ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) తెలుగు — 2019

యెహెజ్కేలు 16

ఈ అధ్యాయాన్ని తెలుగులో చదవవచ్చు. Divine Threads అధ్యయనాలు తరువాత జోడించబడతాయి.

1అప్పుడు యెహోవా నాకు తన వాక్కు ఇచ్చి,
2“నరపుత్రుడా, యెరూషలేము చేసిన అసహ్యమైన పనులు దానికి తెలియజేసి, నువ్వు ఇలా ప్రకటించు,
3ప్రభువైన యెహోవా యెరూషలేము గురించి ఇలా అంటున్నాడు, నీ ఆరంభం, నీ పుట్టుక కనాను ప్రదేశంలో జరిగింది. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు.
4నువ్వు పుట్టిన రోజు నీ తల్లి నీ బొడ్డు కొయ్యలేదు. శుభ్రం చెయ్యడానికి నిన్ను నీళ్ళతో కడగలేదు, నిన్ను ఉప్పుతో తుడవలేదు, నిన్ను బట్టల్లో చుట్టలేదు.
5ఈ పనుల్లో ఒక్కటైనా నీ పట్ల చెయ్యాలని ఎవరికీ కనికరం కలగలేదు. నీ పట్ల జాలి పడినవాడు ఒక్కడూ లేడు. నువ్వు పుట్టిన రోజే నీ మీద ద్వేషంతో నిన్ను ఆరుబయట పొలంలో విసిరేశారు.
6కాని నేను నీ దగ్గరికి వచ్చి, నీ రక్తంలోనే పొర్లుతున్న నిన్ను చూసి, నీ రక్తంలో పొర్లుతున్న నీతో, ‘బ్రతుకు’ అని చెప్పాను.
7పొలంలో నాటిన ఒక మొక్క ఎదిగినట్టు నువ్వు ఎదిగేలా చేశాను. నువ్వు వృద్ధి పొంది గొప్పదానివై రత్నాలు పొదిగిన ఆభరణం అయ్యావు. నువ్వు నగ్నంగా వస్త్రహీనంగా ఉన్నా, నీ రొమ్ములు బిగువుగా, నీ తలవెంట్రుకలు ఒత్తుగా పెరిగాయి.
8మళ్ళీ నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను చూశాను. చూడు! ప్రేమ కలిగించే ప్రాయం నీకు వచ్చింది గనక నా వస్త్రంతో నీ నగ్నత్వాన్ని కప్పాను. ఆ తరవాత నేను నీతో ఒప్పందం చేశాను.” ఇది ప్రభువైన యెహోవా చేసిన ప్రకటన. “అప్పుడు నువ్వు నా దానివయ్యావు.
9కాబట్టి నేను నీళ్ళతో నిన్ను కడిగి నీ మీద ఉన్న రక్తమంతా తుడిచి, నిన్ను నూనెతో అభిషేకం చేసి,
10బుటాదారీ పని చేసిన వస్త్రం నీకు ధరింపజేసి, నీ పాదాలకు తోలు చెప్పులు తొడిగాను. సన్నని నారబట్టతో నిన్ను చుట్టి, పట్టు వస్త్రంతో నిన్ను కప్పాను.
11తరువాత ఆభరణాలతో నిన్ను అలంకరించి నీ చేతులకు కడియాలు తొడిగి నీ మెడలో గొలుసు వేసి,
12నీ చెవులకూ, ముక్కుకూ పోగులు పెట్టి, నీ తల మీద కిరీటం పెట్టాను.
13ఈ విధంగా బంగారంతో, వెండితో నేను నిన్ను అలంకరించి, సన్న నార, పట్టు, బుటాదారీ పని ఉన్న బట్టలు నీకు ధరింపజేశాను. నువ్వు మెత్తని గోదుమ పిండి, తేనె, నూనె ఆహారంగా తిని, అత్యంత సౌందర్యరాశివైన రాణివయ్యావు.
14నేను నీకిచ్చిన ఘనతతో నీ అందం పరిపూర్ణం అయింది. దేశదేశాల్లో నీ కీర్తి ప్రచురం అయ్యింది.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
15“కాని నువ్వు నీ అందాన్ని ఆధారం చేసుకుని, నీకు కీర్తి వచ్చినందుకు, ఒక వేశ్యలా దారిలో వెళ్ళే ప్రతివాడితో పొకిరీ పనులు జరిగిస్తూ వచ్చావు. నువ్వు ఆ మగాళ్ళ సొత్తుగా అయ్యావు.
16అప్పుడు నువ్వు నీ వస్త్రాలతో రంగురంగులతో అలంకరించిన దేవాలయాలు నీ కోసం చేసుకుని, వాటి దగ్గర ఒక వేశ్యలా ప్రవర్తించావు. ఇలా జరగాల్సింది కాదు. ఇది జరగక పొతే బాగుండేది.
17నేను నీకిచ్చిన బంగారం, వెండి ఆభరణాలతో నువ్వు పురుష రూపంలో విగ్రహాలు చేసుకుని వాటితో ఒక పతిత చేసినట్టు చేశావు.
18ఇంకా నీ బుటాదారీ పని చేసిన వస్త్రాలు తీసి వాటికి కప్పి, నా తైలాలు, నా పరిమళ తైలాలు వాటి కోసం అర్పించావు.
19నీ పోషణ కోసం నేను నీకిచ్చిన మెత్తని గోదుమ పిండితో చేసిన నా రొట్టెలు, నూనె, తేనె తీసుకుని, సువాసన కలిగేలా నువ్వు వాటి కోసం అర్పణ చేశావు. నిజంగా జరిగింది ఇదే.” ఇది ప్రభువైన యెహోవా వాక్కు.
20“తరువాత ఆ ప్రతిమలు ఆత్రంగా మింగేయడానికి నువ్వు నాకు కన్న కొడుకులను, కూతుళ్ళను వాటికి బలి అర్పించావు.
21నువ్వు నా పిల్లలను చంపి ఆ ప్రతిమలకు దహనబలిగా అర్పించావు.
22నీ బాల్యంలో నువ్వు నగ్నంగా, వస్త్రహీనంగా ఉండి నీ రక్తంలో నువ్వు పొర్లుతూ ఉన్న సంగతి మర్చిపోయి ఈ అసహ్యమైన వ్యభిచార క్రియలు చేస్తూ వచ్చావు.
23బాధ! నీకు బాధ” ఇది ప్రభువైన యెహోవా వాక్కు. “కాబట్టి, ఈ దుర్మార్గమంతటికీ తోడుగా,
24నువ్వు నీ కోసం ఒక బలిపీఠం, ప్రతి బహిరంగ ప్రాంగణంలో ఒక గుడి కట్టించావు.
25ప్రతి వీధి మొదట్లో గుళ్ళు కట్టి, నీ అందాన్ని అసభ్య క్రియల కోసం వాడి, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ నీ కాళ్ళు తెరిచి వాళ్ళతో ఎన్నో వ్యభిచార క్రియలు చేశావు.
26నువ్వు కామ వాంఛలతో నిండి ఉన్న నీ పొరుగువారైన ఐగుప్తీయులతో వేశ్యలా ప్రవర్తించి, వ్యభిచార క్రియలు ఎన్నో చేసి నాకు కోపం పుట్టించావు.
27కాబట్టి చూడు! నేను నీకు విరోధినై నీకు తిండి లేకుండా చేస్తాను. నీ వ్యభిచార క్రియలనుబట్టి నిన్ను సిగ్గు పరచడానికి, నీ శత్రువులైన ఫిలిష్తీయుల కూతుళ్ళ చేతికి నీ ప్రాణం అప్పగిస్తాను.
28నీకు తృప్తి లేక, అష్షూరువాళ్ళతో కూడా నువ్వు ఒక వేశ్యలా ప్రవర్తించావు. వేశ్యలా ప్రవర్తించినా, నీకు తృప్తి కలగలేదు.
29కనాను దేశం మొదలుకుని కల్దీయ దేశం వరకూ ఎంతో వ్యభిచారం చేసినా, నువ్వు తృప్తి పొందలేదు.
30నీ హృదయం ఎందుకింత బలహీనంగా ఉంది?” ఇది ప్రభువైన యెహోవా వాక్కు “సిగ్గుమాలిన వేశ్యాక్రియలైన వీటనన్నిటినీ జరిగించడానికి
31నువ్వు ప్రతి వీధి మొదట్లో బలిపీఠాలు, ప్రతి బహిరంగ ప్రదేశంలో గుళ్ళు కట్టి, నిజానికి నువ్వు ఒక వేశ్య చేసినట్టు చెయ్యలేదు. ఎందుకంటే నువ్వు చేసిన వేశ్యక్రియలకు డబ్బు తీసుకోలేదు!
32కులటా! నువ్వు నీ భర్తకు బదులుగా పరాయివాళ్ళను అంగీకరించావు!
33మనుషులు వేశ్యలకు డబ్బు చెల్లిస్తారు, కాని నీ ప్రేమికులందరూ నలుదిక్కుల నుంచి వచ్చి నీతో వ్యభిచరించడానికి రమ్మని వాళ్ళందరికీ నువ్వే నీ డబ్బు బాడుగగా ఇస్తూ వచ్చావు.
34నీకు, ఇతర స్త్రీలకు తేడా ఉంది. ఎందుకంటే, తమతో వ్యభిచారం చెయ్యమని ఎవరూ నిన్ను అడగరు. నువ్వే వాళ్లకు ఎదురు డబ్బు చెల్లిస్తావు! నీకెవరూ డబ్బు ఇవ్వరు.”
35కాబట్టి కులటా, యెహోవా మాట ఆలకించు!
36ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే “నువ్వు నీ వ్యభిచార క్రియల ద్వారా నీ ప్రేమికులతోనూ, అసహ్యమైన నీ ప్రతిమలన్నిటితోనూ నీ కామం ఒలకబోసి నీ అంగప్రదర్శన చేశావు గనుక, ఆ విగ్రహాలకు నువ్వు నీ పిల్లలను బలి ఇచ్చి వాళ్ళ రక్తం చిందించావు గనుక,
37ఇదిగో! నువ్వు ఎవరితో పడుకున్నావో ఆ నీ ప్రేమికులందర్నీ, విటులందర్నీ, నువ్వు ద్వేషించే వాళ్ళందర్నీ నేను పోగుచేస్తున్నాను. వాళ్ళను నీ చుట్టూ పోగు చేసి, వాళ్లకు నీ మానం కనబడేలా నేను నీ దిగంబరత్వాన్ని బట్ట బయలు చేస్తాను!
38నువ్వు చేసిన వ్యభిచారాన్ని బట్టి, నువ్వు చిందించిన రక్తాన్ని బట్టి నా కోపంతో నా రోషంతో కూడిన రక్తపాతం నీ మీదకు తెప్పిస్తాను.
39వాళ్ళ చేతికి నిన్ను అప్పగిస్తాను. నువ్వు కట్టిన గుళ్లను వాళ్ళు కూలదోసి, నువ్వు నిలబెట్టిన బలిపీఠాలను పగల గొట్టి, నీ బట్టలు ఊడదీసి, నీ నగలు లాగేసుకుని నిన్ను నగ్నంగా, బోడిగా చేస్తారు.
40వాళ్ళు నీ మీదకి సమూహాలను రప్పించి నిన్ను రాళ్లతో కొట్టి చంపుతారు. కత్తులతో నిన్ను పొడిచి ముక్కలు చేస్తారు.
41వాళ్ళు నీ ఇళ్ళను తగలబెడతారు. ఎంతోమంది స్త్రీలు చూస్తూ ఉండగా నీకు ఎన్నో శిక్షలు వేస్తారు. ఈ విధంగా నేను నీ వ్యభిచారం మాన్పిస్తాను. ఇంక నువ్వు వాటి కోసం ఎవరికీ డబ్బు చెల్లించవు!
42అప్పుడు నాకు నీ మీద ఉన్న ఉగ్రత చల్లార్చుకుంటాను. నీ పట్ల నాకున్న కోపం పోతుంది, అప్పుడు నేను తృప్తి చెంది, ఇకపై నీ మీద కోపం తెచ్చుకోను.
43నువ్వు నీ యవ్వన ప్రాయం గుర్తు చేసుకోకుండా వీటన్నిటి మూలంగా నాకు పట్టరాని కోపం తెప్పించావు గనక, చూడు! నువ్వు చేసిన అసహ్యమైన పనులన్నిటిని బట్టి నీ తల మీదకి నేనే శిక్ష రప్పిస్తాను” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. “కాబట్టి ఇంక నువ్వు నీ అసహ్యమైన దుర్మార్గపు ప్రవర్తన మానుకుంటావు.
44చూడు! సామెతలు చెప్పేవాళ్ళందరూ, ‘తల్లి ఎలాంటిదో కూతురూ అలాంటిదే’ అని నిన్ను గూర్చి అంటారు.
45భర్తనూ, బిడ్డలనూ విడిచిపెట్టిన నీ తల్లీ, నువ్వూ ఒకే రకం. భర్తనూ, బిడ్డలనూ విడిచిపెట్టిన నీ అక్కచెల్లెళ్ళు, నువ్వూ ఒకే రకం. నీ తల్లి హిత్తీయురాలు. నీ తండ్రి అమోరీయుడు.
46నీ ఎడమవైపు నివసించే షోమ్రోనూ, దాని కుమార్తెలూ నీకు అక్కలు, నీ కుడివైపు నివసించే సొదొమ, దాని కుమార్తెలూ నీకు చెల్లెళ్ళు.
47అయితే అవేవో చిన్న విషయాలన్నట్టు, వాళ్ళ అసహ్యమైన ప్రవర్తన ప్రకారం గాని, వాళ్ళ దుర్మార్గంలో గాని నువ్వు ఉండొద్దు. నిజానికి వాళ్ళందరికన్నా నీ ప్రవర్తన ఎంతో ఘోరం.
48నువ్వూ, నీ కూతుళ్ళూ చేసినట్టు నీ చెల్లెలు సొదొమ గాని, దాని కూతుళ్ళు గాని చెయ్యలేదని నా జీవం తోడు, ప్రమాణం చేస్తున్నాను” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
49“చూడు! నీ చెల్లెలు సొదొమ పాపం ఏమంటే, అది తనకు కలిగిన కులాసాను బట్టి అహంకారం చూపింది. దేని గురించీ దానికి దిగులు లేదు, దేన్నీ లక్ష్య పెట్టదు. పేదల చేతులు దాని వైపుకు, దాని కూతుళ్ళ వైపుకు చాచి ఉన్నాయి గానీ అది ఎవరికీ సాయం చెయ్యలేదు.
50వాళ్ళు అహంకారంతో నా దృష్టిలో అసహ్యమైన క్రియలు చేశారు గనుక నేను దాన్ని చూసి వాళ్ళను వెళ్ళగొట్టాను.
51షోమ్రోను కూడా నీ పాపాల్లో సగమైనా చెయ్యలేదు. వాళ్ళకన్నా నువ్వు అత్యధికంగా అసహ్యకార్యాలు చేశావు. నువ్వు ఇన్ని అసహ్యమైన పనులు చేసి, నీ సోదరి నీకన్నా మెరుగైనదిగా కనబడేలా చేశావు.
52నువ్వు వాళ్ళకన్నా అత్యధికంగా అసహ్యమైన పనులు చేశావు గనుక నీతో పోల్చి చూసినప్పుడు నీ సోదరీలు నీకన్నా మెరుగైనవాళ్ళుగా నువ్వు చూపించావు. నువ్వు వాళ్లకు విధించిన అవమాన శిక్ష నీకే రావాలి. నీతో పోల్చి చూసినప్పుడు నీ సోదరీలు నీకన్నా మెరుగైనవాళ్ళుగా కనిపిస్తున్నారు గనుక నీకు అవమానం, సిగ్గూ కలుగుతాయి.
53నేను సొదొమను, దాని కూతుళ్ళనూ, షోమ్రోను, దాని కూతుళ్ళనూ గతంలో ఉన్న సౌభాగ్యానికి తెస్తాను. కాని నీ భాగ్యం వాళ్ళలా ఉండదు.
54వీటివలన నువ్వు సిగ్గుపడతావు. నువ్వు చేసిన వాటన్నిటి బట్టి నువ్వు అవమానం పాలవుతావు. ఆ విధంగా నువ్వు వాళ్లకు ఆదరణగా ఉంటావు.
55సొదొమ, దాని కూతుళ్ళూ తమ పూర్వస్థితికి వస్తారు. షోమ్రోను, దాని కూతుళ్ళూ తమ పూర్వస్థితికి వస్తారు. తరువాత నువ్వూ నీ కూతుళ్ళూ మీ పూర్వస్థితికి వస్తారు.
56నీ చుట్టూ ఉండి నిన్ను తృణీకరించిన ఫిలిష్తీయుల కూతుళ్ళూ, సిరియా కూతుళ్ళూ నిన్ను అవమానపరిచినప్పుడు
57నీ దుర్మార్గం బయట పడక ముందు, నువ్వు గర్వించి ఉన్నప్పుడు నీ చెల్లెలు సొదొమ ప్రస్తావన నువ్వు తీసుకురాలేదు.
58నువ్వు చేసిన మోసం, నీ అసహ్యమైన పనులు నువ్వే భరించావు.” ఇదే యెహోవా వాక్కు.
59యెహోవా ప్రభువు ఇలా అంటున్నాడు. “చేసిన ప్రమాణాన్ని చులకనగా ఎంచి, ఒప్పందం భంగ పరిచే ఎవరికైనా ఏమి చేస్తానో అదే నీకు చేస్తాను.
60కానీ నేనే నీ యవ్వనంలో నీతో చేసిన నిబంధన గుర్తు చేసుకుంటాను. నీతో శాశ్వత నిబంధన చేస్తాను.
61అప్పుడు నువ్వు నీ అక్కలను చెల్లెళ్ళను కలుసుకున్నప్పుడు గతంలో నీ సిగ్గుమాలిన ప్రవర్తన గుర్తు చేసుకుంటావు. వారిని నీకు కూతుర్లుగా ఇస్తాను, అయితే నిబంధన మూలంగా కాదు.
62నేను నీతో నా నిబంధన స్థిరపరుస్తాను. అప్పుడు నేను యెహోవానని నువ్వు తెలుసుకుంటావు!
63నువ్వు చేసిన వాటన్నిటి కోసం నేను ప్రాయశ్చిత్తం చేసినప్పుడు దాన్ని గుర్తు చేసుకుని సిగ్గుపడి, నోరు మూసుకుంటావు.” ఇదే ప్రభువైన యెహోవా ప్రకటన.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
The Indian Revised Version Holy Bible in Telugu.
Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.

Bible text licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0).Original Telugu Scripture and full source copyright terms. This verse-only display adapts the original presentation by removing book introductions, editorial headings, source HTML formatting, and inline explanatory footnote popups while preserving Scripture wording and combined original verse ranges. This presentation of the Bible text remains under CC BY-SA 4.0; the copyright holder does not necessarily endorse these changes. Divine Threads study content is independently authored and separate from the licensed Scripture text.