ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) తెలుగు — 2019

2 సమూయేలు 3

ఈ అధ్యాయాన్ని తెలుగులో చదవవచ్చు. Divine Threads అధ్యయనాలు తరువాత జోడించబడతాయి.

1సౌలు కుటుంబం వారికీ, దావీదు కుటుంబం వారికీ చాలాకాలం పాటు యుద్ధాలు జరిగాయి. ఫలితంగా దావీదు మరింత బలంగా వృద్ధి చెందాడు, సౌలు కుటుంబం క్రమేపీ క్షీణించిపోయింది.
2హెబ్రోనులో దావీదుకు పుట్టిన కొడుకులు. యెజ్రెయేలీయురాలైన అహీనోయముకు అమ్నోను అనే మొదటి కొడుకు పుట్టాడు.
3రెండవ కొడుకు కిల్యాబు అంతకు ముందు కర్మెలీ వాడైన నాబాలుకు భార్యగా ఉన్న అబీగయీలుకు పుట్టాడు. మూడవ వాడు అబ్షాలోము గెషూరు రాజైన తల్మయి కుమార్తె మయకాకు పుట్టాడు.
4నాలుగవ వాడు అదోనీయా హగ్గీతుకు పుట్టాడు. అయిదవ వాడు షెఫట్య అబీటలుకు పుట్టాడు.
5ఆరవ వాడు ఇత్రెయాము దావీదు భార్య ఎగ్లాకు పుట్టాడు. వీరంతా హెబ్రోనులో దావీదుకు పుట్టిన కొడుకులు.
6సౌలు కుటుంబం వారికీ, దావీదు కుటుంబం వారికీ యుద్ధాలు జరిగే సమయంలో అబ్నేరు సౌలు కుటుంబం వారికి ఎంతో సహాయం చేశాడు.
7రిస్పా కూతురు అయ్యా సౌలుకు ఒక ఉపపత్ని. ఇష్బోషెతు “నా తండ్రి ఉపపత్నితో నువ్వెందుకు సంబంధం పెట్టుకున్నావు” అని అబ్నేరును ప్రశ్నించాడు.
8ఇష్బోషెతు తనను అలా నిలదీసి అడిగినందుకు అబ్నేరుకు తీవ్రమైన కోపం వచ్చింది. అబ్నేరు “నిన్ను దావీదు చేతికి అప్పగించకుండా నీ తండ్రి అయిన సౌలు కుటుంబం వారికీ, అతని సహోదరులకూ, అతని స్నేహితులకూ నేను ఉపకారం చేశానే. నన్ను యూదావారి పక్షంతో చేరిన కుక్కతో సమానంగా ఎంచి, ఈ రోజున ఒక స్త్రీని బట్టి నా మీద నేరం మోపుతున్నావా?
9యెహోవా దావీదుకు ప్రమాణం చేసిన దాన్ని అతని పక్షంగా నేను చేయకపోతే
10దేవుడు నాకు గొప్ప కీడు రప్పిస్తాడు గాక. సౌలు కుటుంబం వారి చేతిలోనుండి రాజ్యాన్ని తప్పించి దాను నుండి బెయేర్షెబా దాకా ఇశ్రాయేలు వారికి, యూదా వారికి దావీదు సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను” అన్నాడు.
11అబ్నేరు మాటలకు భయపడిన ఇష్బోషెతు ఇంకేమీ మాట్లాడలేకపోయాడు.
12అబ్నేరు తన మనుషులను దావీదు దగ్గరికి పంపి “ఈ రాజ్యం ఎవరిది? నువ్వు నాతో ఒప్పందం చెయ్యి. నేను నీకు సహాయం చేసి ఇశ్రాయేలు వారినందరినీ నీవైపు తిప్పుతాను” అని కబురు పంపాడు. అప్పుడు దావీదు “మంచిది. నేను నీతో ఒప్పందం చేస్తాను.
13అయితే నువ్వు ఒక పని చేయాలి. నన్ను చూడడానికి వచ్చే సమయంలో సౌలు కూతురు మీకాలును నా దగ్గరికి తీసుకురావాలి. లేకపోతే నీకు నా దర్శనం దొరకదు” అని జవాబిచ్చాడు.
14దావీదు సౌలు కొడుకు ఇష్బోషెతు దగ్గరికి తన మనుషులను పంపించి “ఫిలిష్తీయుల్లో వందమంది మర్మాంగ చర్మపు కొనలను తెచ్చి నేను పెండ్లి చేసుకొన్న మీకాలును నాకు అప్పగించాలి” అని చెప్పమన్నాడు.
15మీకాలు భర్త, లాయీషు కొడుకు అయిన పల్తీయేలు దగ్గర నుండి మీకాలును తీసుకు వచ్చేందుకు ఇష్బోషెతు తన మనుషులను పంపించాడు.
16ఆమె భర్త బహూరీము వరకూ మీకాలు వెనకాలే ఏడ్చుకుంటూ వస్తుంటే అబ్నేరు “నీవు తిరిగి వెనక్కి వెళ్ళిపో” అని చెప్పగానే అతడు వెళ్లిపోయాడు. అబ్నేరు దావీదును సందర్శించటం
17అప్పుడు అబ్నేరు ఇశ్రాయేలు పెద్దలను పిలిపించి “దావీదు మిమ్మల్ని పాలించాలని మీరు ఇంతకు ముందు కోరుకున్నారు గదా?
18‘నా సేవకుడైన దావీదు చేత నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండి, వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచిస్తాను’ అని యెహోవా దావీదును గూర్చి సెలవిచ్చాడు కాబట్టి మీ కోరిక నెరవేర్చుకోండి” అని వారితో చెప్పాడు.
19అబ్నేరు బెన్యామీనీయులతో ఆ విధంగా మాట్లాడిన తరువాత హెబ్రోనుకు వచ్చి ఇశ్రాయేలువారి దృష్టికి, బెన్యామీనీయులందరి దృష్టికి ఏది అనుకూలమో దాన్ని దావీదుకు పూర్తిగా తెలియచేశాడు.
20అందుకోసం అబ్నేరు ఇరవైమందిని వెంటబెట్టుకుని హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరకి వచ్చాడు. దావీదు అబ్నేరుకు, అతని మనుషులకు విందు చేయించాడు.
21అప్పుడు అబ్నేరు “నేను వెళ్లి ఇశ్రాయేలు వారినందరినీ నా రాజు అయిన నీ సమక్షంలో సమకూర్చి, వారు నీతో ఒప్పందం చేసేలా, నీ చిత్త ప్రకారంగా నువ్వు రాజ్యాధికారం చేపట్టి నువ్వు కోరుకున్నదాని అంతటినీ పాలించేలా చేస్తాను” అని దావీదుతో చెప్పి అతని దగ్గర అనుమతి తీసుకుని శాంతికరంగా వెళ్లిపోయాడు.
22దావీదు సేవకులు, యోవాబు యుద్ధంలో పెద్ద మొత్తంలో దోచుకున్న దోపుడు సొమ్ము తీసుకు వచ్చే సమయానికి అబ్నేరు హెబ్రోనులో దావీదు దగ్గర లేడు. ఆప్పటికే దావీదు దగ్గర అనుమతి తీసుకుని అతడు శాంతికరంగా వెళ్ళిపోయాడు.
23అయితే యోవాబు, తన సైన్యంతో తిరిగి వచ్చినప్పుడు నేరు కొడుకు అబ్నేరు రాజు దగ్గరికి వచ్చాడనీ, రాజు అతనికి ఆతిథ్యమిచ్చి పంపాడనీ, అతడు శాంతియుతంగా తిరిగి వెళ్ళాడనీ తెలిసికున్నాడు.
24అతడు రాజు దగ్గరికి వచ్చి “రాజా విను, నువ్వు చేసిన పనేంటి? అబ్నేరు నీ దగ్గరికి వచ్చినప్పుడు అతణ్ణి ఎందుకు తిరిగి వెళ్లనిచ్చావు?
25నేరు కొడుకు అబ్నేరు గురించి నీకు తెలీదా? నిన్ను మోసం చేసి నీ ప్రణాళికలూ, నువ్వు చేసే పనులూ తెలుసుకొనేందుకు అతడు వచ్చాడు” అని అన్నాడు.
26అతడు దావీదు దగ్గర నుండి బయలుదేరి అబ్నేరును వెనక్కి పిలిపించడానికి మనుషులను పంపాడు. వారు వెళ్లి సిరా అనే బావి దగ్గర నుండి అతణ్ణి వెనక్కి తీసుకు వచ్చారు. అతడు తిరిగి వచ్చిన సంగతి దావీదుకు తెలీదు. యోవాబు అబ్నేరు చంపడం
27అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు యోవాబు “విషయాలు ఎవరికీ వినబడకుండా రహస్యంగా మాట్లాడాలి” అని చెప్పి అతణ్ణి ద్వారం దగ్గరికి ఏకాంతంగా తీసుకు వచ్చాడు. అక్కడ తన సోదరుడు అశాహేలు ప్రాణం తీసినందుకు ప్రతీకారంగా అబ్నేరును కడుపులో పొడిచి చంపేశాడు.
28ఆ తరువాత ఈ సంగతి దావీదుకు తెలిసి అతడు ఈ విధంగా అనుకున్నాడు “నేనూ, నా రాజ్యమూ నేరు కొడుకు అబ్నేరు ప్రాణం తీసిన విషయంలో యెహోవా దృష్టికి ఎప్పటికీ నిరపరాధులమే.
29ఈ దోషం యోవాబు మీదా, అతని తండ్రి సంతానమంతటి మీదా నిలుస్తుంది గాక. యోవాబు సంతానంలో గాయాలు ఉన్నవారు, కుష్టురోగులు, ముసలివారు, కత్తి చేత హతమయ్యేవారు, తిండి లేనివారు తప్పక ఉంటారు గాక” అన్నాడు.
30ఆ విధంగా యోవాబు, అతని సోదరుడు అబీషై, గిబియోను యుద్ధంలో అబ్నేరు తమ సోదరుడు అశాహేలును చంపిన దానికి ప్రతీకారం తీర్చుకున్నారు.
31దావీదు “మీ బట్టలు చింపుకుని గోనెపట్ట కట్టుకుని అబ్నేరు శవం ముందు నడుస్తూ విలపించండి” అని యోవాబుకు, అతనితో ఉన్నవారికందరికీ ఆజ్ఞ ఇచ్చాడు.
32రాజు కూడా స్వయంగా పాడె వెంట నడిచాడు. వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టినప్పుడు రాజు అబ్నేరు సమాధి దగ్గర బిగ్గరగా ఏడ్చాడు. అక్కడ సమకూడిన వారంతా ఏడ్చారు.
33రాజు అబ్నేరును గూర్చి ఒక విలాప గీతం పాడాడు,
34“అబ్నేరూ, నీచుడైన ఒక మనిషి చనిపోయినట్టు నువ్వు చనిపోయావే. నీ చేతులకు గాయాలు లేకుండా, నీ కాళ్లకు సంకెళ్లు వేయకుండా, అక్రమం చేసేవాడి ముందు ఒకడు పడినట్టు నువ్వు పడిపోయావు గదా.” రాజు ఈ విధంగా గీతం గొంతెత్తి పాడినప్పుడు ప్రజలంతా విని, ఇంకా ఎక్కువగా ఏడ్చారు.
35ఇంకా రాత్రి కాకముందు ప్రజలు దావీదు దగ్గరికి వచ్చి ఏమైనా తినమని అతణ్ణి బతిమిలాడారు. దావీదు “సూర్యుడు అస్తమించక ముందు నేను ఏదైనా ఆహారం తీసుకొంటే దేవుడు నాకు ఎంతో కీడు కలిగిస్తాడుగాక” అని ఒట్టు పెట్టుకున్నాడు.
36ప్రజలంతా ఈ విషయం తెలుసుకుని సంతోషించారు. ఇప్పటి వరకూ రాజు చేసినదంతా ప్రజల దృష్టికి అంగీకారమైనట్టు ఇది కూడా వారి దృష్టికి అంగీకారమయ్యింది.
37నేరు కొడుకు అబ్నేరు హత్య రాజు పథకం ప్రకారం చేయించింది కాదని ఆ రోజున ఇశ్రాయేలు వారికందరికీ తెలిసింది.
38తరువాత రాజు తన సేవకులను పిలిచి వారితో ఇలా అన్నాడు. “ఈ రోజు చనిపోయిన వాడు ఇశ్రాయేలు వారిలో ముఖ్యమైన వాడనీ ప్రధానుల్లో ఒకడనీ మీకు తెలిసే ఉంటుంది.
39పట్టాభిషేకం అయిన నేను ఈ రోజు బలం లేనివాడినయ్యాను. సెరూయా కొడులైన ఈ వ్యక్తులు నాకంటే బలమైనవారు. వారు చేసిన దుష్టకార్యాలను బట్టి వారు కీడు చేసిన ప్రకారం యెహోవా వారికి ప్రతీకారం చేస్తాడు గాక.”
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
The Indian Revised Version Holy Bible in Telugu.
Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.

Bible text licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0).Original Telugu Scripture and full source copyright terms. This verse-only display adapts the original presentation by removing book introductions, editorial headings, source HTML formatting, and inline explanatory footnote popups while preserving Scripture wording and combined original verse ranges. This presentation of the Bible text remains under CC BY-SA 4.0; the copyright holder does not necessarily endorse these changes. Divine Threads study content is independently authored and separate from the licensed Scripture text.