ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) తెలుగు — 2019

కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 11

ఈ అధ్యాయాన్ని తెలుగులో చదవవచ్చు. Divine Threads అధ్యయనాలు తరువాత జోడించబడతాయి.

1నేను క్రీస్తులాగా ప్రవర్తిస్తున్న ప్రకారం మీరూ నాలాగా ఉండండి.
2మీరు అన్ని విషయాల్లో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ, నేను మీకు ఉపదేశించిన పద్ధతులను అనుసరిస్తున్నారని మిమ్మల్ని మెచ్చుకొంటున్నాను.
3మీరు తెలుసుకోవలసింది ఏమంటే, పురుషునికి శిరస్సు క్రీస్తు. స్త్రీకి శిరస్సు పురుషుడు. క్రీస్తుకు శిరస్సు దేవుడు.
4తన తల కప్పుకుని ప్రార్థన చేసే పురుషుడు తన తలను అవమానపరచినట్టే.
5తన తల కప్పుకోకుండా ప్రార్థన చేసే, లేక ప్రవచించే స్త్రీ తన తల అవమానపరచినట్టే. ఎందుకంటే అది ఆమె తల గొరిగించుకున్న దానితో సమానం.
6తన తల కప్పుకోని స్త్రీ తన తలవెంట్రుకలు కత్తిరించుకోవాలి. అలా కత్తిరించుకోవడం, లేక పూర్తిగా వెంట్రుకలు తీసివేయడం ఆమెకు అవమానమైతే ఆమె తల కప్పుకోవాలి.
7పురుషుడు దేవుని పోలిక, ఆయన మహిమ. కాబట్టి అతడు తన తల కప్పుకోకూడదు. స్త్రీ పురుషుని మహిమ.
8అదెలాగంటే, స్త్రీ పురుషుని నుండి కలిగింది గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు.
9స్త్రీని పురుషుని కోసం సృష్టించడం జరిగింది గాని పురుషుణ్ణి స్త్రీ కోసం కాదు.
10కాబట్టి దేవదూతల కారణంగా స్త్రీకి తల మీద ఒక అధికార సూచన ఉండాలి.
11అయితే ప్రభువులో స్త్రీకి వేరుగా పురుషుడు, పురుషునికి వేరుగా స్త్రీ ఉండరు.
12ఏ విధంగా స్త్రీ పురుషుని నుండి కలిగిందో, అలాగే పురుషుడు స్త్రీ మూలంగా కలిగాడు. అయితే సమస్తమూ దేవునినుండే కలుగుతాయి.
13మీరే చెప్పండి. స్త్రీ తల కప్పుకోకుండా దేవునికి ప్రార్థన చేయడం సరైనదేనా?
14పురుషుడు తల వెంట్రుకలు పెంచుకోవడం అతనికి అవమానమని సహజంగా మీకు అనిపించడం లేదా?
15దేవుడు స్త్రీకి తల వెంట్రుకలు పైటచెంగుగా ఇచ్చాడు కాబట్టి ఆమె వాటిని పెంచుకోవడం ఆమెకు ఘనత అని మీకు స్వతహాగా తెలుసు కదా!
16ఈ విషయంలో వేరే వాదనలు చేసేవాడు, మాలో గానీ, దేవుని సంఘంలో గానీ దీనికి వ్యతిరేకంగా వేరొకఅభిప్రాయం లేదని తెలుసుకోవాలి. ప్రభువు బల్ల దగ్గర అక్రమాలు ఖండన
17మీకు ఈ క్రింది ఆజ్ఞనిస్తూ మిమ్మల్నేమీ మెచ్చుకోవడం లేదు. ఎందుకంటే మీరు సమావేశం కావడం ఎక్కువ కీడుకే కారణమౌతున్నది గానీ మేలుకు కాదు.
18మొదటి సంగతి, మీరు సమావేశమైనప్పుడు మీలో తగాదాలు ఉన్నాయని వింటున్నాను. కొంతమట్టుకు ఇది నిజమే అనిపిస్తుంది.
19మీలో నిజంగా యోగ్యులు ఎవరో తెలియాలంటే మీలో భిన్నాభిప్రాయాలు ఉండవలసిందే.
20మీరంతా సమావేశమై కలిసి తినేది ప్రభు రాత్రి భోజనం కాదు.
21ఎందుకంటే మీరు ఆ భోజనం తినేటప్పుడు ఒకడికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తానే తింటున్నాడు. దీనివలన ఒకడు ఆకలితో ఉండగానే ఇంకొకడు బాగా తిని తాగి మత్తులో మునిగిపోతాడు.
22ఏమిటిది? తిని తాగడానికి మీకు ఇళ్ళు లేవా? దేవుని సంఘాన్ని చిన్నచూపు చూస్తూ లేని వారిని చిన్నచూపు చూస్తూ? మీతో ఏమి చెప్పాలి? మిమ్మల్ని మెచ్చుకోమంటారా? ఈ విషయంలో మిమ్మల్ని మెచ్చుకోలేను. ప్రభువు బల్ల క్రమం, పరమార్థం
23నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువే నాకు ఇచ్చాడు. ప్రభు యేసు అప్పగించబడిన రాత్రి, ఆయన ఒక రొట్టె చేత పట్టుకున్నాడు.
24స్తుతులు చెల్లించిన తరువాత దాన్ని విరిచి, “ఇది మీ కోసమైన నా శరీరం. తీసుకుని తినండి. నా జ్ఞాపకార్థం దీన్ని చేయండి” అని చెప్పాడు.
25భోజనం చేసిన తరువాత ఆ విధంగానే ఆయన పాత్రను చేత పట్టుకుని, “ఈ పాత్ర నా రక్తం మూలంగా చేసిన కొత్త నిబంధన. మీరు దీన్ని తాగిన ప్రతిసారీ నన్ను జ్ఞాపకం చేసుకోడానికి దీన్ని చేయండి” అన్నాడు.
26మీరు ఈ రొట్టెను తిని, ఈ పాత్రలోది తాగిన ప్రతిసారీ ప్రభువు వచ్చేవరకూ ఆయన మరణాన్ని ప్రకటిస్తున్నారు.
27కాబట్టి ఎవరైతే అయోగ్యమైన విధానంలో ప్రభువు రొట్టెను తిని ఆయన పాత్రలోది తాగుతారో వారు ప్రభువు శరీరం, ఆయన రక్తం విషయంలో అపరాధులు అవుతారు.
28కాబట్టి ప్రతి ఒక్కడూ తనను తాను పరీక్షించుకుని ఆ రొట్టె తిని, ఆ పాత్రలోది తాగాలి.
29ఎందుకంటే ప్రభువు శరీరం గురించి సరైన అవగాహన లేకుండా దాన్ని తిని, తాగేవాడు తన మీదికి శిక్ష కొని తెచ్చుకుంటున్నాడు.
30ఈ కారణం చేతనే మీలో చాలామంది నీరసంగా, అనారోగ్యంగా ఉన్నారు. చాలామంది చనిపోయారు కూడా.
31అయితే మనలను మనం పరిశీలించుకుంటూ ఉంటే మన పైకి తీర్పు రాదు.
32మనం తీర్పు పొందినా లోకంతో పాటు శిక్షకు గురి కాకుండా ప్రభువు మనలను శిక్షించి సరిదిద్దుతున్నాడు.
33కాబట్టి నా సోదర సోదరీలారా, మీరు భోజనం చేయడానికి వచ్చినప్పుడు ఒకడి కోసం ఒకడు వేచి ఉండండి.
34మీరు ఇలా కలుసుకోవడం మీపై తీర్పు రావడానికి కారణం కాకుండేలా, ఆకలి వేసినవాడు తన ఇంట్లోనే భోజనం చేసి రావాలి. మీరు రాసిన మిగతా సంగతులను నేను మీ దగ్గరకి వచ్చినప్పుడు సరిచేస్తాను.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
The Indian Revised Version Holy Bible in Telugu.
Copyright © 2017, 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.

Bible text licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0).Original Telugu Scripture and full source copyright terms. This verse-only display adapts the original presentation by removing book introductions, editorial headings, source HTML formatting, and inline explanatory footnote popups while preserving Scripture wording and combined original verse ranges. This presentation of the Bible text remains under CC BY-SA 4.0; the copyright holder does not necessarily endorse these changes. Divine Threads study content is independently authored and separate from the licensed Scripture text.