ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) తెలుగు — 2019

నిర్గమకాండం 8

ఈ అధ్యాయాన్ని తెలుగులో చదవవచ్చు. Divine Threads అధ్యయనాలు తరువాత జోడించబడతాయి.

1యెహోవా మోషేతో “నువ్వు ఫరో దగ్గరికి వెళ్లి అతనితో ఇలా చెప్పు, ‘నన్ను ఆరాధించి సేవించడానికి నా ప్రజలను పంపించు.
2నువ్వు వాళ్ళను వెళ్ళనీయకపోతే నేను నీ సరిహద్దులన్నిటినీ కప్పలతో బాధ పెడతాను.
3నదిలో కప్పలు విపరీతంగా పుట్టుకొస్తాయి. అవి నీ ఇంట్లోకి, నీ పడక గదిలోకి, నీ మంచం పైకి, నీ సేవకుల పైకి, నీ ప్రజల పైకి, నీ పొయ్యిల్లో నీ పిండి పిసికే పాత్రల్లోకి ఎక్కివస్తాయి.
4ఆ కప్పలు నీపై, నీ ప్రజలపై, నీ సేవకులందరి పై దాడి చేస్తాయి’ అని యెహోవా చెబుతున్నాడు.”
5యెహోవా మోషేతో ఇంకా ఇలా చెప్పాడు. “నువ్వు అహరోనుతో ‘నీ కర్ర పట్టుకుని నది పాయల మీద, కాలవల మీద, చెరువుల మీద నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం పైకి కప్పలను రప్పించు’ అని చెప్పు” అన్నాడు.
6అహరోను ఐగుప్తు దేశం లోని నీళ్ళ మీద తన చెయ్యి చాపాడు. అప్పుడు కప్పలు పుట్టుకొచ్చి ఐగుప్తు దేశాన్ని కప్పివేశాయి.
7ఐగుప్తు దేశపు మాంత్రికులు కూడా తమ మంత్ర శక్తులు ఉపయోగించి ఐగుప్తు దేశం అంతటా కప్పలను రప్పించారు.
8అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. “నా దగ్గర నుండి, నా ప్రజల దగ్గర నుండి ఈ కప్పలు తొలగిపోయేలా చేయమని యెహోవాను ప్రాధేయపడండి. కప్పలు తొలగిపోతే యెహోవాకు బలులు అర్పించడానికి ఈ ప్రజలను పంపిస్తాను” అని చెప్పాడు.
9అందుకు మోషే “ఈ కప్పలు మీ మీద, మీ ఇళ్ళలో ఉండకుండాా చచ్చి మిగిలినవన్నీ నదిలోనే ఉండిపోయేలా నీ కోసం, నీ సేవకుల కోసం నేను దేవుణ్ణి ఎప్పుడు ప్రాధేయపడాలో నన్ను అడిగే అవకాశం నీదే” అన్నాడు. అప్పుడు ఫరో “రేపే ఆ పని చెయ్యి” అని బదులిచ్చాడు.
10అందుకు మోషే “మా దేవుడు యెహోవా లాంటి వాడు ఎవ్వరూ లేడు అని నువ్వు గ్రహించేలా నువ్వు కోరుకున్నట్టు జరుగుతుంది.
11కప్పలు మీ నుండి, మీ ఇళ్ళ నుండి, నీ సేవకుల, నీ ప్రజల ఇళ్ళనుండి తొలగిపోయి నదిలోకి చేరుకుంటాయి” అన్నాడు.
12మోషే అహరోనులు ఫరో దగ్గర నుండి బయలుదేరి వెళ్ళారు. యెహోవా ఫరో మీదికి రప్పించిన కప్పల విషయం మోషే ఆయనకు మొరపెట్టాడు.
13యెహోవా మోషే మాట ఆలకించాడు. ఇళ్ళలో, బయటా, పొలాల్లో ఎక్కడా కప్పలు మిగలకుండా చనిపోయాయి.
14ప్రజలు వాటిని కుప్పలుగా పడవేసినప్పుడు నేలంతా దుర్వాసన వచ్చింది.
15ఇబ్బంది నుండి ఉపశమనం కలిగింది. యెహోవా చెప్పినట్టు ఫరో మళ్ళీ తన హృదయం కఠినం చేసుకుని వారి మాట లక్ష్యపెట్టలేదు. మూడవ తెగులు. చిన్న దోమలు
16అప్పుడు యెహోవా మోషేతో “నువ్వు నీ కర్రను చాపి ఈ దేశంలో ఉన్న దుమ్మును కొట్టు. ఆ దుమ్ము ఐగుప్తు దేశమంతా చిన్న దోమల్లాగా అలుముకుంటుంది అని అహరోనుతో చెప్పు” అన్నాడు. అప్పుడు వారిద్దరూ ఆ విధంగా చేశారు.
17అహరోను తన కర్రను చాపి ఆ దేశపు దుమ్మును కొట్టినప్పుడు మనుష్యుల మీద, జంతువుల మీద చిన్న దోమలు వచ్చాయి. ఐగుప్తు దేశంలోని దుమ్ము అంతా రేగి దోమల్లాగా వ్యాపించాయి.
18మాంత్రికులు కూడా చిన్నదోమలు పుట్టించాలని తమ మంత్రాలు ప్రయోగించారు గానీ వారి వల్ల కాలేదు. మనుష్యుల మీదా, జంతువుల మీదా చిన్న దోమలు నిలిచి ఉన్నప్పుడు
19మాంత్రికులు “ఇది దేవుడైన యెహోవా వేలు” అని ఫరోతో చెప్పారు. అయినప్పటికీ యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినం కావడం వల్ల అతడు వారి మాట వినలేదు. నాలుగవ తెగులు. ఈగలు
20కాబట్టి యెహోవా మోషేతో “నువ్వు ఉదయాన్నే లేచి నది దగ్గర ఉన్న ఫరో ఎదుట నిలిచి అతనితో, నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు.
21నువ్వు నా ప్రజలను వెళ్ళనివ్వని పక్షంలో నేను నీ మీదికీ, నీ సేవకుల మీదికీ, నీ ప్రజలందరి మీదికీ మీ ఇళ్ళలోకీ ఈగల గుంపులను పంపుతాను. ఐగుప్తీయుల ఇళ్ళూ వారు ఉండే ప్రదేశాలూ ఈగల గుంపులతో నిండిపోతాయి.
22భూమిపై నేనే యెహోవాను అని నువ్వు తెలుసుకొనేలా ఆ రోజు నేను నా ప్రజలు నివసిస్తున్న గోషెను దేశాన్ని దీని నుండి మినహాయిస్తాను. అక్కడ ఈగల గుంపులు ఉండవు.
23నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరుస్తాను. రేపే ఈ అద్భుత కార్యం జరుగుతుంది అని యెహోవా సెలవిచ్చాడు అని చెప్పు” అన్నాడు.
24యెహోవా ఆ విధంగా జరిగించాడు. బాధ కలిగించే ఈగల గుంపులు ఫరో ఇంట్లోకి, అతని సేవకుల ఇళ్ళలోకి, ఐగుప్తు దేశమంతా వ్యాపించాయి. ఈగల గుంపులమయమై ఆ దేశమంతా పాడై పోయింది.
25అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. “మీరు వెళ్లి మన దేశంలోనే మీ దేవునికి బలి అర్పించుకోండి” అని వాళ్ళతో చెప్పాడు.
26అందుకు మోషే “అలా చేయడం వీలు కాదు. మా దేవుడు యెహోవాకు మేము అర్పించే బలులు ఐగుప్తీయులకు అసహ్యమైనవి. వాళ్లకు అసహ్యమైన బలులు వాళ్ళ కళ్ళ ఎదుటే అర్పిస్తే వాళ్ళు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపరా.
27అందుకేమా దేవుడు యెహోవా మాకు సెలవిచ్చినట్టు మేము ఎడారిలోకి మూడు రోజుల ప్రయాణమంత దూరం వెళ్లి అక్కడ బలులు అర్పిస్తాం” అని చెప్పాడు.
28ఫరో “మీరు ఎడారిలో మీ దేవుడు యెహోవాకు బలులు అర్పించడానికి మిమ్మల్ని వెళ్ళనిస్తాను. అయితే దూరం వెళ్ళవద్దు. ఇంకా నా కోసం కూడా మీ దేవుణ్ణి వేడుకోండి” అన్నాడు.
29అందుకు మోషే “నేను నీ దగ్గర నుండి వెళ్లి రేపటి రోజున ఈ ఈగల గుంపులు మీ దగ్గర నుండి, మీ సేవకుల దగ్గర నుండి, నీ ప్రజల దగ్గర నుండి తొలగిపోయేలా యెహోవాను వేడుకొంటాను. అయితే యెహోవాకు బలి అర్పించడానికి ప్రజలను వెళ్ళనీయకుండా ఇకపై మోసం చేయవద్దు” అని చెప్పి
30ఫరో దగ్గర నుండి బయలుదేరి వెళ్లి యెహోవాను ప్రార్థించాడు.
31యెహోవా మోషే కోరినట్టు జరిగించాడు. ఈగల గుంపులు ఫరో దగ్గర నుండి, అతని సేవకుల దగ్గర నుండి, ప్రజల దగ్గర నుండి ఒక్కటి కూడా మిగలకుండా తొలగిపోయాయి.
32అయితే అప్పుడు కూడా ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకుని ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనియ్యలేదు.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
The Indian Revised Version Holy Bible in Telugu.
Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.

Bible text licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0).Original Telugu Scripture and full source copyright terms. This verse-only display adapts the original presentation by removing book introductions, editorial headings, source HTML formatting, and inline explanatory footnote popups while preserving Scripture wording and combined original verse ranges. This presentation of the Bible text remains under CC BY-SA 4.0; the copyright holder does not necessarily endorse these changes. Divine Threads study content is independently authored and separate from the licensed Scripture text.