ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) తెలుగు — 2019

ద్వితీయోపదేశ కాండము 10

ఈ అధ్యాయాన్ని తెలుగులో చదవవచ్చు. Divine Threads అధ్యయనాలు తరువాత జోడించబడతాయి.

1అప్పుడు యెహోవా “నువ్వు మొదటి పలకల వంటివి రెండు రాతిపలకలు చెక్కి, కొండ ఎక్కి నా దగ్గరికి రా. అలాగే చెక్కతో ఒక పెట్టె చేసుకో.
2నువ్వు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలను నేను ఈ పలకల మీద రాసిన తరవాత వాటిని నువ్వు ఆ పెట్టెలో ఉంచాలి” అని నాతో చెప్పాడు.
3కాబట్టి నేను తుమ్మకర్రతో ఒక పెట్టె చేయించి మొదటి పలకలవంటి రెండు రాతి పలకలను చెక్కి వాటిని పట్టుకుని కొండ ఎక్కాను.
4మీరు సమావేశమైన రోజున ఆయన ఆ కొండ మీద అగ్నిలో నుండి మీతో పలికిన పది ఆజ్ఞలనూ మొదట రాసినట్టే ఆ పలకల మీద రాశాడు. యెహోవా వాటిని నాకిచ్చిన తరువాత నేను కొండ దిగి వచ్చి
5నేను చేసిన మందసంలో ఆ పలకలు ఉంచాను. అదుగో, యెహోవా నాకాజ్ఞాపించినట్టు వాటిని దానిలో ఉంచాను.
6ఇశ్రాయేలు ప్రజలు యహకానీయులకు చెందిన బెయేరోతు నుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అహరోను చనిపోయాడు. అక్కడ అతణ్ణి సమాధి చేశారు. అతని కొడుకు ఎలియాజరు అతని స్థానంలో యాజకుడయ్యాడు.
7అక్కడ నుండి వారు గుద్గోదకు, గుద్గోద నుండి నీటివాగులతో నిండి ఉండే యొత్బాతా ప్రాంతానికి ప్రయాణమయ్యారు.
8అప్పటి వరకూ జరుగుతున్నట్టు యెహోవా నిబంధన మందసాన్ని మోయడానికి, యెహోవా సన్నిధిలో నిలబడి సేవించడానికి, ప్రజలను ఆయన పేరిట దీవించడానికి ఆ సమయంలో యెహోవా లేవీ గోత్రం వారిని ఎన్నుకున్నాడు.
9అందుకే లేవీయులు తమ సోదరులతో పాటు స్వాస్థ్యం పొందలేదు. మీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్టు వారి స్వాస్థ్యం ఆయనే.
10ఇంతకు ముందులాగా నేను నలభై పగళ్లు, నలభై రాత్రులు కొండ మీద ఉన్నప్పుడు యెహోవా నా మనవి ఆలకించి మిమ్మల్ని నాశనం చేయడం మానుకున్నాడు.
11యెహోవా నాతో “ఈ ప్రజలు నేను వారి పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలో ప్రవేశించి స్వాధీనం చేసుకొనేలా వారికి ముందుగా నడువు” అని చెప్పాడు. దేవుడైన యెహోవాకు భయపడుడి
12కాబట్టి ఇశ్రాయేలూ, మీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గాల్లో నడుస్తూ, ఆయన్ని ప్రేమించి, మీ పూర్ణ మనస్సుతో, మీ పూర్ణాత్మతో సేవించు.
13మీ మేలు కోసం ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే యెహోవా ఆజ్ఞలను, కట్టడలను పాటించడం తప్ప మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఇంకేమి కోరుతున్నాడు?
14చూడు, ఆకాశ మహాకాశాలు, భూమి, వాటిలో ఉన్నదంతా మీ దేవుడైన యెహోవావే.
15అయితే యెహోవా మీ పూర్వీకులను ప్రేమించి వారి విషయంలో సంతోషించి వారి సంతానమైన మిమ్మల్ని మిగిలిన ప్రజలందరిలో ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాడు.
16కాబట్టి మీరు మూర్ఖంగా ప్రవర్తించకుండా సున్నతి లేని మీ హృదయాలకు సున్నతి చేసుకోండి.
17ఎందుకంటే మీ దేవుడు యెహోవా దేవుళ్లకే దేవుడు, ప్రభువులకే ప్రభువు. ఆయనే మహా దేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన మానవులెవరినీ లక్ష్య పెట్టడు. లంచం పుచ్చుకోడు.
18ఆయన అనాథలకు, విధవరాళ్ళకు న్యాయం తీరుస్తాడు, పరదేశుల మీద దయ చూపి వారికి అన్నవస్త్రాలు అనుగ్రహిస్తాడు.
19మీరు ఐగుప్తు దేశంలో ప్రవాసులుగా ఉన్నవారే కాబట్టి పరదేశి పట్ల జాలి చూపండి.
20మీ దేవుడైన యెహోవాకు భయపడి, ఆయన్ను సేవించి, ఆయన్నే హత్తుకుని, ఆయన పేరటే ప్రమాణం చేయండి.
21ఆయనే మీ స్తుతికి పాత్రుడు. మీరు కళ్ళారా చూస్తుండగా భీకరమైన గొప్ప కార్యాలు మీ కోసం చేసిన మీ దేవుడు ఆయనే.
22మీ పూర్వీకులు 70 మంది గుంపుగా ఐగుప్తుకు వెళ్ళారు. ఇప్పుడైతే మీ యెహోవా దేవుడు ఆకాశనక్షత్రాల్లాగా మిమ్మల్ని విస్తరింపజేశాడు.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
The Indian Revised Version Holy Bible in Telugu.
Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.

Bible text licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0).Original Telugu Scripture and full source copyright terms. This verse-only display adapts the original presentation by removing book introductions, editorial headings, source HTML formatting, and inline explanatory footnote popups while preserving Scripture wording and combined original verse ranges. This presentation of the Bible text remains under CC BY-SA 4.0; the copyright holder does not necessarily endorse these changes. Divine Threads study content is independently authored and separate from the licensed Scripture text.