ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) తెలుగు — 2019

ద్వితీయోపదేశ కాండము 5

ఈ అధ్యాయాన్ని తెలుగులో చదవవచ్చు. Divine Threads అధ్యయనాలు తరువాత జోడించబడతాయి.

1మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిపించి ఇలా చెప్పాడు, “ఇశ్రాయేలు ప్రజలారా, నేను మీకు ఈ రోజు చెబుతున్న కట్టడలను, విధులను విని నేర్చుకుని వాటిని పాటించండి.
2మన దేవుడు యెహోవా హోరేబులో మనతో ఒప్పందం చేశాడు.
3ఆయన మన పూర్వీకులతో కాదు, ఈ రోజు, ఇక్కడ జీవించి ఉన్న మనతోనే ఈ ఒప్పందం చేశాడు.
4యెహోవా ఆ కొండ మీద అగ్నిలో నుండి ముఖాముఖిగా మీతో మాటలాడినప్పుడు మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు.
5కాబట్టి యెహోవా మాట మీకు తెలపడానికి నేను యెహోవాకూ మీకూ మధ్య నిలబడి ఉన్నప్పుడు యెహోవా ఇలా చెప్పాడు.
6‘బానిసల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనైన యెహోవాను నేనే.
7నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు.
8పైన ఉన్న ఆకాశంలో గాని, కింద ఉన్న భూమిపైనే గాని, భూమి కింద ఉన్న నీళ్లలోనే గాని ఉండే దేని పోలికలోనైనా విగ్రహాన్ని చేసుకోకూడదు.
9వాటికి నమస్కరించకూడదు, వాటిని పూజింపకూడదు. మీ దేవుడైన యెహోవా అనే నేను రోషం గల దేవుణ్ణి. నన్ను ద్వేషించేవారి విషయంలో మూడు నాలుగు తరాల వరకూ తండ్రులు చేసిన దోషాన్ని కొడుకులపైకి రప్పిస్తాను.
10నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు పాటించే వారి విషయంలో వెయ్యి తరాల వరకూ కరుణిస్తాను.
11మీ దేవుడు యెహోవా పేరును అనవసరంగా పలకకూడదు, యెహోవా తన పేరును అనవసరంగా పలికేవాణ్ణి దోషిగా ఎంచుతాడు.
12మీ యెహోవా దేవుడు మీకు ఆజ్ఞాపించినట్టు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి.
13ఆరు రోజులు మీరు కష్టపడి మీ పని చేయాలి.
14ఏడో రోజు మీ యెహోవా దేవునికి విశ్రాంతి దినం. ఆ రోజు మీరు, మీ కొడుకు, కూతురు, దాసుడు లేక దాసి, మీ ఎద్దు లేక గాడిద, మీ పశువుల్లో ఏదైనా సరే, మీ ఇంట్లో ఉన్న పరదేశితో సహా, ఏ పనీ చేయకూడదు. ఎందుకంటే మీకులాగా మీ దాసుడు, మీ దాసి కూడా విశ్రాంతి తీసుకోవాలి.
15మీరు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు మీ దేవుడు యెహోవా తన బాహుబలంతో, చాచిన చేతితో మిమ్మల్ని అక్కడ నుండి రప్పించాడని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి, విశ్రాంతి దినాన్ని పాటించాలని ఆయన మీకు ఆజ్ఞాపించాడు.
16మీ దేవుడు యెహోవా మీకిచ్చే దేశంలో మీరు దీర్ఘాయువుతో, సుఖశాంతులు కలిగి ఉండేలా ఆయన మీకు ఆజ్ఞాపించినట్టు మీ తల్లి తండ్రులను గౌరవించండి.
17హత్య చేయకూడదు.
18వ్యభిచారం చేయకూడదు.
19దొంగతనం చేయకూడదు.
20మీ సాటి మనిషికి వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు.
21మీ పొరుగువాడి భార్యపై ఆశపడకూడదు. మీ పొరుగువాడి ఇంటిని, పొలాన్ని, పనివాణ్ణి, పనికత్తెని, ఎద్దును, గాడిదను, ఇంకా అతనికి చెందిన దేనినీ ఆశించకూడదు.’
22యెహోవా ఆ కొండ మీద అగ్ని, మేఘం, గాఢాంధకారాల మధ్య నుండి గొప్ప స్వరంతో మీ సమాజమంతటితో ఈ మాటలు చెప్పి, రెండు రాతి పలకల మీద వాటిని రాసి నాకిచ్చాడు. ఇంతకు మించి ఆయన మరేమీ చెప్పలేదు.
23ఆ కొండ అగ్నితో మండుతున్నప్పుడు మీరు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరం విని, అంటే మీ గోత్రాల ప్రధానులు, పెద్దలు నా దగ్గరికి వచ్చి,
24‘మన యెహోవా దేవుడు తన మహిమని గొప్పతనాన్ని మాకు చూపించాడు. అగ్నిలో నుండి ఆయన స్వరాన్ని విన్నాం. దేవుడు మానవులతో మాట్లాడినప్పటికీ వారు బతికి ఉండగలరని ఈ రోజు గ్రహించాం.
25కాబట్టి మేము చావడమెందుకు? ఈ గొప్ప అగ్ని మమ్మల్ని కాల్చివేస్తుంది. మేము మన దేవుడు యెహోవా స్వరం ఇంకా వింటే చనిపోతాం.
26మాలాగా మానవులందరిలో సజీవుడైన దేవుని స్వరం అగ్నిలో నుండి పలకడం విని ఇంకెవరు జీవించి ఉన్నారు?
27నువ్వే వెళ్ళి మన దేవుడు యెహోవా చెప్పేదంతా విను. ఆయన నీతో చెప్పిన దానంతటినీ నువ్వే మాతో చెబితే మేము విని దాన్ని పాటిస్తాం అని చెప్పారు.’
28మీరు నాతో చెప్పిన మాటలు యెహోవా విన్నాడు. అప్పుడు యెహోవా నాతో ఇలా చెప్పాడు. ‘ఈ ప్రజలు నీతో చెప్పిన మాటలు నేను విన్నాను. వారు చెప్పినదంతా మంచిదే.
29వారికీ వారి సంతానానికీ ఎప్పుడూ సుఖశాంతులు కలిగేలా వారు నాపట్ల భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని పాటించే మనస్సు వారికి ఉండడం మంచిది.
30“వారి వారి గుడారాల్లోకి తిరిగి వెళ్ళమని” వారితో చెప్పు.
31నువ్వు మాత్రం ఇక్కడ నా దగ్గర ఉండు. నువ్వు వారికి బోధించాల్సిన కట్టడలనూ విధులనూ నేను నీతో చెబుతాను.’
32వారు స్వాధీనం చేసుకోడానికి నేను వారికి ఇస్తున్న దేశంలో వారు ఆ విధంగా ప్రవర్తించాలి.
33మీరు కుడికి ఎడమకి తిరగకుండా మీ దేవుడు యెహోవా ఆజ్ఞాపించిన విధంగా చేయడానికి జాగ్రత్తపడాలి. మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో నివసిస్తూ సుఖశాంతులతో దీర్ఘాయుష్మంతులయ్యేలా మీ దేవుడు యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గాలన్నిటిలో నడుచుకోవాలి.”
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
The Indian Revised Version Holy Bible in Telugu.
Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.

Bible text licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0).Original Telugu Scripture and full source copyright terms. This verse-only display adapts the original presentation by removing book introductions, editorial headings, source HTML formatting, and inline explanatory footnote popups while preserving Scripture wording and combined original verse ranges. This presentation of the Bible text remains under CC BY-SA 4.0; the copyright holder does not necessarily endorse these changes. Divine Threads study content is independently authored and separate from the licensed Scripture text.