశాడు.
9నాయకులుగా పేరొందిన యాకోబు, కేఫా, యోహాను, అనే వారు దేవుడు నాకు అనుగ్రహించిన కృపను గుర్తించి, మేము యూదేతరులకూ, తాము సున్నతి పొందిన వారికీ అపొస్తలులుగా ఉండాలని చెప్పి, సహవాసానికి గుర్తుగా నాతోనూ, బర్నబాతోనూ తమ కుడి చేతులు కలిపారు.
10మేము యెరూషలేములో ఉన్న సాటి విశ్వాసుల్లోని పేదవారి అవసరాలను ఇంకా పట్టించుకొంటూ ఉండాలని మాత్రమే వారు కోరారు. అలా చేయడానికి నేను కూడా ఆసక్తిగా ఉన్నాను.
11అయితే కేఫా, అంతియొకయకు వచ్చినప్పుడు అతడు తప్పు చేశాడు. కాబట్టి నేను ముఖాముఖిగా అతన్ని నిలదీశాను.
12ఎందుకంటే, యాకోబు దగ్గర నుంచి కొంతమంది రాక ముందు అతడు యూదేతరులతో భోజనం చేస్తున్నాడు. వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనక్కి తగ్గి, పక్కకి వెళ్ళిపోయాడు.
13మిగతా యూదులు కూడా కేఫాతో ఈ కపటంలో కలిసిపోయారు. బర్నబా కూడా వారి కపట వేషధారణ వల్ల మోసపోయాడు.
14వారు సువార్త సత్యాన్ని అనుసరించడం లేదని నేను చూసి అందరి ముందు కేఫాతో, “నీవు యూదుడవై ఉండి కూడా యూదుల్లాగా కాక యూదేతరుడిలా ప్రవర్తిస్తుంటే, యూదేతరులు యూదుల్లాగా ప్రవర్తించాలని ఎందుకు బలవంతం చేస్తున్నావు?” అన్నాను.
15మనం పుట్టుకతో యూదులం గానీ, “యూదేతర పాపులం” కాదు.
16మనిషి యేసు క్రీస్తులో విశ్వాసం ఉంచడం ద్వారానే దేవుడు నీతిమంతుడుగా తీరుస్తాడు గాని, ధర్మశాస్త్ర క్రియల వలన కాదు. ఆ సంగతి ఎరిగిన మనం కూడా ధర్మశాస్త్ర క్రియల వలన గాక క్రీస్తు పట్ల విశ్వాసం ద్వారానే దేవుని చేత నీతిమంతులుగా తీర్పు పొందడానికి యేసు క్రీస్తులో విశ్వాసముంచాము. ధర్మశాస్త్ర క్రియల వలన ఎవరూ నీతిమంతుడని తీర్పు పొందడు గదా.
17అయితే, దేవుడు మనలను క్రీస్తులో నీతిమంతులుగా తీర్చాలని కోరుకొంటూ, మనకు మనం పాపులుగా కనబడితే, క్రీస్తు పాపానికి సేవకుడయ్యాడా? కచ్చితంగా కాదు.
18నేను పడగొట్టిన వాటిని మళ్ళీ కడితే నన్ను నేనే అపరాధిగా చేసుకుంటాను గదా.
19నేనైతే దేవుని కోసం బతకడానికి ధర్మశాస్త్రం ద్వారా ధర్మశాస్త్రానికి చనిపోయాను. లోపల నివసిస్తున్న క్రీస్తును బయటకు కనుపరచేదే క్రైస్తవ జీవితం
20నేను క్రీస్తుతోబాటు సిలువ మరణం పొందాను. ఇక మీదట జీవించేది నేను కాదు. క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేనిప్పుడు శరీరంలో జీవిస్తున్న జీవితం నన్ను ప్రేమించి, నా కోసం తనను తాను సమర్పించుకున్న దేవుని కుమారుడి మీద విశ్వాసం వల్లనే.
21నేను దేవుని కృపను నిరర్థకం చేయను. నీతి ధర్మశాస్త్రం ద్వారా సాధ్యం అయితే క్రీస్తు అనవసరంగా చనిపోయినట్టే గదా.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
The Indian Revised Version Holy Bible in Telugu.
Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.

Bible text licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0).Original Telugu Scripture and full source copyright terms. This verse-only display adapts the original presentation by removing book introductions, editorial headings, source HTML formatting, and inline explanatory footnote popups while preserving Scripture wording and combined original verse ranges. This presentation of the Bible text remains under CC BY-SA 4.0; the copyright holder does not necessarily endorse these changes. Divine Threads study content is independently authored and separate from the licensed Scripture text.