ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) తెలుగు — 2019

ద్వితీయోపదేశ కాండము 17

ఈ అధ్యాయాన్ని తెలుగులో చదవవచ్చు. Divine Threads అధ్యయనాలు తరువాత జోడించబడతాయి.

1“ఎలాంటి మచ్చలు, లోపాలు ఉన్న ఎద్దులు, గొర్రెలు మీ యెహోవా దేవునికి బలిగా అర్పించకూడదు. అది మీ యెహోవా దేవునికి అసహ్యం.
2మీ యెహోవా దేవుని నిబంధన మీరి ఆయన దృష్టిలో దుర్మార్గం చేస్తూ నేనిచ్చిన ఆజ్ఞకు వ్యతిరేకంగా అన్యదేవుళ్ళకు, అంటే సూర్యునికి గానీ చంద్రునికి గానీ ఆకాశ నక్షత్రాల్లో దేనికైనా నమస్కరించి మొక్కే పురుషుడు, స్త్రీ ఎవరైనా మీ యెహోవా దేవుడు మీకిస్తున్న ఏ గ్రామంలోనైనా మీ మధ్య కనబడినప్పుడు,
3ఆ విషయం మీకు తెలిసిన తరువాత మీరు విచారణ జరిగించాలి. అది నిజమైతే, అంటే అలాంటి అసహ్యమైన పని ఇశ్రాయేలీయుల్లో జరగడం నిజమైతే
4ఆ చెడ్డ పని చేసిన పురుషుణ్ణి, స్త్రీని మీ ఊరి బయటకు తీసుకువెళ్ళి రాళ్లతో కొట్టి చంపాలి.
5అలాంటి వాడికి మరణశిక్ష విధించాలంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తుల సాక్ష్యం సరిపోతుంది.
6కేవలం ఒక్క వ్యక్తి సాక్ష్యంపై అతణ్ణి చంపకూడదు.
7అతన్ని చంపడానికి, మొదట సాక్షులు, తరువాత ప్రజలంతా అతని మీద చేతులు వేయాలి. ఆ విధంగా మీ మధ్య నుంచి ఆ చెడుతనాన్ని రూపుమాపాలి. న్యాయస్థానలు
8హత్యకూ, ప్రమాదవశాత్తూ జరిగిన మరణానికీ మధ్య, ఒకడి హక్కూ మరొకడి హక్కూ మధ్య, దెబ్బ తీయడం మరొక రకంగా నష్టపరచడం మధ్య, మీ గ్రామాల్లో భేదాలు వచ్చి, వీటి తేడా తెలుసుకోవడం మీకు కుదరకపోతే
9మీరు లేచి మీ యెహోవా దేవుడు ఏర్పరచుకొనే స్థలానికి వెళ్లి యాజకులైన లేవీయులనూ, విధుల్లో ఉన్న న్యాయాధిపతినీ విచారించాలి. వారు దానికి తగిన తీర్పు మీకు తెలియచేస్తారు.
10యెహోవా ఏర్పరచుకొనే చోటులో వాళ్ళు మీకు తెలియచేసే తీర్పు ప్రకారం మీరు జరిగించి వారు మీకు చెప్పే పరిష్కారం ప్రకారం మీరు చెయ్యాలి.
11వారు మీకు బోధించే చట్టాన్ని పాటించాలి. వారు ఇచ్చిన తీర్పు ప్రకారం జరిగించాలి. వారు మీకు చెప్పే మాట నుంచి కుడికిగాని ఎడమకుగాని తిరగకూడదు.
12ఆ ప్రదేశంలో ఎవరైనా అహంకారంతో మీ యెహోవా దేవునికి పరిచర్య చేయడానికి నిలిచే యాజకుని మాటగానీ ఆ న్యాయాధిపతి మాటగానీ వినకపోతే అతన్ని చంపివేయాలి. ఆ విధంగా దుర్మార్గాన్ని ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి రూపుమాపాలి.
13అప్పుడు ప్రజలంతా విని, భయపడి అహంకారంతో ప్రవర్తించకుండా ఉంటారు. రాజును ఎన్నుకోవడం
14మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలో మీరు ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకుని అందులో నివసించి, మా చుట్టూ ఉన్న అందరి ప్రజల్లాగా మా మీద రాజును నియమించుకుంటాం అనుకుంటే, మీ యెహోవా దేవుడు ఎన్నుకునే వ్యక్తిని తప్పకుండా మీ మీద రాజుగా నియమించుకోవాలి.
15మీ సోదరుల్లోనే ఒకణ్ణి మీ మీద రాజుగా నియమించుకోవాలి. మీ సోదరుడుకాని విదేశీయుణ్ణి మీపై రాజుగా నియమించుకోకూడదు.
16అతడు గుర్రాలను చాలా ఎక్కువగా సంపాదించుకోకూడదు. గుర్రాలను ఎక్కువగా సంపాదించడానికి ప్రజలను ఐగుప్తుకు తిరిగి వెళ్లనివ్వకూడదు. ఎందుకంటే యెహోవా ఇక మీదట మీరు ఈ దారిలో వెళ్లకూడదని మీతో చెప్పాడు.
17తన హృదయం తొలగిపోకుండా అతడు ఎక్కువమంది స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు. వెండి బంగారాలను అతడు తన కోసం ఎక్కువగా సంపాదించుకోకూడదు.
18అతడు రాజ్యసింహాసనంపై కూర్చున్న తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథాన్ని చూసి ఆ ధర్మశాస్త్రానికి ఒక ప్రతిని తనకోసం రాసుకోవాలి.
19అది అతని దగ్గర ఉండాలి. అతడు జీవించి ఉన్న కాలమంతా ఆ గ్రంథం చదువుతూ ఉండాలి.
20అలా చేస్తున్నప్పుడు దేవుడైన యెహోవా పట్ల భయంతో తన సోదరులపై గర్వించకుండా ఈ ఆజ్ఞల విషయంలో కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా ఉంటాడు. అప్పుడు రాజ్యంలో అతడూ అతని కొడుకులూ ఇశ్రాయేలులో ఎక్కువ కాలం జీవిస్తారు.”
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
The Indian Revised Version Holy Bible in Telugu.
Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.

Bible text licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0).Original Telugu Scripture and full source copyright terms. This verse-only display adapts the original presentation by removing book introductions, editorial headings, source HTML formatting, and inline explanatory footnote popups while preserving Scripture wording and combined original verse ranges. This presentation of the Bible text remains under CC BY-SA 4.0; the copyright holder does not necessarily endorse these changes. Divine Threads study content is independently authored and separate from the licensed Scripture text.