ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) తెలుగు — 2019

ద్వితీయోపదేశ కాండము 8

ఈ అధ్యాయాన్ని తెలుగులో చదవవచ్చు. Divine Threads అధ్యయనాలు తరువాత జోడించబడతాయి.

1“మీరు జీవించి, ఫలించి యెహోవా మీ పితరులకు వాగ్దానం చేసిన దేశంలో ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకునేలా ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని పాటించాలి.
2మీరు ఆయన ఆజ్ఞలను పాటిస్తారో లేదో మిమ్మల్ని పరీక్షించి మీ హృదయాన్ని తెలుసుకోడానికీ, మిమ్మల్ని లోబరచుకోడానికీ మీ యెహోవా దేవుడు అరణ్యంలో ఈ 40 సంవత్సరాలు మిమ్మల్ని నడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకోండి.
3రొట్టె వలన మాత్రమే కాక యెహోవా పలికిన ప్రతి మాట వలన మనుషులు జీవిస్తారని మీకు తెలిసేలా చేయడానికి ఆయన మిమ్మల్ని అణగదొక్కి, మీకు ఆకలి కలిగించి, మీరు గాని, మీ పూర్వీకులు గాని ఎప్పుడూ చూడని మన్నాతో మిమ్మల్ని పోషించాడు.
4ఈ 40 సంవత్సరాలు మీరు వేసుకున్న బట్టలు పాతబడిపోలేదు, మీ కాళ్ళు బరువెక్కలేదు.
5ఒక వ్యక్తి తన సొంత కొడుకుని ఏవిధంగా శిక్షిస్తాడో అదే విధంగా మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని శిక్షిస్తాడని మీరు తెలుసుకోవాలి.
6ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయనకు భయపడుతూ మీ యెహోవా దేవుని ఆజ్ఞలను పాటించాలి.
7ఆయన నిన్ను ప్రవేశపెడుతున్న ఈ మంచి దేశం నీటి వాగులు, లోయలు కొండల నుండి పారే ఊటలు, అగాధ జలాలు గల దేశం.
8దానిలో గోదుమలు, బార్లీ, ద్రాక్షచెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు ఉంటాయి. అది ఒలీవ నూనె, తేనె లభించే దేశం.
9మీరు తినడానికి ఆహారం పుష్కలంగా లభించే దేశం. అందులో మీకు దేనికీ కొదువ ఉండదు. అది ఇనపరాళ్లు గల దేశం. దాని కొండల్లో మీరు రాగిని తవ్వి తీయవచ్చు.
10మీరు తిని తృప్తి పొంది మీ యెహోవా దేవుడు మీకిచ్చిన మంచి దేశాన్నిబట్టి ఆయన్ను స్తుతించాలి.
11ఈ రోజు నేను మీకాజ్ఞాపించే ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నిర్లక్ష్యం చేసి మీ దేవుడైన యెహోవాను మరచిపోకుండా జాగ్రత్త పడండి.
12మీరు కడుపారా తిని, మంచి ఇళ్ళు కట్టించుకుని వాటిలో నివసిస్తారు.
13మీ పశువులు, గొర్రెలు, మేకలు వృద్ధి చెంది, మీ వెండి బంగారాలు విస్తరించి, మీకు కలిగినదంతా వర్ధిల్లుతుంది.
14అప్పుడు మీ మనస్సు గర్వించి, బానిసల ఇల్లైన ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు యెహోవాను మరచిపోతారేమో.
15బాధ కలిగించే పాములు, తేళ్లతో నిండి, నీళ్ళు లేని ఎడారిలాంటి భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన మిమ్మల్ని నడిపించాడు. రాతిబండ నుండి మీకు నీళ్లు రప్పించాడు.
16చివరికి మీకు మేలు చేయాలని ఆయన మిమ్మల్ని అణగదొక్కి, మీకు ఆకలి కలిగించి, మీరు గాని మీ పూర్వీకులు గాని ఎప్పుడూ ఎరగని మన్నాతో మిమ్మల్ని పోషించాడు.
17అయితే మీరు, ‘మా సామర్ధ్యం, మా బాహుబలమే మాకింత ఐశ్వర్యం కలిగించాయి’ అనుకుంటారేమో.
18కాబట్టి మీరు దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే తాను మీ పూర్వీకులతో వాగ్దానం చేసినట్టు తన నిబంధనను ఈ రోజులాగా స్థాపించాలని మీరు ఐశ్వర్యం సంపాదించుకోడానికి మీకు సామర్ధ్యం కలిగించేవాడు ఆయనే.
19మీరు మీ యెహోవా దేవుణ్ణి మరచిపోయి ఇతర దేవుళ్ళను అనుసరించి, వారిని పూజించి నమస్కరిస్తే మీరు తప్పకుండా నశించి పోతారని ఈ రోజు మీ విషయంలో నేను సాక్ష్యం పలుకుతున్నాను.
20యెహోవా మీ ఎదుట ఉండకుండా నాశనం చేస్తున్న ఇతర జాతుల ప్రజలు విననట్టు మీ దేవుడైన యెహోవా మాట వినకపోతే మీరు కూడా వారిలాగానే నాశనమౌతారు.”
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
The Indian Revised Version Holy Bible in Telugu.
Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.

Bible text licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0).Original Telugu Scripture and full source copyright terms. This verse-only display adapts the original presentation by removing book introductions, editorial headings, source HTML formatting, and inline explanatory footnote popups while preserving Scripture wording and combined original verse ranges. This presentation of the Bible text remains under CC BY-SA 4.0; the copyright holder does not necessarily endorse these changes. Divine Threads study content is independently authored and separate from the licensed Scripture text.