ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) తెలుగు — 2019

యోహాను రాసిన మొదటి పత్రిక 5

ఈ అధ్యాయాన్ని తెలుగులో చదవవచ్చు. Divine Threads అధ్యయనాలు తరువాత జోడించబడతాయి.

1యేసే క్రీస్తు అని నమ్మినవారంతా దేవుని ద్వారా పుట్టినవాళ్ళే. తండ్రిగా అయిన వాణ్ణి ప్రేమించిన వారంతా ఆయన ద్వారా పుట్టినవాణ్ణి కూడా ప్రేమిస్తారు.
2మనం దేవుణ్ణి ప్రేమిస్తూ, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉంటే, దేవుని పిల్లలను ప్రేమిస్తున్నామని దాని వల్ల మనకు తెలుసు.
3ఆయన ఆజ్ఞలను పాటిస్తే మనం దేవుణ్ణి ప్రేమించినట్టే. ఆయన ఆజ్ఞలు భారం కాదు.
4దేవుని ద్వారా పుట్టినవారు అందరూ లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించింది మన విశ్వాసమే.
5లోకాన్ని జయించేది ఎవరు? యేసు దేవుని కుమారుడు అని నమ్మినవాడే!
6నీళ్ళ ద్వారా, రక్తం ద్వారా వచ్చినవాడు యేసు క్రీస్తే. ఆయన కేవలం నీటి ద్వారా మాత్రమే కాదు. నీళ్ళ ద్వారా, రక్తం ద్వారా కూడా వచ్చాడు. దేవుడు ఆత్మ రూపి గనక ఆత్మే ఇది సత్యమని సాక్షమిస్తున్నాడు.
7సాక్ష్యం ఇచ్చే వారు ముగ్గురున్నారు.
8ఆత్మ, నీళ్ళు, రక్తం-ఈ మూడూ ఒకే సాక్ష్యం చెబుతున్నాయి.
9మనుషుల సాక్ష్యం మనం స్వీకరిస్తాం. కాని దేవుని సాక్ష్యం అంతకన్నా గొప్పది. దేవుని సాక్ష్యం ఆయన కుమారుణ్ణి గూర్చినదే.
10దేవుని కుమారుని పట్ల విశ్వాసం ఉంచిన వారిలోనే సాక్ష్యం ఉంటుంది. దేవుణ్ణి నమ్మని వ్యక్తి దేవుణ్ణి అబద్ధికుడుగా చేసినట్టే. ఎందుకంటే దేవుడు తన కుమారుని విషయం చెప్పిన సాక్ష్యం ఆ వ్యక్తి నమ్మలేదు.
11ఆ సాక్ష్యం ఇదే, దేవుడు మనకు శాశ్వత జీవం ఇచ్చాడు. ఈ జీవం తన కుమారుడిలో ఉంది.
12కుమారుడు ఉన్నవాడికి జీవం ఉంది. దేవుని కుమారుడు లేని వాడికి జీవం లేదు.
13దేవుని కుమారుని నామంలో విశ్వాసం ఉంచిన మీకు శాశ్వత జీవం ఉందని మీరు తెలుసుకోడానికి ఈ సంగతులు మీకు రాస్తున్నాను.
14ఆయన దగ్గర మనకున్న ధైర్యం ఇదే, ఆయన చిత్తానికి అనుగుణంగా మనం ఏది అడిగినా, ఆయన మన విన్నపం వింటాడు.
15మనం అడిగిన విషయాలన్నీ ఆయన వింటాడని తెలిస్తే, మనం అడిగినవి మనకు కలిగాయని మనకు తెలుసు.
16తన సోదరుడు, మరణం కలిగించని పాపం చెయ్యడం ఎవరైనా చూస్తే, చూసినవాడు ఆ సోదరుని కోసం ప్రార్థించాలి. అతణ్ణి బట్టి మరణం కలిగించని పాపం చేసిన వాడికి దేవుడు జీవం ఇస్తాడు. మరణం కలిగించే పాపం ఉంది. దాని విషయంలో అతడు ప్రార్థించాలని నేను చెప్పను.
17సమస్త దుర్నీతీ పాపమే. కాని మరణం కలిగించని పాపం కూడా ఉంది.
18దేవుని ద్వారా పుట్టినవాడు పాపం చెయ్యడు. దేవుని ద్వారా పుట్టిన వాణ్ణి దేవుడు పాపం నుండి కాపాడుతాడు. దుష్టుడు ముట్టకుండా ఉంచుతాడు.
19మనం దేవుని సంబంధులం అని మనకు తెలుసు. లోకమంతా దుష్టుని ఆధీనంలో ఉంది.
20దేవుని కుమారుడు వచ్చి మనకు అవగాహన ఇచ్చాడు. నిజమైన దేవుడెవరో అర్థం అయ్యేలా చేశాడు. మనం ఆ నిజ దేవునిలో, ఆయన కుమారుడు యేసు క్రీస్తులో ఉన్నాం. ఈయనే నిజమైన దేవుడూ శాశ్వత జీవం కూడా.
21పిల్లలూ, విగ్రహాలకు దూరంగా ఉండండి.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
The Indian Revised Version Holy Bible in Telugu.
Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.

Bible text licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0).Original Telugu Scripture and full source copyright terms. This verse-only display adapts the original presentation by removing book introductions, editorial headings, source HTML formatting, and inline explanatory footnote popups while preserving Scripture wording and combined original verse ranges. This presentation of the Bible text remains under CC BY-SA 4.0; the copyright holder does not necessarily endorse these changes. Divine Threads study content is independently authored and separate from the licensed Scripture text.