ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) తెలుగు — 2019

ద్వితీయోపదేశ కాండము 25

ఈ అధ్యాయాన్ని తెలుగులో చదవవచ్చు. Divine Threads అధ్యయనాలు తరువాత జోడించబడతాయి.

1“ప్రజలు తమ వివాదాల పరిష్కారానికి న్యాయస్థానానికి వస్తే న్యాయమూర్తులు వారికి తీర్పు చెప్పాలి. నీతిమంతుణ్ణి విడిపించి నేరస్తులను శిక్షించాలి.
2ఆ దోషి శిక్షార్హుడైతే, న్యాయమూర్తి అతన్ని పడుకోబెట్టి అతని నేర తీవ్రత బట్టి దెబ్బలు లెక్కపెట్టి తన ఎదుట వాణ్ణి కొట్టించాలి.
3నలభై దెబ్బలు కొట్టించవచ్చు. అంతకు మించకూడదు. అలా చేస్తే మీ సోదరుడు మీ దృష్టిలో నీచుడుగా కనబడతాడేమో.
4కళ్ళం నూర్చే ఎద్దు మూతికి చిక్కం కట్టకూడదు.
5సోదరులు కలిసి నివసిస్తూ ఉన్నప్పుడు వారిలో ఒకడు మగ సంతానం కనకుండా చనిపోతే, చనిపోయిన వాడి భార్య అన్య వంశంలోని వ్యక్తిని పెళ్ళిచేసుకోకూడదు. ఆమె భర్త సోదరుడు ఆమె దగ్గరికి వెళ్లి ఆమెను పెళ్లి చేసుకుని తన సోదరునికి బదులు ఆమె పట్ల భర్త ధర్మం జరిగించాలి.
6చనిపోయిన సోదరుని పేరు ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి రద్దు కాకుండా ఆమె కనే పెద్దకొడుకు, చనిపోయిన సోదరునికి వారసుడుగా ఉండాలి.
7అతడు తన సోదరుని భార్యను పెళ్లి చేసుకోకపోతే వాడి సోదరుని భార్య, పట్టణ ద్వారం దగ్గరికి, అంటే పెద్దల దగ్గరికి వెళ్లి, నా భర్త సోదరుడు ఇశ్రాయేలు ప్రజల్లో తన సోదరుని పేరు స్థిరపరచడానికి నిరాకరిస్తున్నాడు. భర్త సోదరుని ధర్మం నాపట్ల జరిగించడం లేదు, అని చెప్పాలి.
8అప్పుడు అతని ఊరి పెద్దలు అతణ్ణి పిలిపించి, అతనితో మాటలాడిన తరువాత అతడు నిలబడి ‘ఆమెను పెళ్ళిచేసుకోవడం నా కిష్టం లేదు’ అంటే, అతని సోదరుని భార్య
9ఆ పెద్దలు చూస్తూ ఉండగా అతని దగ్గరికి వెళ్ళి అతని చెప్పు ఊడదీసి అతని ముఖం మీద ఉమ్మి, తన సోదరుని వంశం నిలబెట్టని వాడికి ఇలా జరుగుతుంది అని చెప్పాలి.
10అప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో వాడికి ‘చెప్పు ఊడ దీసినవాడి ఇల్లు’ అని పేరు వస్తుంది.
11ఇద్దరు పురుషులు ఒకడితో ఒకడు పోట్లాడుకుంటున్న సమయంలో ఒకడి భార్య తన భర్తను కొడుతున్నవాడి చేతి నుంచి తన భర్తను విడిపించడానికి వచ్చి, చెయ్యి చాపి అతడి మర్మాంగాలను పట్టుకుంటే ఆమె చేతిని నరికెయ్యాలి.
12మీ కళ్ళు జాలి చూపించకూడదు.
13వేరు వేరు తూకం రాళ్లు పెద్దదీ, చిన్నదీ రెండు రకాలు మీ సంచిలో ఉంచుకోకూడదు.
14వేరు వేరు తూములు పెద్దదీ, చిన్నదీ మీ ఇంట్లో ఉంచుకోకూడదు.
15మీ దేవుడైన యెహోవా మీకిస్తున్న దేశంలో మీరు శాశ్వతకాలం జీవించి ఉండేలా కచ్చితమైన న్యాయమైన తూనికరాళ్లు ఉంచుకోవాలి. కచ్చితమైన న్యాయమైన కొలత మీకు ఉండాలి.
16ఆ విధంగా చేయని ప్రతివాడూ అంటే అన్యాయం చేసే ప్రతివాడూ మీ యెహోవా దేవునికి అసహ్యుడు.
17మీరు ఐగుప్తు నుంచి ప్రయాణిస్తున్న మార్గంలో అమాలేకీయులు మీకు చేసిన దాన్ని గుర్తు చేసుకోండి. వాళ్ళు దేవుని భయం లేకుండా మార్గమధ్యలో మీకు ఎదురు వచ్చి,
18మీరు బలహీనంగా, అలసిపోయి ఉన్నప్పుడు, మీ ప్రజల్లో వెనక ఉన్న బలహీనులందరినీ చంపివేశారు.
19కాబట్టి మీరు స్వాధీనం చేసుకోడానికి మీ దేవుడైన యెహోవా వారసత్వంగా మీకిస్తున్న దేశంలో, మీ దేవుడైన యెహోవా మీ చుట్టూ ఉన్న శత్రువులందరి నుంచీ మీకు నెమ్మది ఇచ్చిన తరువాత అమాలేకీయుల పేరు ఆకాశం కింద ఉండకుండాా తుడిచిపెట్టుకు పోయేలా చేయండి. ఈ సంగతి ఎన్నడూ మర్చిపోవద్దు.”
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
The Indian Revised Version Holy Bible in Telugu.
Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.

Bible text licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0).Original Telugu Scripture and full source copyright terms. This verse-only display adapts the original presentation by removing book introductions, editorial headings, source HTML formatting, and inline explanatory footnote popups while preserving Scripture wording and combined original verse ranges. This presentation of the Bible text remains under CC BY-SA 4.0; the copyright holder does not necessarily endorse these changes. Divine Threads study content is independently authored and separate from the licensed Scripture text.