ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) తెలుగు — 2019

ద్వితీయోపదేశ కాండము 33

ఈ అధ్యాయాన్ని తెలుగులో చదవవచ్చు. Divine Threads అధ్యయనాలు తరువాత జోడించబడతాయి.

1దేవుని సేవకుడు మోషే చనిపోయేముందు ఇశ్రాయేలు ప్రజలను ఇలా దీవించాడు. యెహోవా సీనాయి పర్వతం నుంచి బయలుదేరాడు
2శేయీరు నుంచి వారికి ఉదయించాడు. ఆయన పారాను పర్వతం నుంచి ప్రకాశించాడు వేలాది వేల పవిత్రులతో ఆయన వచ్చాడు. ఆయన కుడివైపు మెరుపులు మెరుస్తున్నాయి.
3నిజంగా ఆయన ఆ ప్రజలను ప్రేమిస్తాడు. ఆయన పరిశుద్ధులంతా నీ చేతిలో ఉన్నారు, వారు నీ పాదాల దగ్గర వంగి నీ మాటలు విన్నారు.
4మోషే మనకు ధర్మశాస్త్రాన్ని బోధించాడు, యాకోబు సమాజానికి అది వారసత్వం.
5అప్పుడు ప్రజల అధికారులూ ఇశ్రాయేలు గోత్రాలవారూ ఒకచోట చేరితే యెహోవా యెషూరూనులో రాజయ్యాడు.
6రూబేను చావకూడదు. బతకాలి. అయితే వారు కొద్ది మంది మాత్రమే.
7యూదా గురించి మోషే ఇలా పలికాడు, యెహోవా, యూదా ప్రజల మనవి విని, మళ్ళీ అతన్ని తన ప్రజల దగ్గరికి చేర్చు. అతని కోసం పోరాడు. అతని శత్రువులకు విరోధంగా అతనికి సహాయం చెయ్యి
8లేవీ గురించి మోషే ఇలా పలికాడు, నీ తుమ్మీము, నీ ఊరీము నీ భక్తుడి కోసం ఉన్నాయి. మస్సాలో నువ్వు అతణ్ణి పరీక్షించావు. మెరీబా నీళ్ల దగ్గర అతనితో నువ్వు పోరాడావు.
9నేను వాళ్ళని చూడలేదు, అని తన తండ్రి గురించి, తన తల్లి గురించి అన్నవాడు అతడు. తన సోదరులను లెక్క చెయ్యలేదు. తన సొంత కొడుకులను పట్టించుకోలేదు. ఎందుకంటే అతడు నీ మాటలను భద్రం చేశాడు. నీ నిబంధన పాటించాడు.
10అతడు యాకోబుకు నీ విధులనూ, ఇశ్రాయేలుకు నీ ధర్మశాస్త్రాన్నీ నేర్పిస్తాడు. అతడు నీ ఎదుట సాంబ్రాణి వేస్తాడు. నీ బలిపీఠం మీద సర్వాంగబలి అర్పిస్తాడు.
11యెహోవా, అతని ఆధిపత్యాలను దీవించు, అతడు చేసే పనులను అంగీకరించు. అతనికి విరోధంగా లేచే వారి, అతన్ని ద్వేషించేవారి నడుములు విరగ్గొట్టు. వాళ్ళు మళ్ళీ లేవరు.
12బెన్యామీను గురించి మోషే ఇలా పలికాడు, యెహోవాకు ప్రియుడు. ఆయన దగ్గర అతడు క్షేమంగా ఉంటాడు. రోజంతా యెహోవా అతనికి అండగా ఉంటాడు. అతడు యెహోవా భుజాల మధ్య నివసిస్తాడు.
13యోసేపు గురించి మోషే ఇలా పలికాడు. యెహోవా అతని భూమిని దీవిస్తాడు ఆకాశం నుంచి వచ్చే శ్రేష్ఠమైన మంచుతో, కింద ఉన్న జలాగాధంతో,
14సూర్యుని వల్ల వచ్చే శ్రేష్ఠమైన పంటతో, నెలనెలా పండే శ్రేష్ఠమైన పండ్లతో,
15పురాతన పర్వతాల శ్రేష్ఠ పదార్థాలతో, శాశ్వతమైన కొండల శ్రేష్ఠ పదార్థాలతో,
16భూమి ఇచ్చే శ్రేష్ఠ పదార్థాలతో, దాని సమృద్ధితో, పొదలో కనిపించిన వాడి దయ యోసేపు తల మీదికి వస్తుంది గాక. తన సోదరుల్లో రాకుమారుడి నుదిటి మీదకు అది వస్తుంది గాక.
17తొలిచూలు ఎద్దు ఠీవి అతనికుంది. అతని కొమ్ములు అడవి ఎద్దు కొమ్ములు. వాటితో అతడు ప్రజలను భూదిగంతాలకు తోలివేస్తాడు. వీరంతా ఎఫ్రాయింకు చెందిన వేలమంది. మనష్షేకు చెందిన వేలమంది.
18జెబూలూను గురించి మోషే ఇలా పలికాడు, జెబూలూనూ, నువ్వు బయలు దేరేటప్పుడు సంతోషించు. ఇశ్శాఖారూ, నువ్వు నీ గుడారాల్లో సంతోషించు.
19వాళ్ళు ప్రజలను పర్వతాలకు పిలుస్తారు. అక్కడ సరైన బలులు అర్పిస్తారు. వారు సముద్రాల సమృద్ధినీ సముద్ర తీర ఇసుకలో దాగిన నిధులనూ తీస్తారు.
20గాదు గురించి మోషే ఇలా పలికాడు. గాదు ప్రాంతాన్ని విశాలం చేసేవాడికి దీవెన. ఆ గోత్రం ఆడ సింహంలా పొంచి ఉంటుంది చేతిని, నడినెత్తిని చీల్చివేస్తుంది.
21అతడు తనకోసం శ్రేష్ఠమైన భాగాన్ని చూసుకున్నాడు. నాయకుని భాగం అక్కడ కేటాయించబడింది. ప్రజల ప్రముఖులు సమకూడినప్పుడు, యెహోవా తీర్చిన న్యాయాన్ని అమలు చేశాడు. ఇశ్రాయేలు ప్రజల విషయం యెహోవా న్యాయ విధుల ప్రకారం జరిగించాడు.
22దాను విషయం మోషే ఇలా పలికాడు, దాను సింహపు పిల్ల వంటిది అది బాషానునుంచి దూకుతుంది.
23నఫ్తాలి విషయం మోషే ఇలా పలికాడు. కనికరంతో సంతృప్తి నొందిన నఫ్తాలి, యెహోవా దీవెనతో నిండిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ ప్రాంతాలు నీ స్వాధీనం.
24ఆషేరు విషయం మోషే ఇలా పలికాడు, మిగిలిన కొడుకుల కంటే ఆషేరుకు ఎక్కువ దీవెన. తన సోదరుల కంటే ఎక్కువ కటాక్షం పొందుతాడు. తన పాదాలు ఒలీవ నూనెలో ముంచుతాడు
25నీ కమ్ములు ఇనుపవీ, కంచువీ. నువ్వు బతికిన కాలమంతా నీకు భద్రతే.
26యెషూరూనూ, నీ దేవుణ్ణి పోలిన వాడెవడూ లేడు నీ సహాయానికి ఆకాశ వాహనుడుగా ఆయన వస్తాడు తన ఘనతతో మేఘాల్లో నుండి వస్తాడు.
27నిత్య దేవుడు నీకు ఆశ్రయం, శాశ్వతమైన హస్తాలు నీ కింద ఉన్నాయి. శత్రువును ఆయన నీ ఎదుట నుంచి గెంటి వేస్తాడు. నాశనం చెయ్యి! అంటాడు.
28ఇశ్రాయేలు ప్రజలు భద్రంగా నివసిస్తారు. యాకోబు నివాసం సురక్షితం. ధాన్యం, కొత్త ద్రాక్షారసాలున్న దేశంలో అతనిపై ఆకాశం నిజంగా మంచు కురుస్తుంది.
29ఇశ్రాయేలూ! మీరెంత ధన్యులు! యెహోవా రక్షించిన ప్రజలారా, మీలాంటి వారెవరు? ఆయనే మిమ్మల్ని కాపాడే డాలు వంటివాడు, ఆయన మీకు ఘనమైన కత్తి వంటివాడు. నీ శత్రువులు వణుకుతూ నీకు లోబడతారు నువ్వు వారి ఎత్తయిన స్థలాలను తొక్కుతావు.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
The Indian Revised Version Holy Bible in Telugu.
Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.

Bible text licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0).Original Telugu Scripture and full source copyright terms. This verse-only display adapts the original presentation by removing book introductions, editorial headings, source HTML formatting, and inline explanatory footnote popups while preserving Scripture wording and combined original verse ranges. This presentation of the Bible text remains under CC BY-SA 4.0; the copyright holder does not necessarily endorse these changes. Divine Threads study content is independently authored and separate from the licensed Scripture text.