ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) తెలుగు — 2019

1 సమూయేలు 13

ఈ అధ్యాయాన్ని తెలుగులో చదవవచ్చు. Divine Threads అధ్యయనాలు తరువాత జోడించబడతాయి.

1సౌలు రాజుగా పాలించడం ఆరంభించినపుడు అతని వయస్సు ముప్ఫై ఏళ్ళు. అతడు రెండేళ్ళు ఇశ్రాయేలీయులను పాలించిన తరువాత
2ఇశ్రాయేలీయుల్లో మూడు వేలమందిని ఏర్పరచుకున్నాడు. వీరిలో రెండు వేలమంది మిక్మషు ప్రాంతంలోని బేతేలు కొండలో సౌలు దగ్గర ఉండగా, వెయ్యిమంది బెన్యామీనీయుల ఊరు గిబియాలో యోనాతాను దగ్గర ఉన్నారు. మిగిలిన వారిని అతడు తమ తమ గుడారాలకు పంపివేశాడు.
3యోనాతాను గెబాలో ఉన్న ఫిలిష్తీయుల గుంపును సంహరించినపుడు ఆ విషయం ఫిలిష్తీయులకు తెలిసింది. దేశంలోని హెబ్రీయులంతా ఈ వార్త వినాలని సౌలు ప్రచారం చేయించాడు.
4సౌలు ఫిలిష్తీయుల గుంపును సంహరించడం వల్ల తమపై ఫిలిష్తీయులు విరోధం పెంచుకొన్నారని ఇశ్రాయేలీయులకు తెలిసినప్పుడు వారంతా గిల్గాలులో సౌలు దగ్గరకి చేరుకున్నారు.
5ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్దం చేయడానికి ముప్ఫై వేల రథాలు, ఆరు వేలమంది గుర్రపు రౌతులు, సముద్రం ఒడ్డున ఉండే ఇసుక రేణువులంత విస్తారమైన జనసమూహాన్ని సమకూర్చుకుని బయలుదేరారు. వీరంతా బేతావెను తూర్పుదిక్కున మిక్మషులో దిగారు.
6ఇశ్రాయేలీయులు భయపడుతూ తామంతా ప్రాణాపాయంలో పడిపోయినట్టు గ్రహించి కొండ గుహల్లో, పొదల్లో, బండసందుల్లో, ఉన్నత స్థలాల్లో, సొరంగాల్లో దాక్కున్నారు.
7కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాదు దేశానికి, గిలాదుకు వెళ్ళిపోయారు. అయితే సౌలు ఇంకా గిల్గాలులోనే ఉన్నాడు. ప్రజలంతా భయపడుతూనే అతణ్ణి అనుసరించారు.
8సమూయేలు చెప్పినట్టు అతడు వారం రోజులు వేచి ఉండి, సమూయేలు ఇంకా గిల్గాలుకు రాకపోవడం, ప్రజలు తన నుండి చెదరిపోవడం చూసి
9హోమ బలిని, శాంతి బలిని నా దగ్గరికి తీసుకు రమ్మని చెప్పి హోమబలి అర్పించాడు.
10అతడు హోమబలి అర్పించడం ముగియగానే సమూయేలు అక్కడికి వచ్చాడు. సౌలు అతణ్ణి చూసి అతనికి వందనాలు చెబుతూ ఎదురు వెళ్ళాడు.
11సమూయేలు అతణ్ణి చూసి “నువ్వు చేసిన పని ఏమిటి?” అని అన్నాడు. అందుకు సౌలు “ప్రజలు నానుండి చెదరిపోవడం, అనుకున్న సమయానికి నువ్వు రాకపోవడం, ఫిలిష్తీయులు మిక్మషులో సమకూడడం నేను గమనించి
12ఇక యెహోవాకు శాంతి బలి అర్పించక ముందే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నాపై దాడి చేస్తారనుకుని నా అంతట నేనే తెగించి హోమబలి అర్పించాను” అన్నాడు.
13అప్పుడు సమూయేలు ఇలా చెప్పాడు. “నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞ గైకొనకుండా నీవు అవివేకంగా ప్రవర్తించావు. ఇశ్రాయేలీయులపై నీ రాజ్యాధికారాన్ని కలకాలం స్థిరంగా ఉంచాలని యెహోవా తలచాడు. అయితే నీ అధికారం నిలబడదు.
14యెహోవా తన హృదయానుసారియైన ఒకణ్ణి కనుగొన్నాడు. నీకు ఆజ్ఞాపించినట్టు నువ్వు చెయ్యలేకపోయావు కాబట్టి యెహోవా తన ప్రజలపై అతణ్ణి రాజుగా నియమిస్తాడు.”
15సమూయేలు లేచి, ప్రయాణమై గిల్గాలు నుండి బెన్యామీనీయుల గోత్రస్థానం గిబియాకు వచ్చాడు. సౌలు తన దగ్గర సమకూడిన ప్రజలను లెక్కపెట్టినపుడు వారు సుమారు ఆరు వందలమంది ఉన్నారు. ఆయుధాలు లేని ఇశ్రాయేలీ సైనికులు
16సౌలు, అతని కుమారుడు యోనాతాను, తమ దగ్గర ఉన్న వారితో కలసి బెన్యామీనీయుల గిబియాకు చేరుకున్నారు. ఫిలిష్తీయులు మిక్మషులో దిగారు.
17ఫిలిష్తీయుల దండు నుండి దోచుకొనేవారు మూడు గుంపులుగా బయలుదేరారు. ఒక గుంపు షూయాలు దేశానికి ఒఫ్రావైపుగా వెళ్లే దారిలో కాపు కాశారు.
18రెండవ గుంపు బేత్‌ హోరోనుకు వెళ్లే దారిలో, మూడవ గుంపు అరణ్యం దగ్గరలోని జెబోయిము లోయ సరిహద్దు దారిలో కాపుకాశారు.
19హెబ్రీయులు తమ కోసం కత్తులు, ఈటెలు తయారు చేయించుకొంటారేమోనని ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల దేశమంతటిలో కమ్మరివాళ్ళు ఎవరూ ఉండకుండాా చేశారు.
20కాబట్టి ఇశ్రాయేలీయులంతా తమ నాగటి కర్రలు, పారలు, గొడ్డళ్ళు, కొడవళ్ళు పదును పెట్టుకోవడానికి ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది.
21నాగటి కర్రలకు, పారలకు, మూడు ముళ్ళు ఉండే కొంకీలకు, గొడ్డళ్ళకు పదును పెట్టడానికి ఆకురాయి మాత్రమే వారి దగ్గర ఉంది.
22అందువల్ల యుద్ధం జరిగే సమయంలో సౌలు, యోనాతానుల దగ్గరున్న వారిలో ఒక్కరి చేతిలో కూడా ఒక కత్తిగానీ, యీటెగానీ లేకుండా పోయింది. సౌలు దగ్గర, అతని కుమారుడు యోనాతాను దగ్గర మాత్రమే అవి ఉన్నాయి.
23ఫిలిష్తీయుల సైన్యపు కాపలాదారులు కొందరు మిక్మషు కనుమకు వెళ్ళి అక్కడ ఉన్నారు.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
The Indian Revised Version Holy Bible in Telugu.
Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.

Bible text licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0).Original Telugu Scripture and full source copyright terms. This verse-only display adapts the original presentation by removing book introductions, editorial headings, source HTML formatting, and inline explanatory footnote popups while preserving Scripture wording and combined original verse ranges. This presentation of the Bible text remains under CC BY-SA 4.0; the copyright holder does not necessarily endorse these changes. Divine Threads study content is independently authored and separate from the licensed Scripture text.