ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) తెలుగు — 2019

యెహెజ్కేలు 1

ఈ అధ్యాయాన్ని తెలుగులో చదవవచ్చు. Divine Threads అధ్యయనాలు తరువాత జోడించబడతాయి.

1నా వయస్సు ముప్ఫయ్యవ సంవత్సరం నాలుగో నెల ఐదో రోజున ఉన్నట్టుండి ఆకాశం తెరుచుకుంది. నేను దైవ దర్శనాలు చూశాను. ఆ రోజుల్లో నేను కెబారు నది దగ్గర బందీల మధ్య నివసిస్తున్నాను.
2అది యెహోయాకీను రాజును బందీగా పట్టుకెళ్ళిన తరువాత ఐదో సంవత్సరం. ఆ నెల ఐదో రోజున
3కల్దీయుల దేశంలో కెబారు నది పక్కన బూజీ కొడుకూ, యాజకుడూ అయిన యెహెజ్కేలుకు యెహోవా వాక్కు బలంగా వచ్చింది. అక్కడే యెహోవా హస్తం అతని మీదికి వచ్చింది.
4అప్పుడు ఉత్తరం వైపు నుండి ఒక తుఫాను వస్తుండడం చూశాను. ఒక మహా మేఘం, దానిలో ప్రజ్వలించే అగ్ని కనిపించాయి. ఆ మేఘంలో గొప్ప కాంతి కనిపించింది. ఆ కాంతి దాన్ని ఆవరించి ఉంది. ఆ మేఘంలో మండే అగ్ని మెరుగు పెట్టిన కంచులా ఉంది.
5దాని మధ్యలో నాలుగు జీవుల్లాంటి ఒక స్వరూపం కనిపించింది. అవి మానవ రూపంలో ఉన్నాయి.
6ఒక్కో దానికి నాలుగు ముఖాలు ఉన్నాయి. అలాగే నాలుగు రెక్కలు ఉన్నాయి.
7వాటి కాళ్లు తిన్నగా ఉన్నాయి. వాటి అరికాళ్ళు దూడ డెక్కల్లా ఉన్నాయి. అవి మెరుగు పెట్టిన ఇత్తడిలా మెరుస్తూ ఉన్నాయి.
8అయినా మనుషులకున్నట్టే వాటికి చేతులు ఉన్నాయి. అవి వాటి నాలుగు రెక్కల కింద ఉన్నాయి. నాలుగు జీవుల ముఖాలూ, రెక్కలూ ఇలా ఉన్నాయి.
9వాటి రెక్కలు పక్కనే ఉన్న మరో జీవి రెక్కలను తాకుతూ ఉన్నాయి. అవి వెళ్తున్నప్పుడు ఏ వైపుకీ తిరగడం లేదు. అవన్నీ ముందుకే ప్రయాణం చేస్తూ ఉన్నాయి.
10వాటి ముఖాలు ఎదుట నుంచి చూస్తే మనిషి ముఖాల్లా ఉన్నాయి. కుడివైపు నుండి చూస్తే సింహం ముఖంలా ఎడమవైపు నుండి చూస్తే ఎద్దు ముఖంలా ఉన్నాయి. ఇంకా ఈ నాలుగు జీవులకీ డేగ లాంటి ముఖాలు ఉన్నాయి.
11వాటి ముఖాలు అలాంటివే. వాటి రెక్కలు పైకి విచ్చుకుని ఉన్నాయి. దాంతో ఒక జత రెక్కలు మరో జీవి రెక్కలను తాకుతూ ఉన్నాయి. ఇంకో జత రెక్కలు వాటి దేహాలను కప్పుతూ ఉన్నాయి.
12అవి అన్నీ ముందుకు సాగి వెళ్తున్నాయి. అటూ ఇటూ తిరుగకుండా ఆత్మ నిర్దేశించిన మార్గంలో వెళ్తున్నాయి.
13ఈ జీవులు రగులుతున్న నిప్పు కణికల్లా, దివిటీల్లా కనిపిస్తున్నాయి. ప్రకాశవంతమైన అగ్ని ఆ జీవుల మధ్య కదులుతూ ఉంది. అక్కడ నుండి మెరుపులు వస్తున్నాయి.
14ఆ జీవులు వెనక్కీ ముందుకీ కదులుతున్నాయి. దాంతో అవి మెరుపుల్లా కనిపిస్తున్నాయి. నాలుగు చక్రాల దర్శనం
15తరువాత నేను ఆ జీవులను చూస్తుంటే వాటి పక్కనే నేలపైన చక్రాల వంటివి కనిపించాయి.
16ఆ చక్రాల నిర్మాణం ఇలా ఉంది, ప్రతి చక్రం గోమేధికంలా ఉంది. నాలుగు చక్రాలూ ఒకేలా ఉన్నాయి. ఒక చక్రంలో మరో చక్రం ఇమిడి ఉన్నట్టుగా ఉన్నాయి.
17అవి కదిలినప్పుడు అన్నీ నాలుగు వైపులకీ కదులుతున్నాయి. ఏదీ వెనక్కి తిరగడం లేదు.
18వాటి అంచులు ఎత్తుగా ఉండి భయం పుట్టిస్తున్నాయి. వాటి అంచుల చుట్టూ కళ్ళు ఉన్నాయి.
19ఆ జీవులు కదిలినప్పుడల్లా వాటితో పాటు ఆ చక్రాలు కూడా కదిలాయి. జీవులు భూమి పై నుండి పైకి లేచినప్పుడు ఆ చక్రాలు కూడా లేచాయి.
20ఆత్మ ఎక్కడికి కదిలి వెళ్తున్నాడో జీవులు కూడా అక్కడికి వెళ్తున్నాయి. చక్రాలు జీవులతో పాటు లేస్తున్నాయి. ఎందుకంటే ఈ జీవుల ఆత్మ చక్రాల్లో ఉంది.
21ఈ జీవుల ఆత్మ చక్రాల్లో ఉంది కాబట్టి జీవులు కదిలినప్పుడు చక్రాలు కూడా కదిలాయి. జీవులు నిశ్చలంగా నిలిచిపోయినప్పుడు చక్రాలు కూడా నిలిచిపోయాయి. జీవులు భూమిపై నుండి పైకి లేచినప్పుడు చక్రాలు కూడా లేచాయి.
22ఆ జీవుల తలల పైగా విశాలమైనది ఒకటి కనిపించింది. అది మెరుస్తున్న మంచు గడ్డలా ఆ జీవుల తలల పైగా వ్యాపించినట్టు కనిపించింది. అది అద్భుతం గానూ, ఆశ్చర్యాన్ని కలిగించేది గానూ ఉంది.
23ఆ విశాలమైన దాని కింద జీవులు తమ రెక్కలు చాపుకుని ఉన్నాయి. ఒకదాని రెక్కలు మరోదాని రెక్కలను తాకుతూ ఉన్నాయి. ప్రతి జీవీ తన రెండు రెక్కలతో తన దేహాన్ని కప్పుకుంటూ ఉంది. అలా ప్రతి జీవికీ దేహాన్ని కప్పుకోడానికి రెండు రెక్కలున్నాయి.
24ఆ తరువాత నేను వాటి రెక్కల శబ్దం విన్నాను. అది పరుగులెత్తే నీటి శబ్దంలా ఉంది. సర్వశక్తిగల దేవుని స్వరంలా ఉంది. అవి కదిలినప్పుడల్లా గాలివాన శబ్దం వినిపించింది. ఒక సైన్యం చేస్తున్న శబ్దంలా తోచింది. అవి కదలకుండా ఆగినప్పుడు తమ రెక్కలను కిందకి వాల్చి ఉంచాయి.
25అవి ఆగిపోయి తమ రెక్కలు చాపినప్పుడు వాటి తలల పైన ఉన్న విశాలమైన దానికి పైగా ఒక స్వరం వినిపించింది.
26వాటి తలల పైగా ఉన్న ఆ విశాలమైనదాని పైన ఒక సింహాసనం లాంటిది కనిపించింది. అది నీలకాంత మణిలా ఉంది. ఆ సింహాసనం పైన మానవ స్వరూపంలో ఉన్న ఒక వ్యక్తి కూర్చున్నట్లు కనిపించింది.
27అప్పుడు ఒక ఆకారాన్ని నేను చూశాను. అతని నడుము పైగా అగ్నితో మండుతున్న లోహంలా నాకు కనిపించింది. అతని నడుము కింద చుట్టూ అగ్నిలా, ప్రకాశవంతమైన కాంతిలా కనిపించింది.
28అది వర్షం కురిసినప్పుడు మబ్బుల్లో కనిపించే మేఘధనస్సులా, దాని చుట్టూ ఉండే ప్రకాశవంతమైన కాంతిలా కనిపించింది. అది యెహోవా మహిమలా కనిపించింది. అది చూసి నేను సాగిలపడ్డాను. అప్పుడు ఒక స్వరం నాతో మాట్లాడటం నేను విన్నాను.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
The Indian Revised Version Holy Bible in Telugu.
Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.

Bible text licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0).Original Telugu Scripture and full source copyright terms. This verse-only display adapts the original presentation by removing book introductions, editorial headings, source HTML formatting, and inline explanatory footnote popups while preserving Scripture wording and combined original verse ranges. This presentation of the Bible text remains under CC BY-SA 4.0; the copyright holder does not necessarily endorse these changes. Divine Threads study content is independently authored and separate from the licensed Scripture text.