ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) తెలుగు — 2019

యెహెజ్కేలు 29

ఈ అధ్యాయాన్ని తెలుగులో చదవవచ్చు. Divine Threads అధ్యయనాలు తరువాత జోడించబడతాయి.

1బబులోను చెరలో ఉన్న కాలంలో, పదో సంవత్సరం పదో నెల పన్నెండో రోజు యెహోవా నాకీ విషయం తెలియచేశాడు.
2“నరపుత్రుడా, నీ ముఖాన్ని ఐగుప్తురాజు ఫరో వైపు తిప్పి అతని గురించి, ఐగుప్తు దేశమంతటిని గురించి ప్రవచించు. యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే
3ఐగుప్తు రాజు ఫరో, నైలునదిలో పడుకున్న పెద్దమొసలీ, నేను నీకు విరోధిని. నైలునది నాది, నేనే దాన్ని కలగచేశాను, అని నువ్వు చెప్పుకుంటున్నావు.
4నేను నీ దవడకు గాలాలు తగిలిస్తాను. నీ నైలు నదిలోని చేపలను నీ పొలుసులకు అంటుకునేలా చేస్తాను. నీ నది మధ్యలో నుంచి నిన్నూ నీ పొలుసులకు అంటిన చేపలన్నిటినీ బయటికి లాగేస్తాను.
5నిన్నూ నైలు నది చేపలన్నిటినీ ఎడారిలో పారబోస్తాను. నువ్వు నేల మీద పడతావు. నిన్నెవరూ ఎత్తలేరు, లేపరు. నిన్ను అడవి జంతువులకు ఆకాశపక్షులకు ఆహారంగా ఇస్తాను!
6అప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులంతా తెలుసుకుంటారు. ఐగుప్తు, ఇశ్రాయేలీయులకు రెల్లుపుల్లలాగా ఉంది.
7వాళ్ళు నిన్ను చేత పట్టుకున్నప్పుడు నువ్వు విరిగిపోయి వారి పక్కలో గుచ్చుకున్నావు. వాళ్ళు నీ మీద ఆనుకుంటే నువ్వు వాళ్ళ కాళ్ళు విరగ్గొట్టి వారి నడుములు బెణికేలా చేశావు.”
8కాబట్టి యెహోవా ప్రభువు ఈ మాట చెబుతున్నాడు. నేను నీ మీదికి కత్తి దూస్తాను. నీ మనుషులనూ పశువులనూ చంపుతాను.
9ఐగుప్తుదేశం పాడైపోయి నిర్మానుష్యమై పోతుంది. అప్పుడు నేను యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు. ఎందుకంటే “నైలు నది నాది, నేనే దాన్ని కలగచేశాను” అని భయంకర సముద్ర జంతువు అనుకుంటున్నాడు.
10కాబట్టి నేను నీకూ నీ నదికీ విరోధిని. ఐగుప్తు దేశాన్ని మిగ్దోలు నుంచి సెవేనే వరకూ కూషు సరిహద్దు వరకూ పూర్తిగా పాడు చేసి ఎడారిగా చేస్తాను.
11దాని మీదుగా ఏ కాలూ కదలదు. ఏ జంతువూ అటుగుండా వెళ్ళదు. నలభై ఏళ్ళు దానిలో ఎవరూ ఉండరు.
12నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాల మధ్య ఐగుప్తుదేశాన్ని పాడైన దానిగా చేస్తాను. పాడైపోయిన పట్టణాల్లో దాని పట్టణాలు నలభై ఏళ్ళు పాడై ఉంటాయి. ఐగుప్తీయులను ఇతర ప్రజల మధ్యకు చెదరగొడతాను. ఇతర దేశాలకు వారిని వెళ్ళగొడతాను.
13యెహోవా ప్రభువు ఈ మాట చెబుతున్నాడు. నలభై ఏళ్ళు గడిచిన తరువాత నానాప్రజల్లో చెదరిపోయిన ఐగుప్తీయులను నేను సమకూరుస్తాను.
14ఐగుప్తు కోల్పోయిన దాన్ని మళ్ళీ ఇచ్చి, పత్రోసు అనే తమ సొంత ప్రాంతానికి చేరుస్తాను. అక్కడ వాళ్ళు అల్పమైన రాజ్యంగా ఉంటారు.
15రాజ్యాల్లో అది అల్పమైన రాజ్యంగా ఉంటుంది. ఇక ఇతర రాజ్యాల మీద అతిశయపడదు. వాళ్ళిక ఇతర రాజ్యాలపై పెత్తనం చేయకుండా నేను వారిని తగ్గిస్తాను.
16ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషాన్ని మనసుకు తెచ్చుకుని ఐగుప్తు వైపు తిరిగితే అప్పటినుంచి వారికి నమ్మకం కుదరదు. అప్పుడు నేను యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు.
17బబులోను చెరలో ఉన్న కాలంలో, ఇరవై ఏడవ సంవత్సరం మొదటి నెల మొదటి రోజు యెహోవా నాకీ విషయం మళ్ళీ తెలియచేశాడు.
18నరపుత్రుడా, తూరు మీద బబులోనురాజు నెబుకద్నెజరు తన సైన్యంతో చాలా కష్టమైన పని చేయించాడు. వారందరి జుట్టు ఊడిపోయింది. వారి భుజాలు కొట్టుకుపోయాయి. అయినా తూరుకు విరోధంగా అతడు పడిన కష్టానికి అతనికి గానీ అతని సైన్యానికి గానీ కూలి కూడా రాలేదు.
19కాబట్టి యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, ఐగుప్తు దేశాన్ని బబులోను రాజు నెబుకద్నెజరుకు నేను అప్పగిస్తున్నాను. అతడు దాని ఆస్తిని పట్టుకుని దాని సొమ్మును దోచుకుంటాడు. అది అతని సైన్యానికి జీతమవుతుంది.
20తూరు పట్టణం మీద అతడు చేసింది నా కోసమే కాబట్టి అందుకు బహుమానంగా దాన్ని అప్పగిస్తున్నాను. ఇదే యెహోవా ప్రభువు సందేశం.
21ఆ రోజు నేను ఇశ్రాయేలీయుల కొమ్ము పైకి వచ్చేలా చేస్తాను. వారితో మాట్లాడడానికి అవకాశం ఇస్తాను. అప్పుడు నేను యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
The Indian Revised Version Holy Bible in Telugu.
Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.

Bible text licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0).Original Telugu Scripture and full source copyright terms. This verse-only display adapts the original presentation by removing book introductions, editorial headings, source HTML formatting, and inline explanatory footnote popups while preserving Scripture wording and combined original verse ranges. This presentation of the Bible text remains under CC BY-SA 4.0; the copyright holder does not necessarily endorse these changes. Divine Threads study content is independently authored and separate from the licensed Scripture text.